.
తోట భావనారాయణ (99599 40194)… శివాజీ సినిమా తెలుగు వెర్షన్ కి రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పారు మనో. ఆ డబ్బింగ్ నచ్చి స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసి మనోను మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, ఏం కావాలో అడగమన్నారు. ఉబ్బితబ్బిబ్బయిన మనో “మీరు మా ఇంటి బిర్యానీ తింటే సంతోషిస్తా” అన్నారు.
ఇంత చిన్న కోరికా అని మనసులోనే అనుకున్న రజనీకాంత్, ‘పంపండి, తింటాను” అన్నారు. ఆ మాటకు ఎంతో సంతోషించానని ఒక ఇంటర్వ్యూలో మనో స్వయంగా చెప్పారు. మరి నా సంగతి అలా కాదు. రజనీకాంత్ గారే లంచ్ కి రమ్మని పిలిచారు. ఆ పిలుపు వెనుక ఏం జరిగిందో చెప్పటానికే ఈ పోస్ట్…
Ads
1991 ఎన్నికల్లో జయలలిత తిరుగులేని విజయం సాధించారు. ఎంత ఘన విజయమంటే మొత్తం 234 సీట్లలో కాంగ్రెస్ పొత్తుతో 225 చోట్ల గెలిస్తే డీఎంకే కేవలం 2 సీట్లకు పరిమితమైంది.
కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సమక్షంలోనే శాసనసభలో జరిగిన ఘోర పరాభవం, ఎంజీఆర్ చనిపోయాక ఆయన వారసురాలిగా పార్టీని దక్కించుకున్న జానకీ రామచంద్రన్ కూడా వెనకడుగు వేసి పార్టీ పగ్గాలు జయలలితకు అప్పగించటం, రాజీవ్ గాంధీ దారుణ హత్యతో పెల్లుబికిన సానుభూతి… వెరసి ఈ విజయం సాధించిపెట్టాయి.
అయితే, కొద్ది కాలానికే 100 కోట్లతో పెంపుడు కొడుకు (శశికళ అన్నకొడుకు) పెళ్ళి చేయటం, ప్రభుత్వ ఆస్తులు కొనటం, ఆదాయానికి మించిన ఆస్తులు .. ఇలా ఒక్కో కేసు ఆమె ప్రతిష్ఠను దెబ్బతీస్తూ వచ్చాయి. ప్రజల్లో ఆమె మీద వ్యతిరేకత పెరుగుతూ రావటం రాష్ట్రమంతా గమనిస్తూనే ఉంది.
అందుకే తమిళనాడు కాంగ్రెస్ నాయకులు ఈసారి అన్నాడీఎంకే (జయలలిత) బదులు డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. కానీ పీవీ ససేమిరా వద్దన్నారు. రాజీవ్ హత్యకు కారణమైన ఎల్టీటీఈతో సంబంధాలున్నట్టు డీఎంకే మీద ఆరోపణలున్న సంగతి గుర్తు చేశారు. అయినాసరే, జయలలితతో కలసి పోటీ చేయటం వలన ఆమె అవినీతిని ప్రోత్సహించినట్టవుతుందని మూపనార్, చిదంబరం లాంటి కాంగ్రెస్ నాయకులు పీవీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
చివరికి రజనీకాంత్ మద్దతుతో విడిగా పోటీ చేద్దామన్నారు. రజనీకాంత్ అంతా సులభంగా ఒప్పుకోకపోవచ్చునన్నది పీవీ మాట. కానీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రజనీకాంత్ మీద నమ్మకముంది. “మళ్ళీ జయలలిత గెలిస్తే తమిళనాడు ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు” అన్న రజనీకాంత్ మాటలు కలకలం రేపుతున్న సమయమది.
నిజానికి రజనీకాంత్ కూ, జయలలితకూ మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఇద్దరూ ఉండేది ఒకే వీధిలో. పొయెస్ గార్డెన్ గా పిలుచుకునే ఆ ఖరీదైన ప్రాంతంలో సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఉంటారు. ఆ ప్రాంతాన్ని దాదాపు 250 ఏళ్ల కిందటే Poe అనే వ్యాపారి కొనుక్కున్నాడు. క్రమంగా ఆ ప్రాంతానికి Poe’s Garden అనే పేరొచ్చింది. ఏళ్ళు గడిచేకొద్దీ apostrophe కూడా పోయి పొయెస్ గార్డెన్ అని పిలవటం మొదలైంది.
