.
Ashok Kumar Vemulapalli....
రైస్ మిల్లులో బియ్యం డబ్బా భుజాన పెట్టుకుని మోస్తున్న ఒక మహిళ .. మోసి మోసి అలసిపోయి .. బయటకు వెళ్తోంది .. అప్పుడే గుమాస్తా ఎక్కడికి వెళ్తున్నావు అని కటువుగా అడిగాడు
చిటికిన వేలు చూపించింది ఆమె సగం సిగ్గుతో చచ్చిపోతూ .. అప్పుడే ఉచ్చ ఊరిపోయాయా? ఇందాకేగా వెళ్లి లీటర్ పోసి వచ్చావ్ .. వెళ్లి పని చేయ్.. అని అరవడం మొదలు పెట్టాడు
Ads
ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. ఏమి చెప్పాలో ? తన బాధ ఎలా చెప్పాలో అర్ధం కాని పరిస్థితి ఆమెది .. ఒక విధంగా పొట్టకూటి కోసం కూలిపనికి వచ్చిన ఆ పేద మహిళ అనుభవించిన నరకం అది.
ఏడుస్తూనే ఆమె ఆ గుమాస్తా దగ్గరకి వచ్చి సిగ్గు విడిచి చెబుతున్నా .. నేను ముట్టులో ఉన్నాను .. లోపల గుడ్డ మార్చుకోవాలి అని చెప్పింది.
సర్లే.. చావు .. మూడురోజులకోసారి మీకు ముట్టు లెందుకొస్తాయో నాకు అర్ధం కాదు .. అంటూ తన చిరాకంతా ముఖంలోనే చూపించాడు
1998 లో నేను గుడివాడలో రైస్ మిల్లులో ఆపరేటర్ గా (డ్రైవర్ గా ) పని చేస్తున్నప్పుడు జరిగిన ఘటన అది .. నేను ప్రత్యక్ష సాక్షిని ..
ఆడోళ్ళు పాసు పోసుకోవడానికి వెళ్తుంటే ఉచ్చ ఊరిపోయాయా ? అని అనడం సరైన పద్ధతి కాదన్నాను.
దాన్ని అంటే నీకెందుకు రోషం వచ్చింది ? పోనీ అది వచ్చేదాకా ఎలివేటర్ లో బియ్యం నువ్వు పోస్తావా ? అన్నాడు
FCI కి బియ్యం ఎగుమతి చేసేప్పుడు లేదా కాకినాడ పోర్టుకు బియ్యం పంపించే ముందురోజు బియ్యాన్ని పాలిష్ పట్టాలి .. అందు కోసం ముఠా వాళ్ళు ( మగవాళ్ళు ) బియ్యం ఎలివేటర్ల ముందు గుట్టగా పోస్తే .. ఆడ కూలీలు ఆ బియ్యాన్ని ఎలివేటర్ లో డబ్బాల్లో మోసుకెళ్లి పోస్తే ఆ బియ్యం పాలిషర్లలోకి వెళ్లి బయటకు వస్తాయి ..
ఇందుకోసం ప్రతి షిఫ్టులో .. ఇద్దరు ఆడ కూలీలు ఉండేవారు. వాళ్ళంతా శ్రీకాకుళం నుంచి వచ్చిన పేద కుటుంబాలు . వాళ్ళని తూర్పోళ్లు అనేవాళ్ళు ..
పొట్టకూటి కోసం ఎక్కడో శ్రీకాకుళం నుంచి వందల కిలోమీటర్లు ఇవతల ఉన్న కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ కూలి పని చేసేవాళ్ళు.. పని చేసే క్రమంలో అనేక వేధింపులకు అవమానాలకు గురయ్యేవాళ్లు .. లైంగిక వేధింపులు అదనం ..
అక్కడి గుమస్తాలు పిలిచినపుడు ఊక గుట్ట వెనక్కు , తవుడు కొట్లోకి వెళ్ళకపోతే ఇలాంటి వేధింపులు దారుణంగా ఉండేవి .. అప్పటికి నా వయసు కేవలం 16 ఏళ్ళు .. నిజానికి నేను అంతకుముందు అలా బియ్యం డబ్బాలు మోసినవాడినే .. పదో తరగతి అవగానే ఇలా పనిలో చేరిపోయి .. కొద్దిరోజులకి జూనియర్ డ్రైవర్ ( ఆపరేటర్ ) ని అయ్యాను
అప్పుడు మహిళలపై వేధింపులు చూసి జీవితం ఇంతేనా అనిపించేది .. మూటలు మోసే మగాళ్లని చూసి బాధ కలిగించేది .. కనీసం యూరిన్ పాస్ చేయడానికి కూడా వెళ్ళనీయని దీన పరిస్థితి ..
అలాగే బిల్డింగ్ నిర్మాణంలో ఆడవాళ్ళు ఇటుకలు , సిమెంట్ , ఇసుక మోయడానికి వెళ్తారు . ఎక్కడా ఇదే నరకం.. ఇవే వేధింపులు చూసేవాడిని .. ఎందుకంటే నేను కూడా కొద్దిరోజులు తాపీ పనికి కూడా వెళ్ళాను ..
