.
కాళేశ్వరానికి మళ్లీ టెండర్లు… ఏదో కొత్తగా కట్టడానికి కాదు, అసంపూర్తివి పూర్తి చేయడానికి కాదు… కేసీయార్ చేసిన ద్రోహానికి దిద్దుబాటు టెండర్లు… రిపేర్ టెండర్లు… విజ్ఞతతో కూడిన టెండర్లు… అర్థం కావాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి…
కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, దోపిడీ కథలను కాస్త పక్కన పెడితే… ప్రాణహిత – చేవెళ్లను డిలిట్ కొట్టేసి… తన అపారమైన, అద్భుతమైన, ప్రపంచ స్థాయి పరిజ్ఞానంతో కేసీయార్ అనబడే ఇంజినీర్… గోదావరి నదీప్రవాహాన్నే రిజర్వాయర్లుగా మలుస్తాను, దానికి కొత్త నడకలు నేర్పుతాను అంటూ మూడు బరాజులు దిగువన కట్టే పనికి పూనుకున్నాడు…
Ads
సింపుల్‌గా శాటిలైట్ చిత్రాన్ని ముందుపెట్టి నదీప్రవాహానికి అడ్డంగా మూడు గీతలు గీశాడు… అంతకుమించి శాస్త్రీయ సర్వేలు లేవు, అంచనాల్లేవు… బరాజు స్థలాల ఎంపిక, ఉద్దేశం, డిజైన్లు, నిర్మాణ నాణ్యత అన్నీ లోపభూయిష్టమే… చివరకు ఏమైంది..? మేడిగడ్డ మెడ విరిగింది… అన్నారానికి బుంగలు పడ్డాయి… మరిప్పుడు వాటినేం చేయాలి..?
లక్ష కోట్లను గోదావరిలో పోసినట్టు కేసీయార్ అవిజ్ఞత… పనులు పూర్తయినట్టుగా సర్టిఫికెట్లు కూడా ఇచ్చేశాడు కేసీయార్ అత్యంత భారీ ఔదార్యంతో..! దాంతో ఎల్అండ్‌టీకి రిపేర్ బాధ్యత లేకుండా పోయింది… దాని మెడలు వంచి, రిపేర్లకు ఒప్పించాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, కానీ కుదర్లేదు, ఈలోపు హైదరాబాద్ మెట్రోను కూడా ఎల్‌అండ్‌టీ వదిలేసుకుంది… ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఇక ఎల్అండ్‌టీతో సత్సంబంధాలు, ప్రొఫెషనల్ బంధాలు కూడా ఏమీ ఉండవు…
మరేం చేయాలి..? అది జనం సొమ్ముతో కట్టిన బరాజులు, పఢావు పెట్టలేరు… ఎవరో పాత పాలకుడు తప్పు చేసి, భ్రష్టుపట్టించారని ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు… పైగా తనకు ఏరకమైన భాగస్వామ్యం లేకపోయినా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టే అయినా సరే, దేశం మొత్తాన్ని ఓ యూనిట్‌లా చూసే కేంద్రం ఆ ప్రజాధన ప్రాజెక్టు రిపేర్లు, సద్వినియోగం గురించి అడుగుతోంది…
కేటీయార్ లేదా హరీష్‌రావు చెప్పినట్టు నాలుగు తట్టల కాంక్రీట్‌తో అయ్యే రిపేరు కాదు అది… అవి బాధ్యతారహిత వ్యాఖ్యలు, ప్రకటనలు… గోదావరి ప్రవాహ ఉధృతి, ఇసుక స్వభావానికి బరాజులకు సేకంట్ పైల్స్ అస్సలు సూట్ కావు… కానీ కేసీయార్ చేసిన అతి పెద్ద తప్పు అదే, వాటి మీద పిల్లర్లు నిలబెట్టడం… తీరా ఆ పిల్లర్లు కుంగి మొదటికే మోసం వచ్చింది…