అక్కడ జయలలిత ఇల్లు (వేద నిలయం) మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది ప్రముఖుల ఇళ్ళున్నాయి. రజనీకాంత్ ఇల్లు కూడా అక్కడే. జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ సెక్యూరిటీ బాగా పెంచేశారు. అక్కడి ప్రముఖుల కదలికలకు అది ఇబ్బందికరంగా మారింది. కానీ నేరుగా గొడవపడలేని పరిస్థితి.
ఒకరోజు రజనీకాంత్ అలా బైటికి వస్తుండగా జయలలిత కోసం బారికేడ్స్ పెట్టి ట్రాఫిక్ ఆపేశారు. అలా పది నిమిషాలు వేచి ఉన్నా, పోలీసులు అలాగే ఆపటంతో రజనీకాంత్ కారు దిగి, తనను వెళ్లనివ్వమని అడిగారు. పోలీసులు ససేమిరా అన్నారు.
దాంతో ఆయన రోడ్డు వారగా నిలబడి సిగిరెట్ వెలిగించారు. ఆయన్ను చూసిన జనం క్షణాల్లో గుమికూడారు. అంతే … ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. జయలలిత బైటికి రాలేని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోక పోలీసులు బిక్కచచ్చిపోయారు. పోలీసులు బ్రతిమలాడి రజనీకాంత్ ను కార్లో కూర్చోబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది. జయలలిత ఈగోకు రజనీ అడ్డుకట్టవేసిన సందర్భమది. The Name Is Rajinikanth పేరుతో వచ్చిన ఆయన జీవిత చరిత్రలో కూడా ఈ విషయం రాశారు.
జయలలితను ఓడించటానికి కాంగ్రెస్ లో చేరేందుకు రజనీకాంత్ ఒప్పుకుంటారనేది తమిళ కాంగ్రెస్ పెద్దల అంచనా. ఆయన్నే సీఎం అభ్యర్థిగా బరిలో దించితే గెలుస్తామని, కాంగ్రెస్ కు పూర్వ వైభవం మళ్ళీ వస్తుందని ఆశించారు. మొత్తానికి రజనీకాంత్ ను, పీవీని ఒప్పించి ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు.
అక్కడ ఏం మాట్లాడారన్నది ఎవరికీ తెలియదు. కానీ మద్రాసులో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎయిర్పోర్ట్ లో హడావిడి చేయటానికి సిద్ధమయ్యారు. పీవీ నివాసం నుంచి రజనీకాంత్ నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో కనుక్కోవటానికి తమిళనాడు కాంగ్రెస్ నాయకులు పీవీ ఇంటికెళ్లారు.
- “నేను చెప్పాగా.. అతను మన పార్టీలోకి రాడు .. అసలు రాజకీయాల్లోకే రాడు” అని నింపాదిగా చెప్పారు పీవీ. మద్రాసులో మీడియావాళ్లకు రజనీకాంత్ సరిగ్గా అదే విషయం చెప్పారు. పీవీ మాట విన్న మూపనార్ హతాశులయ్యారు.
అన్నా డీఎంకే – కాంగ్రెస్ పొత్తు ఖరారైనట్టు మరునాడే పీవీ ప్రకటించారు. . మూపనార్ మద్రాస్ వచ్చేసరికి కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పీవీ కటౌట్ ను చెప్పులతో కొట్టటం సహా మొత్తంగా కాంగ్రెస్ మీదనే తిరుగుబాటు చేశారు.
పరిస్థితి అర్థం చేసుకున్న మూపనార్, చిదంబరం అప్పటికప్పుడు తమిళ మానిల కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టటం, సైకిల్ గుర్తు తెచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. అంతే వేగంగా డీఎంకేతో పొత్తు కూడా కుదుర్చుకున్నారు. “మళ్ళీ జయలలిత గెలిస్తే తమిళనాడు ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు” అనే రజనీకాంత్ డైలాగ్ సన్ టీవీలో మారుమోగింది.
