.
వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి…దేశం వదిలి పారిపోయి…లండన్ అతిశీతల వీధుల్లో దర్జాగా సిగార్ తాగుతూ మనదేశ దీనావస్థను తలచుకుని తలుచుకుని బాధపడుతుంటారు కొందరు. రాళ్లను వజ్రాలుగా , వజ్రాలను బ్యాంకులవాళ్లకు రాళ్లగా మలచి అమెరికా ఏడు నక్షత్రాల హోటళ్లలో న్యాయాన్యాయాల సమీక్షలు చేస్తుంటారు మరికొందరు. లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టి రాజ్యలక్ష్మినే చెరబట్టిన రుణపురుషులు మనపక్కనే వీధికొకడు .
వీరికి భిన్నంగా రైతు లక్ష అప్పుకు 20 వేలు వడ్డీ కకట్టలేక పురుగులమందుతో ప్రాణాన్ని బ్యాంకుకు చెల్లు వేస్తాడు . రైతు పేరిటే ఉద్యమాలు , ప్రత్యేక పథకాలు , భిక్షాలు ఎన్నెన్నో ?
Ads
కానీ…
రైతు ఒక విషాదం . రైతు ఒక చెదిరిన స్వప్నం . రైతు నిలువెత్తు కన్నీరు . రైతు ఒక ప్రశ్న . రైతు ఒక నిరాశ . రైతు ఒక అరణ్య రోదన .
రైతు కాళ్లు పుళ్లు పడి రక్తం కారేలా బొంబాయిలో పాదయాత్రలు చేసినా , రాజధాని నగరంలో సిగ్గువిడిచి తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపినా , పరిహారమయినా కుటుంబానికి దక్కనీ అని పొలంలోనే కొమ్మకు ప్రాణాన్ని వేలాడేసినా – నేడు వ్యవసాయం ఒక దండగ . వ్యవసాయం ఒక అంటరానిది, చేతకానివారిది , తెలివిలేనివారిది , చదువురానివారిది .
చివరకు పల్లెలు పట్టణాల శిల్పారామాల్లో , వ్యవసాయం నగరాల ఎగ్జిబిషన్ లలో మాత్రమే చూసుకోవాల్సిన రోజులొస్తున్నాయి .
మదనపల్లెలో టమోటా రైతు కిలో పది పైసలకు అమ్ముకోలేక రోడ్లమీదే వదిలేసి వెళ్ళిపోతాడు . అనంతపురంలో వేసిన వేరుశెనగవిత్తనం నీరులేక చెదపురుగులు తింటే రైతు ఎండ్రిన్ తాగుతాడు. రంగారెడ్డి పూల రైతు పూలమ్మినచోట కట్టెలమ్మలేక గుడిమల్కాపూర్ చెత్తబుట్టకు వాడని పూలను అలంకరించి వెళతాడు. నిజామాబాద్ చెరకు తీపి…కానీ రైతుకు మిగిలింది చేదే . నూజివీడు మామిడి మనకే రుచి – రైతుకు అరుచి . అమలాపురం బెల్లం – రైతుకు అల్లం . పలాస జీడిలో ఎన్నెన్ని రక్తపు జీరలో ?
కదిలిస్తే రైతు నిలువెల్లా కన్నీరు . “ఏకో రసః కరుణ ఏవ”. నలుగురు కూర్చుని నవ్వేవేళల నాపేరొకతరి తలవండీ – అని గురజాడ పూర్ణమ్మ అందరినీ అడిగింది . రైతుకూడా ఈ పాట ద్వారా అలాగే ఆడుతున్నాడు . కనీసం పట్టెడన్నం తినేవేళ అయినా పండించిన రైతు పచ్చగా ఉండాలని కోరుకుందాం .
సందర్భం:- జాతీయ నేరాల చిట్టా విభాగం(నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో- ఎన్ సీ ఆర్ బీ) ప్రకారం భారత దేశంలో 2023 సంవత్సరంలో సగటున గంటకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం మొత్తం మీద దాదాపు రెండు లక్షల మంది బలవన్మరణం పాలయ్యారు. ఇందులో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. 2022తో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు కొంత తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. మంచిదే.
కానీ ఏటా రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే చిన్నవిషయం కాదు. ఒక దేశంగా భయపడాల్సిన విషయం. ఒక సువిశాల ప్రజాస్వామ్య శ్రేయో రాజ్యంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వికసిత్ ఆత్మనిర్భర్ సుందర స్వప్నాలేవీ గ్రామీణభారతికి భరోసా ఇవ్వలేని, తీరని కడుపుకోత. చెప్పుకోలేని గుండెకోత.
విషాదం:- ఆత్మహత్య మహా పాపం. భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ ప్రకారం నేరం. కాబట్టి నేరాల పద్దులో అంకెలుగా నమోదు అవుతున్నాయి. ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా సెక్షన్ 306 ప్రకారం అంతే నేరం. అలాంటప్పుడు ఇన్ని లక్షలమంది రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపించిన ఎన్ని లక్షలమందిమీద సెక్షన్ 306 ప్రకారం కేసులు పెట్టాలి? ఆ నేరాలు రుజువైతే ఎన్ని లక్షల మంది పదేళ్ళ జైలు శిక్ష అనుభవించాలి?
ఇంతకూ…
అన్నదాతలవి ఆత్మహత్యలా? వ్యవస్థలు చేస్తున్న హత్యలా?
ఆత్మహత్య నేరమే అయితే ఆ నేరాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఎవరు బాధ్యులు? ఎవరికి వేయాలి శిక్ష? ఎవరు వేయాలి శిక్ష?
“ఏది జీవితమేది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం? ఏదసత్యం?
ఏది కారణమేది కార్యం?
ఓ మహాత్మా! ఓ మహర్షీ!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article