.
నా చిన్నప్పుడు మా ఊళ్లో అందరమూ నాలుగైదు రోజులు కష్టపడి, తుప్పల్లో పడి రకరకాల పూలను తెచ్చేవాళ్లం… సద్దుల బతుకమ్మ అంటే అంతే… తంగేడు తక్కువే దొరికేది కానీ గునుగు, గడ్డిపూలు ఎక్కువ… రంగులు అద్ది వీలైనంత పెద్దగా పేర్చేవాళ్లం…
పిల్లలు, పెద్దలు అందరికీ సద్దుల బతుకమ్మ పేర్వడం అంటే అదొక పండుగ… అదే ఒక పండుగ… తీరా గుడి దగ్గరకు తీసుకుపోగానే, అందరికన్నా ఆలస్యంగా దొరవారి బతుకమ్మ వచ్చేది… పెద్దగా కనిపించేది… కానీ ఒక వరుస తంగేడు, మరో రెండు వరుసల గునుగు… అంతే మిగతాదంతా కాగితపు బతుకమ్మ…
Ads
ప్రతిచోటా కాగితపు బతకమ్మలు కామన్ అయిపోయాయి… పూలు దొరకడం లేదు… పెద్దవాళ్లు ఓ రిథమ్‌లో తిరుగుతూ, ఎన్నాళ్ల నుంచో పాడుకునే బతుకమ్మ పాటల్నే లయబద్ధంగా పాడేవాళ్లు… యుక్త వయస్సు పిల్లలు కోలాటం ఆడుకునేవాళ్లు… తరువాత డీజేలు, దాండియా స్టెప్పులు, సినిమా స్టెప్పులు, యూట్యూబ్ చానెళ్ల బతుకమ్మ స్పెషల్ సాంగ్స్ ప్రవేశించాయి…
ఇప్పటి బతుకమ్మ వేరు… సరే, ఆ విశ్లేషణలోకి పోవడం లేదు గానీ… నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజీలో వచ్చిన ఓ విమర్శ చిరాకు తెప్పించింది… పొలిటికల్ కళ్లజోడుతోనే ప్రతి అంశాన్ని చూడటం, ప్రతిదాన్నీ పొలిటికల్ యాంగిల్‌లో తిట్టిపోయడం, చివరకు పండుగలను కూడా వదలకపోవడం ఓ చిల్లరతనం అనిపించింది…
ఇది బతుకమ్మట అని వెటకారపు హెడింగ్ దానికి… అది బతుకమ్మ అంటే నమ్మకూడదట… ఏం ఎందుకు కాదు..? అదేమీ కాగితపు బతుకమ్మ కాదు, సినిమా సెట్టింగ్ బతుకమ్మ అసలే కాదు… గిన్నీస్ బుక్ రెండు రికార్డులను నమోదు చేసుకుంటే… తెలంగాణ పండుగకు దక్కిన ప్రశంస అనో, అభినందన అనో ఎందుకు స్వీకరించలేకపోయింది బీఆర్ఎస్ క్యాంపు..?
మరి కేసీయార్ పీరియడ్‌లో ఎల్బీ స్టేడియంలో చేసిన ఈ ప్రయత్నం ఏమిటి..? అదీ బతుకమ్మ కాదా..? ఇప్పటి సరూర్‌నగర్ రికార్డు బతుకమ్మ కాగితపు బతుకమ్మ కాదు… అచ్చంగా కొన్ని టన్నుల పూలతో ‘పేర్చిన’ నిజ బతుకమ్మ…
ఇది ఆంధ్రజ్యోతి వార్త… 63.11 అడుగులు, 10.7 టన్నుల పూలు… 9 రకాల పూలు… 300 మంది, 3 రోజుల శ్రమ… 1354 మంది ఆడారు, పాడారు… వాళ్లనందరినీ కించపరచడమే కదా బీఆర్ఎస్… అంటే బతుకమ్మను కించపరచడం… పైగా అది ఉద్యమ పార్టీ అట, బతుకమ్మను ఉద్దరించిన పార్టీ అట…
ఇంత పెద్ద బతుకమ్మను పేర్చి, ప్రపంచం దృష్టిని ఇటువైపు తిప్పుకుంటే దానికీ వెటకారాలు అవసరమా..? పైగా ఫస్ట్ పేజీలో ‘సజ్జల బతుకమ్మ’ అట… అంటే ఏమిటో..!
మంత్రులు వచ్చారు, ప్రపంచ సుందరి వచ్చి పదం కలిపింది… వేలాది మందితో నిజమైన ‘సద్దుల బతుకమ్మ’ నిర్వహించబడింది… ఏర్పాట్లు బాగున్నాయి… కళ్లు మండితే, కలానికి పక్షవాతమో, పక్షపాతమో వస్తే… పొగడకపోయినా పర్లేదు… సంబరంగా జరిగిన ఘన బతుకమ్మను తూలనాడటం దేనికి..? విచక్షణ లోపించడం… పార్టీ పేరులోని తెలంగాణను కత్తిరించుకున్నట్టే… క్రమేపీ ఇలా ప్రతి అంశంలోనూ ఇంగితాన్ని, తెలంగాణతనాన్ని వదిలేయడం..!!
Share this Article