గోదావరి ఉధృతి మీద ఏ అవగాహన లేకుండా పంపు హౌజులు కడితే… ఓ పంపు హౌజులో బాహుబలి మోటార్లు మునిగిపోయి, ఈరోజుకూ యథాతథ స్థితికి రాలేదు… అదొక బ్లండర్… పెద్ద పెద్ద కరెంటు టవర్లు కొట్టుకుపోయాయి… ఈ స్థితిలో బరాజుల రిపేర్లు కాదు… ఒక్క మాటలో చెప్పాలంటే పునర్నిర్మించాలి… అదెంత వ్యయం..? ఎవరి వల్ల..? కేవలం కేసీయార్ వల్ల..! అత్యంత నేరపూరిత నిర్మాణ నిర్లక్ష్యం ఇది…
తక్కువ ఖర్చులో అయ్యే పనికి అంత దారుణంగా అడ్డగోలు అప్పులు తెచ్చి మరీ కట్టిన ప్రాజెక్టు దురవస్థ అది… ఇదే ఖర్చును కృష్ణా పెండింగ్ ప్రాజెక్టుల మీద పెట్టి ఉంటే… కృష్ణా జలాల్లో వాటాపై మనకు మరింత అడ్వాంటేజ్ వచ్చి ఉండేది… కేసీయార్ ప్రభుత్వం ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ ఉద్యమ ఎజెండాలో ప్రదానమైన నీళ్లు అంశానికే ఇలా నీళ్లొదిలి నష్టం చేసింది…
మొన్న పిలిచినవి రిపేర్ టెండర్లు కాదు… ఏ డిజైన్లతో మరమ్మత్తులు చేస్తే బరాజులు మళ్లీ ఉపయోగంలోకి వస్తాయో ప్రతిపాదనల్ని శాస్త్రీయంగా అడిగింది… ఏవో ఐఐటీలతో అధ్యయనం అనుకున్నారు మొదట్లో… కానీ ప్రొఫెషనల్ ఏజెన్సీలనే ఇన్వాల్వ్ చేసి, శాస్త్రీయ ప్రతిపాదనలు తీసుకుందామని ఆ టెండర్లు… ఆ డిజైన్లకు కేంద్ర ఇరిగేషన్ సంస్థల ఆమోదం కూడా అవసరం… సో, ఇప్పుడప్పుడే తెమిలే వ్యవహారం కాదు ఇది… అలాగని గాలికీ, గోదావరి ప్రవాహానికీ వదిలేయలేం కూడా…
కానీ ప్రభుత్వం వేస్తున్న దిద్దుబాటు అడుగులు మాత్రం కరెక్టు… చాలామందిలో కొన్ని ప్రశ్నలు… మరి తుమ్మిడిహెట్టి మాటేమిటి..? సమ్మక్క బరాజ్ కథేమిటి..? అసలు కాళేశ్వరం బరాజులతో ఏమైనా ఉపయోగం ఉందా..? మరెందుకు ఈ రిపేర్లు..? కాళేశ్వరం బరాజులు పనిచేయకపోయినా తెలంగాణ రైతులు అద్భుతమైన పంట రికార్డులు క్రియేట్ చేస్తున్నాడుగా…? కాళేశ్వరం బరాజుల నుంచి వరద రోజుల్లో నీటిని ఎత్తిపోసి, మళ్లీ నదిలోకే వదిలేయడంకన్నా ఏమైనా ఉపయోగం ఉందా..?
‘ముచ్చట’ విశ్లేషణ ఏమిటంటే..? మహారాష్ట్రను ఒప్పించి 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి నిర్మాణం తప్పదు… ఉంటుంది… తద్వారా రిజర్వాయర్లు ఎల్లంపల్లి ఇరిగేషన్ నెట్‌వర్క్ మొత్తాన్ని సద్వినియోగం చేయడం… చత్తీస్‌గఢ్ వోకే అని చెప్పింది కాబట్టి సమ్మక్క బరాజు ఇక దాదాపు అయిపోయినట్టే… దీనివల్ల దేవాదుల ప్రాజెక్టు సక్సెస్ అయినట్టే…
మరి కాళేశ్వరం బరాజుల కథేమిటీ అంటారా..? నిల్వ జోలికి పోకుండా… బరాజుల్ని పటిష్టపరిస్తే… ఎప్పుడో ఓసారి… అవసరమున్నప్పుడు ఉపయోగించుకోవడానికి అలా ఉంటాయి… ఇదీ కెేసీయార్ చేసిన ‘నీళ్ల ద్రోహానికి’ ఓ దిద్దుబాటు… ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన నీటిద్రోహాలకన్నా ఇది పెద్దది… దిద్దుబాటు కూడా అంతే సంక్లిష్టమైంది… ఆ దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాల్లో విజ్ఞత కనిపిస్తోంది…!!
Share this Article