.
“నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు;
బయట కుక్క చేత భంగపడును;
స్థానబలిమి గాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ వినురవేమ !”
నీళ్ళలో ఉన్న మొసలి ఎలాంటి తడబాటు లేకుండా అతిపెద్ద ఏనుగును కూడా నీటిలోకి లాగి పట్టుకోగలుగుతుంది. కానీ అదే మొసలి తన స్థానమైన నీటి నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది. మొసలిది నీళ్ళల్లో స్థానబలిమి తప్ప తన బలం కాదు.
Ads
“కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!”
తామరలకు నివాసం నీరు. ఆ తామరలు నీటిలో ఉన్నప్పుడు సూర్యుడి కిరణం పడగానే వికసిస్తాయి. అదే తామరలను నీటిలోనుండి తీసి బయట పడేస్తే… అదే సూర్యకిరణానికి మాడి మసైపోతాయి. అలాగే ఎంతటివారైనా తమ స్వస్థానాలు వదిలి బయటికి వెళితే…తమ మిత్రులే శత్రువులుగా ఉంటారు.
మూడు, నాలుగు దశాబ్దాలక్రితం వరకు తెలుగు మీడియం చదివే పిల్లలకు బడుల్లో నీతిశతకం పద్యాల్లో ఇలాంటివి ఉండేవి. ఇలాంటి పద్యాలను చదువురానివారు కూడా వాడుకమాటల్లో ప్రస్తావించేవారు. ఇప్పుడు పద్యం అంటారనిదయ్యింది. తెలుగే దేవాతావస్త్రమయ్యింది. కాబట్టి అర్థం చెబితే తప్ప తెలుగు పద్యం అర్థంకాని ఆధునిక యుగంలో ఉన్నాం.
ఇవే అర్థాలతో ఫ్రెంచ్ భాషలో పద్యాలు, పాటలు, కవితలు, సామెతలు, వాడుకమాటలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ…ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకు అక్షరాలా ప్రతిపదార్థ, టీకా తాత్పర్యాలతో, విశేష వ్యాఖ్యానాలతో, బిట్వీన్ ది లైన్స్ అంతరార్థాలతో అర్థమయ్యింది, అనుభవంలోకి వచ్చింది మాత్రం మన వేమన పద్యమే, మన సుమతీ శతకమే!
అమెరికా న్యూయార్క్ మహానగరంలో పేరుగొప్ప ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఉంటుంది. అక్కడేదో శిఖరాగ్ర సమావేశం. ఆ సమావేశమయ్యాక మాక్రాన్ పక్కనే ఉన్న ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి వెళ్ళడానికి రోడ్డు దాటితే చాలు. ఈలోపు న్యూయార్క్ సిటీ పోలీసులు మాక్రాన్ ను అడ్డుకుని చాలాసేపు అలాగే ఫుట్ పాత్ మీద నిలుచోబెట్టారు. ఆయనకు బోర్ కొట్టి జేబులో సెల్ ఫోన్ తీసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేశాడు.
ట్రంప్ మహానుభావా! ఊహించు! నేనిప్పుడు ఎక్కడున్నానో! అని పరాచికాలాడాడు. నీ కాన్వాయ్ వెళుతోందని నీ పోలీసులు నన్ను రోడ్డుమీద అడ్డగించారు. దిక్కులేనివాడిలా ఇలా నడిరోడ్డుమీద నిలుచున్నాను అన్నాడు.
అరెరే! అట్నా! నేనూ అదే రోడ్డులో ఉన్నానే! నువ్వెక్కడున్నావో ఒకసారి చెయ్యెత్తు! అని ట్రంప్ తన సహజశైలిలో ఏదో జోక్ క్రాక్ చేసినట్లున్నాడు.
ట్రంప్ కాన్వాయ్ వెళ్లిన తరువాత అందరితోపాటు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిని కూడా న్యూయార్క్ పోలీసులు వదిలారు.
పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా కల్పించడానికి తాము అధికారికంగా మద్దతు ఇస్తున్నామని ఫ్రాన్స్ ప్రకటించడం వల్ల అమెరికా మనోభావాలు దెబ్బతిని ఇలా మాక్రాన్ ను అవమానించారని న్యూయార్క్ వీధుల్లో వినిపించిన గుసగుసలే అంతర్జాతీయ మీడియాలో వార్తలుగా వచ్చాయి.
అందుకే మన పల్లెల్లో-
“ఈ ఊరి మోతుబరి రైతు పొరుగూరి పాలేరు”- అని అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. ఇందులో ఇంకా ఎవరికైనా సందేహాలుంటే ఫ్రాన్స్ వెళ్ళి మాక్రాన్ ను సంప్రదించగలరు!
ఫర్ సపోజ్…అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ వెళితే…పారిస్ ఈఫిల్ టవర్ దగ్గర రోడ్డుదాటబోతే…ఇలాగే పారిస్ పోలీసు అడ్డుకోగలడా? ఫుట్ పాత్ మీద ఒక అరగంట నిలుచోబెట్టగలడా? నిలుచోబెట్టి మరో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరించగలడా?
…అంటే నీతిశతకాలన్నీ ట్రంప్ రానంతవరకే. అతడొచ్చాక ఎన్ని సహస్ర శతకాలైనా నీతిని వదులుకోవాల్సిందే!
విస్సన్న చెప్పిందే వేదం- ఎంతటి ముతక భాషలో చెప్పినా ట్రంప్ చెప్పిందే లోకానికి ఇప్పుడు శతక నీతి! ఈ కాలానికి ట్రంపే వేమన! ట్రంప్ మెదడే సుమతి!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article