ఎన్నికల ప్రచారంలో దాని ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంకోవైపు తమిళ మానిల కాంగ్రెస్ కూడా రజనీకాంత్ సినిమా పోస్టర్ ను ప్రచారానికి వాడుకోవటానికి రజనీకాంత్ అనుమతి తీసుకుంది. అంతకు మూడున్నరేళ్ళ ముందు విడుదలైన ‘అణ్ణామలై’ సినిమాలో సైకిల్ మీద తిరిగి పాలమ్మే పాత్ర రజనీకాంత్ ది.
ఆ విధంగా తమిళ మానిల కాంగ్రెస్ తమ ఎన్నికల గుర్తు సైకిల్ ను రజనీకాంత్ తో కలిపి ప్రచారానికి వాడుకోవాలని ఆలోచించింది. అప్పట్లో ఆ పోస్టర్లు తమిళనాడు అంతటా కనిపించాయి. అప్పుడే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా సైకిల్ ప్రచారానికి రజనీకాంత్ ను వాడుకోవాలని తెలుగుదేశం ఆలోచించింది.
ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో రజనీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుసు కాబట్టే ఈ ఆలోచన వచ్చింది. తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ అశోక్ రాజు (సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీల అధిపతి) ఆలోచన ఇది. పార్టీ తరఫున రజనీకాంత్ తో ఆయనే మాట్లాడారు. రజనీకాంత్ ఓకే చెప్పటంతో ఫుల్ పేజ్ యాడ్ తయారై ఈనాడు చివరి పేజీలో వచ్చింది.
రాత్రంతా మేలుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వార్త అధిపతి గిరీష్ సంఘీ నుంచి తొమ్మిది గంటలకు ఫోన్. ఈనాడులో వచ్చిన యాడ్ చూసి, “రజనీకాంత్ మనకెందుకు ఇవ్వలేదు?” అని అడిగారు. అది రజనీకాంత్ పేరుతో తెలుగుదేశం వాళ్ళే వేసిన యాడ్ అని చెప్పినా నమ్మటానికి ఆయన సిద్ధంగా లేరు.
అందుకే, అదెలా జరిగిందో కనుక్కుంటానని చెప్పా. అప్పటికప్పుడు రజనీకాంత్ సహాయకుడు సత్యనారాయణతో మాట్లాడా. రజనీకాంత్ గారు సైకిల్ తో ఉన్న అణ్ణామలై సినిమా ఫోటో వాడుకుంటామంటే సరేనని చెప్పామని, యాడ్ వాళ్ళే వేసుకున్నారని, తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారాయన.
“మేటర్ చూస్తే మీరే ఇచ్చారనుకుంటారు. పైగా పీవీ నరసింహారావు గారిని చెడామడా తిట్టేశారుగా” అన్నాను. అప్పుడు సత్యనారాయణ ఉలిక్కి పడ్డారు. “నిజమా?” అని మళ్ళీ అడిగారు. అవునని చెప్పగానే, “కాస్త చదివి వినిపిస్తారా?” అనటమే ఆలస్యం… మొత్తం చదివా. “ఒక్క నిమిషం లైన్లో ఉంటారా?” అని ఆడగ్గానే నాకు విషయం అర్థమైంది.
సత్యనారాయణ చూచాయిగా అసలు విషయం చెప్పి ఆయనకు ఫోన్ ఇవ్వటానికి రెండు మూడు నిమిషాలు పట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లైన్లో కొచ్చారు. చిన్నపాటి పలకరింపుతో నేరుగా విషయంలోకి వచ్చేశారు. “ఒకసారి ఆ మేటర్ మొత్తం నాకోసం చదవగలరా?” అని అడిగారు.
“రెడ్డొచ్చె మొదలాడు” అన్నట్టుందనిపించినా చాలా జాగ్రత్తగా.. స్పష్టంగా.. మళ్ళీ చదివా. “అదేంటి అలా చేశారు?” ఆయన గొంతులో చిరాకు స్పష్టంగా ధ్వనించింది. “నా ఫోటో వాడుకుంటామని అడిగితే సరేనన్నా. పీవీ గారితో నాకేం గొడవలు లేవు. ఆ పెద్దాయన్ని తిట్టాల్సిన అవసరం నాకేముంది. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టారే.” అని సాలోచనగా కాసేపాగారు.
