.
జయ్‌నూర్ జిల్లా కుచ్ఛముఛ్ గ్రామం… ఆ ఉదయం నిశ్శబ్దంతో మేల్కొంది… ళ్లి పాటలు, శుభాకాంక్షల సందడి కేవలం కొన్ని గంటల కిందటే ఊరంతా కమ్మేసి ఉండగా… మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక్కసారిగా విలపాలతో, అనుమానాలతో నిండిపోయింది…
సంగ్రురామ్ – 75 ఏళ్లు…
ఒక సంవత్సరం క్రితం తన జీవిత భాగస్వామిని కోల్పోయాడు… వయస్సు 75 ఏళ్లు.., పిల్లలు లేని ఒంటరితనంలో బతికాడు… ఇంకేముంది..? కృష్ణారామా అనుకుంటూ బతుకు ఈడ్చడమే కదా… కాదు, వృద్ధాప్యపు నిశ్శబ్దం, ఖాళీ ఇంటి గోడలు అతన్ని చిరాకు పుట్టిస్తున్నాయి…
Ads
తనకు “చివరి రోజుల్లో అయినా ఒక స్నేహితురాలు తోడుంటే సరిపోతుంది” అన్న ఆశతో మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు… కానీ ఈ వయస్సులో ఇంకేం పెళ్లోయ్, ఛస్, కాటికి కాలుచాపే 75 ఏళ్ల వయస్సులో లేని తంటాలు పెట్టుకోకు, ఆమె బతుకు బలిపెట్టకు అని హెచ్చరించారు బంధువులు, గ్రామస్థులు… కానీ ముసలోడు వినలేదు…
మన్‌భావతి – 35 ఏళ్లు…
ఆమెతో కోర్టులో వివాహం జరిగింది…, ఆ తరువాత ఆలయంలో సంప్రదాయ పెళ్లి తంతు, సప్తపదులు నడిచినప్పుడు అతని ముఖంపై కనిపించిన చిరునవ్వు గ్రామస్తులందరికీ గుర్తే….
ఆ పెళ్లి రోజు రాత్రి తను బీపీ, సుగర్ టాబ్లెట్లు వేసుకున్నాడు, ఆస్తమా ఇన్‌హేలర్ పీల్చాడు… పళ్ల సెట్టు బ్రష్ చేసుకుని పక్కన పెట్టేశాడు, తరువాత ఇక ఇద్దరూ ఎక్కువసేపు మాట్లాడుకున్నారు… భవిష్యత్తు గురించి ఏవేవో చర్చించుకున్నారు… కానీ ఉదయం రాగానే… ఆ కలలన్నీ బూడిదైపోయాయి… “నువ్వు ఇంటిని చూసుకో, పిల్లలను నేను చూసుకుంటాను” – అని కొత్త భార్యకు చెప్పిన మాటలే అతని చివరి వాక్యాలుగా మిగిలిపోయాయి…
సంగ్రురామ్ రాత్రికిరాత్రి కుప్పకూలిపోయాడు… మన్‌భావతి ఆర్తనాదం చేస్తూ బయటకు పరుగెత్తింది… గ్రామస్తులు చేరి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు… కానీ వైద్యులు తలలు అడ్డంగా ఊపేశారు – “ఆయన ఇక లేరు…”
గ్రామం ఒక్కసారిగా గందరగోళంలో మునిగిపోయింది… నిన్నటి వరకూ పెళ్లి పాటలు పాడిన నోళ్ళే ఇప్పుడు అనుమానాలు, ప్రశ్నలు పలుకుతున్నాయి… “ఇది సహజ మృతేనా? లేక మరేదైనా కారణమా?” అని చర్చలు రగులుతున్నాయి…
అంత్యక్రియలకు సిద్ధం చేసిన శవాన్ని బంధువులు ఆపేశారు… ఢిల్లీలో ఉన్న మేనల్లుళ్లు వచ్చే వరకు దహనం చేయొద్దని పట్టుబట్టారు… ఇప్పుడు అందరి చూపు ఒకే విషయంపై ఉంది – పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్… పోలీస్ దర్యాప్తు…
జీవితం చివరి క్షణాల్లో కొత్త ఆశతో పెళ్లి మండపం ఎక్కిన వృద్ధుడు… మరుసటి ఉదయం చితిపై చేరిపోయాడు… గ్రామం అంతా ఒక్క మాట చెబుతోంది – “సప్తపదులు నడిచిన రాత్రే, శాశ్వత జీవన అంతిమయాత్రకు నాంది…”
ఇంతకీ ఏం జరిగి ఉంటుంది..? టీవీ సీరియళ్లలోలాగా రాత్రికిరాత్రి కొత్త వధువు ఇక ఆలస్యం దేనికి, వాడి ఆస్తిని అనుభవించేద్దాం అనుకుని ఆ ముసలోడిని మింగేసిందా..? నో, తనకు ఎకరం పొలంకన్నా ఎక్కువ లేదు… పెద్దగా వేరే ఆస్తులూ లేవు… మరేం జరిగి ఉంటుంది..? ఏదో ప్రయత్నించబోయి, ఏదో ఎదురుతన్ని గుండె హఠాత్తుగా ఆగిపోయిందా..? ఏమో… ఫాలో అప్ వార్తలతో టచ్‌లో ఉండాలి ఇక..!!
Share this Article