.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 9 ఇక అట్టర్ ఫ్లాపే గతి అని అందరూ తేల్చేస్తున్న వేళ… ఈ వీకెండ్ షో కాస్త రక్తికట్టింది… అది నాగార్జున వల్ల కాదు… పలువురు కంటెస్టెంట్లకు పెట్టిన త్యాగాల పోటీ కాస్త టచింగ్ అనిపించింది…
సంజనను మిడ్ వీక్ ఎలిమనేషన్ అని ప్రకటించారు మొదట… అదేదో పిచ్చి సాకు… చూసే ప్రేక్షకులకు అర్థమైంది… ఇలాంటివి ఎన్ని చూడలేదు..? మరో స్క్రిప్టెడ్ డ్రామా మొదలు అని… సీక్రెట్ రూంకు పంపిస్తారులే అనుకున్నదే…
Ads
కానీ ఆమె యాక్టివ్ కంటెస్టెంట్, హౌజులో ఉన్న కామనర్స్ నాసిరకంకన్నా బెటరే… సో, ఆమెను తిరిగి హౌజులోకి తీసుకొస్తారని అనుకున్నదే… కాకపోతే ఓ చిత్రమైన టాస్కులు పెట్టారు… కాస్త బెటర్ డ్రామా… ఎలాగంటే..?
కొందరు కంటెస్టెంట్లు గనుక చెప్పిన త్యాగాలు చేస్తే తిరిగి హౌజులోకి పంపిస్తామని షరతు… ఇమ్మూను పిలిచి, నీ కెప్టెన్సీ వదిలేస్తావా అనడిగారు… మరోమాట లేకుండా కెప్టెన్ బ్యాడ్జి ఊడబీకి ఇచ్చేశాడు… తను ఆట బాగా ఆడుతున్నాడు… కామెడీ, ఎమోషన్, టాస్కులు ఎట్సెట్రా అన్నీ బాగా కుదురుతున్నాయి తనకు…
తరువాత తనూజను హౌజులో ఉన్నన్ని రోజులూ కాఫీ మానేస్తావా అనడిగారు… ఆమె షాక్… అసలే కాఫీ పిచ్చిది… బిగ్‌బాస్‌ను అడిగీ అడిగీ కాస్త కాఫీ పౌడర్ తెప్పించుకుని, దాని వాసనకే పరవశించిపోయేంత కాఫీ పిచ్చి తనకు… దాన్ని కూడా సంజన చోరీ చేసింది… ఐనాసరే ఆ సంజన కోసం ఇక కాఫీ తాగను అని చెప్పింది… హౌజులో ఉన్నవాళ్లలో టాప్ ఫోర్ లెక్క తీస్తే అందులో సంజన కూడా ఉంటుంది…
శ్రీజను కేవలం ఒకే ఒక్క డ్రెస్సుతో హౌజులో మిగిలిన రోజులన్నీ గడపాలని అడిగారు, ఆమె నో అనేసింది… హౌజులో బాగా విసిగిస్తున్న కేరక్టర్లలో శ్రీజ ప్లస్ ప్రియ టాప్… తరువాత భరణిని నువ్వు అపురూపంగా చూస్తున్న డాలర్‌ను వదిలేసి మిగతా రోజులు గడపాలి అనడిగారు… అసలు అది లేకపోతే హౌజులోకే రాను అన్నాడు కదా తను మొదట్లో…
ఐనా వదిలేయడానికి రెడీ అయిపోయి, దాన్ని స్టోర్ రూంలో పెట్టేశాడు… సుమన్ శెట్టి సిగరెట్ మానడానికి నో అన్నాడు… రీతూ ఏడుస్తూనే తన జుట్టు కత్తిరించుకోవడానికి రెడీ అయింది… మొత్తానికి నలుగురి త్యాగాలతో సంజన తిరిగి హౌజులోకి అడుగు పెట్టింది… పర్లేదు శనివారం ఎపిసోడ్ ఆద్యంతమూ రక్తికట్టింది…
మరొకటి చెప్పుకోవాలి… సంచాలక్‌గా శ్రీజ మూర్ఖపు ధోరణిని నాగార్జున ఎండగట్టాడు.,. రాము రాథోడ్ డబుల్ స్టాండర్డ్స్‌ను ఆరబెట్టాడు… అన్నింటికీ మించి ఓ సైకో కేరక్టర్ ఉందిగా… హరీష్… లత్కోర్ అని ఏదో మాట తూలాడు… తను డిఫెండ్ చేసుకునే విధానమే ఓ చిరాకు యవ్వారం… తనకూ క్లాస్ పీకాడు నాగార్జున… సో, ఏతావాతా నిన్నటి ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే సాగింది… ఈరోజు షోలో ప్రియను ఇంటికి పంపిస్తాడు నాగార్జున..!! అసలు కామనర్స్ అందరినీ పంపించేస్తే ఓ పనైపోతుందిగా నాగ్..!!
అరె, నవ్వు పుట్టించే అసలు విషయం చెప్పనే లేదు కదూ… ఈ త్యాగాల అధ్యాయం ముగిశాక ఏదో కూల్ డ్రింక్ ప్రమోషన్ యాడ్ చేయించారు… అప్పుడు రీతూ ఫుల్ హెయిర్‌తో కనిపించింది… ఇమ్మూ చేతికి కెప్టెన్ బ్యాడ్జి కూడా ఉంది… తనూజ కాఫీ తాగుతున్నట్టు చూపిస్తే బాగుండేది హహహ..!!
Share this Article