సరే, మీరు ‘వార్త’ రిపోర్టర్ అన్నారు కదా.. మీరు లంచ్ కి మా ఇంటికి రండి. ఈనాడుతో పాటు మిగిలిన తెలుగు పత్రికల వాళ్లను కూడా నేను పిలిచానని చెప్పి లంచ్ కి తీసుకురండి” అన్నారు.
రజనీకాంత్ భోజనానికి పిలిచారని అందరికీ చెప్పా. అసలు విషయమేంటో వాళ్ళకు చెప్పనే లేదు. ఆయన పిలిచారనగానే అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో కాసేపు నమ్మలేదు.
తెలుగు రిపోర్టర్లనే పిలిచారన్నప్పుడు పొంగిపోయారు. ఇలా ఆశ్చర్యపోవటానికి కారణముంది. రజనీకాంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. మద్రాసు కోడంబాక్కంలో ఆయన కట్టించిన రాఘవేంద్ర కల్యాణ మంటపంలోనే జరుగుతుంది. అక్కడ ఆయన కూర్చొని ఉంటారు. ఎదురుగా మీడియా వాళ్ళ సీట్లు. అందరికీ పత్రికా ప్రకటన పంచుతారు.
ఆయన సహాయకుడు సత్యనారాయణ ఆ పత్రికాప్రకటన మొత్తం చదువుతారు. అంతసేపూ మౌనంగా కూర్చోవటం ద్వారా అవి తన మాటలేనని రజనీ ధ్రువీకరిస్తారన్నమాట. అలా అని అందరూ అర్థం చేసుకోవాలి. అంతకు మించి ఆయన మాట్లాడరు, అడిగినా జవాబివ్వరు.
ఏం మాట్లాడితే ఎలా అర్థం తీసుకుంటారో అని ఆయన భయం కావచ్చు. మొత్తానికి అదీ రజనీ స్టైల్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వచ్చిన ప్రతిసారీ తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చినా, ఇదే వరస.
అందుకే ఆయన పిలిచారనే మాట నమ్మీనమ్మకుండానే పోయెస్ గార్డెన్ లో ఆయన ఇంటికి రిపోర్టర్లందరూ వచ్చారు. ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు. మేం కూడా కూర్చున్నాం. ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు. పీవీ నరసింహారావు గారి పట్ల తనకెంతో గౌరవమర్యాదలున్నాయని, ఫోటోకు మాత్రమే అనుమతి తీసుకొని తెలుగుదేశం మిత్రులు పీవీ గురించి ఏవేవో రాయటం తనను బాధించిందని చెప్పుకొచ్చారు.
ఆ యాడ్ మీద తన స్పందన ప్రచురించమని అడిగారు. ఆ తరువాత అందరినీ తనతో భోంచేయమని రిక్వెస్ట్ చేశారు. టీవీలైతే హడావిడి పరుగులతో వార్త ఇవ్వాలి గాని అప్పుడు పత్రికలేగా! అందరం ఆయనతో కూర్చొని భోంచేసి వచ్చాం.
అప్పటికి వార్త మొదలై ఆరు నెలలు. అప్పట్లో ఈనాడుకు వార్త గట్టి పోటీ ఇస్తుండేది. రజనీకాంత్ ఇచ్చిన వివరణ ఈనాడులో ఇది సింగిల్ కాలమ్ గా వచ్చినా, వార్తలో మాత్రం ఖండనగా ఫస్ట్ పేజ్ లో డబుల్ కాలమ్ వార్త అయింది. రెండు పత్రికల రాజకీయ వైఖరి కూడా కారణం.
రజనీకాంత్ భోజనానికి పిలిచి మరీ తెలుగు పత్రికలవాళ్ళతో మాట్లాడిన సంగతి ఆ తరువాత చెప్పినా తమిళ పత్రికల వాళ్ళెవవరూ ఒక పట్టాన నమ్మలేదు. మొత్తానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో లంచ్ చేయటం వెనుక ఇదీ కథ!
Share this Article