అయితే ఈ బానిసత్వం అప్పుడే కాదు ఇప్పుడూ కొనసాగుతోంది ..
నిజానికి ఈ వేధింపుల పర్వం ఎక్కువై పోయింది.. డబ్బున్నోళ్ళు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తుంటే పేద , మధ్యతరగతి వాళ్ళు ఇలా రోజులు పన్నెండు గంటలకు పైగా పని చేస్తూ ఇలా రకరకాల వేధింపులకు గురవుతున్నారు.
ముఖ్యంగా .. బట్టలషాపులు , నగల షాపులు , హాస్పిటల్స్ , ఎలక్స్ట్రానిక్ షోరూమ్ లు , షాపింగ్ మాల్స్ లో రోజుకి పన్నెండు గంటలు పని చేస్తున్నారు.. ప్రశ్నిస్తే ఉపాధి పోతుందని ఎక్కడా చెప్పలేకపోతున్నారు .. షాపింగ్ మాల్స్ లో అయితే ఆడవాళ్ళు పొద్దున పది గంటలకు వస్తే రాత్రి పది తర్వాత మాల్ క్లోజ్ చేసేవరకు ఉండాల్సిందే ..
పసిపిల్లల్ని సైతం ఇంట్లో వదిలి పనికి వస్తారు .. ఇక రకరకాల వేధింపులు .. అవమానాలు , ఛీత్కారాలు అదనం .. అయినా భరిస్తూ కుటుంబాన్ని పోషించుకోవడానికి నరకం అనుభవిస్తున్నారు ..
మా చెల్లి గుడివాడ లో ఒక సోనోవిజన్ అనే ఎలక్ట్రానిక్ షోరూంలో దాదాపు ఎనిమిదేళ్లు పని చేసింది .. ఉదయం వెళ్తే రాత్రి పదిన్నర వరకు అలా షాప్ లో నిలబడి ఉండాలి ..
వచ్చే కస్టమర్లకి ప్రతి అక్కడి ఎలక్ట్రానిక్ వస్తువులు చూపించి , ఎక్స్ ప్లెయిన్ చేసి వాళ్ళ చేత కొనిపించాలి .. కస్టమర్ లేనపుడు వాళ్ల కోసం డోర్ దగ్గర అలా నిలబడి వేచి చూస్తూ ఉండాలి. లారీల్లో టీవీలు , ప్రిడ్జ్ లు , వాషింగ్ మిషన్లు వచ్చినపుడు వాటిని షాప్ లో పని చేసే ఆడవాళ్ళు భుజాల మీద మోసుకుంటూ వెళ్లి లోపల పెట్టాలి .. ఒక విధంగా నరకం అనుభవించేది ..
కొద్దిపాటి జీతం ఇంకొద్దిగా కమిషన్ వచ్చేది.. కానీ అలా నిలబడి నిలబడి అలా ఆమె ఆరోగ్యం చాలా పాడయిపోయింది .. ఒక్క మా చెల్లి మాత్రమే కాదు. అలాంటి ఎంతో మంది చెల్లెల్లు అలా .. రోజంతా నిలబడి నిలబడి ఆరోగ్యాలు దెబ్బతిని ఉద్యోగాలు మానేశారు. పైగా అక్కడి మేనేజర్ల చేతిలో నిత్యం తిట్లు , అవమానాలు అదనం..
పాపం నాకు ఏదైనా చూడమని మా చెల్లి ఎన్నోసార్లు చెప్పేది .. నిజానికి నేను ఏమీ చేయలేకపోయాను .. చివరికి ఆరోగ్యం పాడయ్యాక ఉద్యోగం మానేసి రోడ్డు పక్కన బడ్డి కొట్టు పెట్టుకుని .. సిగరెట్లు , బీడీలు , సోడాలు అమ్ముకుంటోంది. ఇప్పుడు కూడా ఆ రోజంతా ఆలా రోడ్డు పక్కన కూర్చునే ఉంటోంది .. కానీ అప్పుడు అనుభవించిన నరకం అయితే లేదు ..
ఇది కేవలం నా చెల్లి అనుభవించిన బాధ కాదు . అలాంటి ఎంతో మంది చెల్లెలు ఈ రోజుకి ఇలా బతుకు తెరువు కోసం ఇలా జీవితం అంతా నరకం అనుభవిస్తున్నారు .. పని చేసే చోట మహిళలపై వేధింపుల నిరోధానికి ఎలాంటి చర్యలు ఉండవు ..
రోజుకి ఎనిమిది గంటల పని విధానం ఎక్కడా అమలు కాదు .. ఏ లేబర్ కమిషనర్ వీటిని పట్టించుకోడు .. ఎక్కడా ఎనిమిది గంటల పని విధానంపై కనీసం తనిఖీలు కూడా చేయరు .. ఇలా శ్రమ దోపిడీ ఈనాటికి కొనసాగుతూనే ఉంది ..
అయ్యో ఆడవాళ్ళ శరీరం అన్నేసి గంటలు నిలబడి ఉంటే సహకరిస్తుందా ? అనే ఆలోచన కనీస జాలి కూడా ఉండదు .. మెన్సెస్ లో మహిళలు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. కనీసం సెలవులు కూడా ఉండవు .. ఇది కేవలం మా చెల్లి పని చేసిన షోరూం గురించి మాత్రమే కాదు .. అన్ని చోట్లా అదే… అది గుడివాడ అయినా బెజవాడైనా , హైదరాబాద్ అయినా , కరీంనగర్ అయినా అన్ని చోట్లా ఒక్కటే.. లేబర్ చట్టాల ప్రకారం రోజుకి ఎనిమిది గంటల పని విధానం స్ట్రిక్ట్ గా అమలు చేయాలి కానీ ఎక్కడా అది జరగదు.
19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ‘8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం’ అనే నినాదంతో పోరాడారు. 1886లో అమెరికాలోని చికాగోలో జరిగిన సమ్మెలు మే డే (మే 1)కు జన్మనిచ్చాయి, ఇది అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మారింది.
భారత్‌లో, బ్రిటిష్ కాలంలో ఫ్యాక్టరీల్లో 12-16 గంటల పని సాధారణం. 1912లో టాటా స్టీల్ ప్రపంచంలోనే మొదటిసారి 8 గంటల షిఫ్ట్ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) సిఫార్సులు, 1940ల్లో భారత ఉద్యమాలు – ఇవి 1948లో ఫ్యాక్టరీస్ యాక్ట్‌కు దారితీశాయి. కానీ, ఈ ఆశయాలు ఎందుకు అమలు కావడం లేదు?
అన్‌ఆర్గనైజ్డ్ సెక్టర్ (90% కార్మికులు)లో అవగాహన లోపం, అవినీతి, యూనియన్‌ల బలహీనత, ఆర్థిక ఒత్తిడి కారణాలు. భారత కార్మిక చట్టాలు 8-9 గంటల పనిని నిర్ధారిస్తాయి:
• ఫ్యాక్టరీస్ యాక్ట్, 1948: వారానికి 48 గంటలు, రోజుకు 9 గంటలు మాక్సిమమ్. ఓవర్‌టైమ్‌కు డబుల్ పే. వీక్లీ హాలిడే తప్పనిసరి.
• షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్: రాష్ట్రాల వారీగా 8-9 గంటలు/రోజు, 48 గంటలు/వారం. స్ప్రెడ్‌ఓవర్ 10.5 గంటలు మించకూడదు.
• కొత్త లేబర్ కోడ్‌లు (2020)…: 8-9 గంటలు, కానీ కొన్ని సెక్టార్లలో 12 గంటల వరకు అనుమతి, ఓవర్‌టైమ్‌తో. మహిళలకు మ్యాటర్నిటీ లీవ్ 26 వారాలు, పీరియడ్ సౌకర్యాలు. కానీ, అమలు లోపం పెద్ద సమస్య.
ఇన్‌స్పెక్టర్లు తక్కువ, అవినీతి, ఎన్‌ఫోర్స్‌మెంట్ లేకపోవడం వల్ల 70-90 గంటల వర్క్‌వీక్ సాధారణం. ILO ప్రకారం, భారత్ ఎక్స్‌టెండెడ్ వర్కింగ్ హవర్స్ దేశాల్లో ఒకటి.
భారత్‌లో మహిళా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (FLFPR) 26- 37% మధ్య ఉంది, ప్రపంచంలో అతి తక్కువ. 2005లో 32% నుంచి 2021లో 19%కి తగ్గింది, ఇప్పుడు కొంచెం పెరిగి 37%కి చేరింది కానీ స్థిరంగా లేదు.
రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెక్టర్లలో మహిళలు 12-14 గంటలు నిలబడటం వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి.
పీరియడ్ & హెల్త్ ఇష్యూస్: ప్రతి నెలా నొప్పులు, బ్లీడింగ్‌తో నిలబడాలి. చాలా షాపుల్లో హైజీన్ సౌకర్యాలు లేవు, ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
IIMA స్టడీ ప్రకారం, 67% మహిళలు వర్క్-లైఫ్ ఇంబాలెన్స్‌తో బాధపడుతున్నారు. 25% ఉద్యోగులు హెల్త్‌కేర్ డిలే చేస్తున్నారు.
మ్యాటర్నిటీ & తల్లుల స్థితి దారుణం: 94% మహిళలకు వర్క్‌ప్లేస్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ లేవు. మ్యాటర్నిటీ తర్వాత 48% మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. చిన్న పిల్లలతో తల్లులు ఇంటి పని + జాబ్ మధ్య చిక్కుకుంటారు. 34% మహిళలు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వల్ల జాబ్ క్విట్ చేస్తున్నారు…. .. అశోక్ వేములపల్లి
Share this Article