.సినిమాలు మాత్రమే కాదు… జీవితానికి సంబంధించిన ఏ అంశమైనా, ఏ రంగమైనా సరే… విజయం రాసి పెట్టి ఉంటే ఎవ్వడూ ఆపలేడు… దురదృష్టవంతుడిని ఎవడూ పైకి తీసుకురాలేడు… లైఫ్, అంతే… డెస్టినీ…కృషి, పట్టుదల, ప్రతిభ, ప్రయాస, ప్రయత్నం, అనుకూలతలు… ఇవన్నీ వోకే, కానీ పిసరంత అదృష్టం లేకపోతే, గెలుపు రాసిపెట్టి లేకపోతే… అన్నీ వృథాయే… కాంతారా హీరో రిషబ్ శెట్టి జీవితమూ అంతే…ఖడ్గం సినిమాలో సంగీత ఒక్క చాన్స్ ప్లీజ్ అని ఏడిచే సీన్ గుర్తుందా..? ఇక చదవండి…రిషబ్ శెట్టి పెట్టిన ఓ ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయిపోయింది ఇప్పుడు… 2016లో కనీసం ఒక్క షో వేయండి ప్లీజ్ అంటూ థియేటర్ల యాజమాన్యాలను కాళ్లావేళ్లా పడ్డాను, ఇప్పుడు 5 వేల థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది నా సినిమా అని ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు రిషబ్ శెట్టి…
నిజమే… 9 ఏళ్లలో ఎంత మార్పు..? జీవితం రివ్వున ఎగిసింది… కర్నాటకలోని కుందాపుర తన స్వస్థలం… జూనియర్ ఎన్టీఆర్ తల్లిది ఆ ఊరే… (కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రిరిలీజు ఫంక్షన్‌కు జూనియర్ ముఖ్య అతిథి) ఓ సాదాసీదా బంట్ కులానికి చెందిన కుటుంబం తనది… (ఐశ్వర్య రాయ్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, శ్రీనిధి శెట్టి, మన స్వీటీ అనుష్క శెట్టి అదే కులం)… తన అసలు పేరు ప్రశాంత్ శెట్టి…
చదువుతూ యక్షగానాలు చేసేవాడు… (కాంతార దైవిక నర్తనలు, కథలు, నటనలకు బీజం పడింది అక్కడేనేమో)… బతకడానికి వాటర్ క్యాన్లు సప్లయ్ చేసేవాడు… రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో పనిచేసేవాడు… డిగ్రీ అయిపోయాక సినిమాల మీద ప్యాషన్‌తో అసిస్టెంట్ డైరెక్టర్, లైట్ బాయ్, క్లాప్ బాయ్, స్పాట్ బాయ్ అన్ని పనులూ చేశాడు… సినిమా దర్శకత్వంలో ఓ డిప్లొమా కూడా తీసుకున్నాడు…
ఏదో సినిమా పనిలో రక్షిత్ శెట్టితో పరిచయం… ఒకటీ అరా పాత్రలు దొరికేవి… అనామక పాత్రలు… 2012లో తుగ్లక్ అనే సినిమాలో చిన్న వేషంతో ప్రస్థానం ప్రారంభం… 2016లో అదే రక్షిత్ శెట్టి తను హీరోగా నటించే రికీ చిత్రానికి దర్శకుడిగా చాన్స్ ఇప్పించాడు… రిషబ్ శెట్టి అందరినీ ఒక్క సాయంత్రం షో అయినా వేయండని కాళ్లావేళ్లా బతిమిలాడాను అంటున్న సినిమా అదే…
Sarkari Hi. Pra. Shaale, Kasaragodu, Koduge (కాసరగోడు ప్రభుత్వ పాఠశాల) సినిమాతో కాస్త పేరొచ్చింది… ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డూ వచ్చింది…
రిషబ్ శెట్టి ప్రతిభకు తిరుగులేదని నిరూపించిన చిత్రం ఆయన దర్శకత్వం వహించిన ‘కిరిక్ పార్టీ’ (2016)… రక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ అయింది… ఈ సినిమాకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు…
ఎప్పుడైతే కాంతార జాతీయ స్థాయిలో వందల కోట్లు కొల్లగొట్టిందో ఇక రిషబ్ శెట్టి కెరీర్ గగనానికి ఎగిసింది… తనే ఆ సినిమాకు రచయిత, హీరో, దర్శకుడు… ఆ సినిమా నిర్మించిన హొంబలే ఫిలిమ్స్ (కేజీఎఫ్ వాళ్లదే…) కాంతార ప్రీక్వెల్‌కు కూడా చాన్స్ ఇచ్చింది… అదిప్పుడు బంపర్ హిట్ దారిలో పోతోంది…
ప్లీజ్, ఒక్క షో వేయండి అని బతిమిలాడిన ఆ రిషబ్ శెట్టి సినిమా ఇప్పుడు 5 వేల థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు అంటే… వావ్, ఏం అదృష్టంరా స్వామీ… అంతా భూతకోల మాయ… పంజుర్లి దైవమాయ…
https://twitter.com/shetty_rishab/status/1973835175848255509
“కథ ఎంత స్థానికంగా ఉంటే, అది అంత బలంగా ఆ కథ ప్రపంచవ్యాప్తం అవుతుంది…” అంటాడు రిషబ్ శెట్టి… సొంత ప్రాంతంలోని మూలాలను, సంస్కృతులను కథలుగా చెప్పడం వల్లే ఆయన చిత్రాలు విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులను కదిలించాయి…
Ads
Share this Article