.
Mohammed Rafee
… కాఫీ కిక్కు అంత ఇంతా కాదు! బొత్సను ఏమీ అనకండి!
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, బ్రష్ చేశాక, కాసిన్ని మంచి నీళ్లు తాగాక, కాఫీ కప్పు పట్టుకుని, హిందూ న్యూస్ పేపర్ అందుకుని కూర్చుంటే ఉంటుంది చూడండి… ఆ కిక్కే వేరప్పా! కాఫీ అంటే అంతే మరి!
Ads
ఏం కలిపి కాఫీ చేస్తారో కానీ, ఇప్పుడు ఎన్నో ఫ్లెవర్లూ వచ్చాయి! మొన్న వరంగల్ లో రెండు రోజులు హోటల్ లో ఉంటే అక్కడ కెటిల్ పక్కనే పెట్టిన కాఫీ పొడి ప్యాకెట్స్ భలే అందంగా కనిపించాయి! పక్కనే టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి!
కానీ, అవి మామూలుగా ఉన్నాయి! ఆ కాఫీ కలుపుకుని తాగితే వెంటవెంటనే ఇంకో రెండు కప్పులు తాగాలనిపించింది! ఎంతో హాయిగా అనిపించింది! కాఫీ కిక్కే వేరబ్బా! ఇక్కడే కాదు, అమెరికా వెళ్లినా ఇంకే దేశం వెళ్లినా హోటల్ చెక్ ఇన్ కాగానే నా కాళ్ళు కాఫీ ట్రే వైపు వెళతాయి!
ఏయే ఫ్లెవర్స్ పెట్టాడో చూస్తాను, వెంటనే ఒక కప్పు సిప్ చేస్తాను! రఫీకి కాఫీ అంటే పిచ్చిరా అనిపించేంత పిచ్చి నాకు!
బిగ్ బాస్ లో నాలాంటిదే ఇంకో కాఫీ పిచ్చిది కనిపించింది రెండు రోజుల క్రితం! కర్ణాటక పిల్ల, సీరియల్ నటి తనూజ! ఆ అమ్మాయీ అంతే! ఆ అమ్మాయి కెమెరాల చుట్టూ తిరుగుతూ కాఫీ ప్లీజ్ అని పదే పదే అడుక్కుంటే రెండు వారాల తరువాత చిన్న డబ్బాలో కాఫీ పొడి పంపిస్తే… ఆ తరువాత ఆ అమ్మాయి ఆనందం చూడాలి!
ముందు ఆ ప్లాస్టిక్ బాక్స్ మూత తీసి గట్టిగా శ్వాస తీసుకుని సువాసన పీలుస్తూ ఈ లోకాన్ని మరచిపోయింది! కాఫీ చేసుకున్నాక ఫస్ట్ సిప్ రుచి చూసి పరవశించిపోయింది! కాఫీ అంటే అంతే మరి! అంత కిక్ ఉంటుంది!
(తనూజ కాఫీ కథ మరో కథనంలోనూ చెప్పుకుందాం)… పక్క రాష్ట్రంలో పెద్దల సభలో కాఫీ అధ్యక్షా అని ఇవాళ వినిపించింది! కాఫీ అడిగింది సీనియర్ వైసీపీ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ!
పాపం ఆయన బాధ ఏమిటంటే, పక్కనున్న ఎమ్మెల్యేల క్యాంటీన్ అంటే శాసనసభ క్యాంటీన్ లో కాఫీ ఘుమఘుమలాడుతూ పొగలు కక్కుతూ యమ టేస్టీగా ఉందట! అదే శాసన మండలి క్యాంటీన్ లో లభిస్తున్న కాఫీ పూర్తిగా రుచి పచ లేదట! పైగా చల్లగా ఉంటుందట! ఇదీ బొత్స గారి కాఫీ వేదన!
చట్టసభలకు పంపించింది ఆఫ్ట్రాల్ కాఫీ కోసమా అని ఎవరూ అనకండి! అలా అన్నారంటే మీకు కాఫీ మహిమ రుచి తెలియదని అర్ధం! ప్రజా సమస్యలు పక్కనపెట్టి కాఫీ అడుక్కోవడం ఏమిటని అసలు అనకండి! కాఫీ రుచి వేరు! కాఫీ తాగితే వచ్చే కిక్కు వేరు! కాఫీ కాఫీయే! బొత్సను ఏమీ అనకండి పాపం! – డా. మహ్మద్ రఫీ
Share this Article