Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పదండి పోదాం… తొక్కుకుంటూ వాడి కాలికి తోలుచెప్పులమవుదాం…

September 29, 2025 by M S R

.

ఎవడు ఎంత పరిహారాలు ఇచ్చినా పోయిన ప్రాణాలు వెనక్కి రావు… వెల్లువెత్తిన ప్లాస్టిక్ సంతాపాలు ఎవడి కన్నీళ్లూ తుడవవు, ఆ కుటుంబాలను నిలబెట్టవు…

నాలుగు రోజులు ఒకడికొకడు బ్లేమ్ గేమ్… ఏవేవో కుట్రలట.., బురదలు, విచారణలు, మీడియా పుంఖానుపుంఖాల కథనాలు… అంతే… ఈ రాజకీయాల క్షుద్రపూజల్లో ఎన్ని బలితర్పణాలు..? బాధ్యుడికేం బాగానే ఉంటాడు… బాధితుడి బాధ వాడికెందుకు..? ఈ కన్నీళ్లే అక్షింతలుగా ఎదుగుతూనే ఉంటాడు…

Ads

వాడి పేరు అర్జునుడు కావచ్చు, వాడి పేరు విజయుడు కావచ్చు, మరొకడు కావచ్చు, రేపు ఇంకొకడు రావచ్చు… వాడిదేం పోయింది..? మబ్బుల్లో తిరిగే నయా దేవుళ్లు… ఛ, వాళ్లను దేవుళ్లను చేసింది మనమే కదా… అసలు తప్పు మనది… అసలు బాధ్యులం మనమే…

మనదే ఓ సామూహిక ఉన్మాదం… మాస్ హిస్టీరియా… వాడేమైనా మొక్కులు తీరుస్తాడా..? వరాలు ఇస్తాడా..? వాడి ఒక్క చల్లని చూపు కోసం ఏమిటీ ఈ మూఢభక్తి…? ఏమిటీ ఈ మూర్ఖాభిమానం..? ఈ తొక్కిసలాటల్లో మన ప్రాణాల్ని మనమే తీసుకుంటున్నాం… ఆ చిల్లర దేవుళ్లకు మనకు మనమే స్వీయ బలి…

ఎవడు బాధ్యుడు..? ఎవడు నిందార్హుడు..? ఫేస్‌బుక్ మిత్రుడు దాయి శ్రీశైలం చెబుతున్నట్టు… బతుకుల్ని బాటగా వేసిన మనమా..? ఆ బాటలో బాజాప్తా నడుస్తున్న వాడా..?
భుజాల మీద మోస్తున్న మనమా..? ఆ భుజాలనెక్కి కూర్చుని సవారీ చేస్తున్న వాడా..?
ఏందీ తొక్కిసలాట.? ఎలా జరుగుతోంది పదే పదే.?
ఎందుకుపోతున్నాయి మన ప్రాణాలు.. పదులు ఇరవైలు..?

ఒక దిక్కు లోకమంతా లీడర్లను.. హీరోలను బట్టలిప్పి.. బజార్లకు గుంజి తరిమి తరిమి కొడుతుంటే..
మనమేమో.. మన బట్టలే ఇప్పుకొని.. మన బతుకుల్నే బజారుపాలు చేసుకుంటున్నాం…
చర్మాన్ని వొలిసిస్తున్నాం… చెప్పులమై తరిస్తున్నాం…

గుండెల మీద పచ్చబొట్లు.. గుండీలు చింపుకునే కట్టుబాట్లు..
ఎవడు ఎవడికి హీరో.? ఎవడు ఎవనికి లీడరు.?
అమ్మయ్యకు అన్నంబెట్టక.. అభిమాన హీరోకు కనుగుడ్లు పీకిచ్చే కల్చరెక్కడిది.?

హీరో సినిమా తీస్తే.. లీడర్ పార్టీ పెడితే.. సక్సెసై సన్మాన సభలు పెడితే నీకెందుకు ఉబలాటం.. ఉరుకులాట.?
వాడుకదా సంబరాలు చేసుకోవాల్సింది.. వాడివి కదా ప్రాణాలు కిందా మీదా అయ్యేవి.?
ఎవడో కొట్టిన హిట్టుకు నువ్వెందుకు చింపుకుంటున్నవ్.? ఎవడో పెట్టే పార్టీ కోసం నువ్వెందుకు సంపుకుంటున్నవ్.?

తొక్కుకుంటూ.. కుక్కుకుంటూ.. రక్కుకుంటూ.. ప్రాణం పణంగా పెడ్తందుకు నువ్వే ఉన్నవా గోశిలోడవు.?
వాడొచ్చేదే మన సావుల మీద సంపద కూడబెట్టుకునేందుకు గదా.?
కులమనీ.. మతమనీ.. నీతి అనీ.. జాతి అనీ.. రెచ్చగొట్టి చిచ్చుపెట్టి చిల్లరగాళ్లను చేసేందుకే గదా.?

మన మెదళ్లను పొల్యూట్ చేసి.. సెల్యూట్ కొట్టించుకొని కచ్చకచ్చ ఒర్లి.. కాకిరిబీకిరి చేసే కదా అంతా డిప్యూటీ సీఎంలు.. సీఎంలు అయింది.?
అనుభవమైనంక కూడా ఈ ఆత్మార్పణలెందుకు మనకు.?
అర్థమైనంక కూడా ఈ ఆశలెందుకు మనకు.?

నువ్వు పోతే పోయినవ్… చిన్న పోరగాళ్లను తీసుకుపోవడమేందిరా..? వాళ్లను బలి ఇవ్వడమేందిరా..? ఆడోళ్లను వెంటేసుకుని ఉరుకుడేందిరా..? ఐనా వాళ్లు హీరోలేందిరా..? మన బతుకుల్ని బలిగోరే బడా రియల్ విలన్లురా…

వాడెవడో ఇచ్చిన పిలుపుకు దిక్కయి.. నీ భార్యా పిల్లల్ని దిక్కులేని వాళ్లను చేసుడెందుకు.?
మనకిది అర్థంకానంత వరకు ఇట్లనే తొక్కిసలాటలో సస్తూనే ఉందాం.. వాని కాలుకు తోలు చెప్పులమై బతుకుతనే ఉందాం.!! చచ్చీ బతుకుదాం, బతుకుతూ చద్దాం…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions