.
“కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?” అన్నది తిట్టు. సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. ఇందులో పచ్చి గడ్డి, ఎండు గడ్డి రెండు రకాలు. మనుషులు సాధారణంగా గడ్డి తినరు. తినకూడదని రూలేమీ లేదు.
రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో స్వేచ్ఛల్లో ఏ ఆహారం తినాలన్నది కూడా ఒక స్వేచ్ఛ. ఫలానాదే తినాలని నియమం లేదు కాబట్టి కొందరు నానా గడ్డి కరుస్తుంటారు. అయితే- ఈ తిట్టులో అన్నానికి ప్రాధాన్యం, గడ్డికి నీచార్థం రావడాన్ని కొన్ని తెలివయిన పశువులు అనాదిగా అంగీకరించడం లేదు.
Ads
తమకు ప్రాణాధారమయిన గడ్డిని అంత గుడ్డిగా ద్వేషించాల్సిన పనిలేదన్న పశువుల అభ్యంతరం సమంజసమయినదే. అలాగే కడుపుకు గడ్డి తినడం అలవాటు చేసుకున్న మనుషులు కూడా అనాదిగా అంగీకరించడం లేదు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కళ్లకద్దుకుని తినడం మన ఆచారం. ధైర్యంగా తింటున్నాను…ఇది తిని బతికి బట్ట కట్టే భాగ్యమివ్వు స్వామీ! అని అంతరార్థమేదయినా ఉందేమో మంత్రశాస్త్ర నిపుణులు చెప్పాలి. నిజంగా నానా గడ్డి తింటున్నాను- చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష! అని దేవుడి రక్ష కోరుకుంటున్నామేమో?
దక్షిణాదిలో అన్నం తింటాం. ఉత్తరాదిలో గోధుమ తింటారు. మన అన్నం తెల్లగా, మల్లె పువ్వులా ఉండాలి. తెల్లదనమే సిగ్గుతో తలదించుకునేంత తళతళలాడే తెల్ల అన్నమయితే మరీ మంచిది. బాగా పాలిష్ చేసి చేసి బియ్యం సన్నగా, నున్నగా ఉండాలి.
బియ్యం చేతిలో పట్టులా జారిపోవాలి. సన్న బియ్యం తినడం ఒక హోదా. భాగ్యం. సంపదకు చిహ్నం. బియ్యాన్ని ఎంత పాలిష్ చేస్తే అంతగా అందులో పోషకవిలువలు పోతాయి. మనకు కారు తెలుపు మీద ఉన్న మోజు, బలహీనత బియ్యం విషయంలోకూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు ఎంతో కొంత వడ్లను దంచి బియ్యం చేసే పద్ధతి ఉండేది. నెమ్మదిగా రైస్ మిల్లులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వరిపొట్టును తీసి తీసి, చివరకు బియ్యాన్ని కూడా పదే పదే పాలిష్ చేసి అంతులేని ఔషధ విలువలను ఆ పాలిష్ తోపాటు వడకడితే ఒట్టి కార్బో హైడ్రేట్ ను మాత్రమే తింటూ నవనాగరికులమనుకుంటున్నాం.
ఈమధ్య నగరాల్లో హ్యాండ్ పౌండ్ బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అని ఆర్గానిక్ దుకాణాల్లో అమ్ముతున్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే ఇవి రెండు, మూడు రెట్లు ధర ఎక్కువ. ఇవి అంత తెల్లగా ఉండవు. నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి, వెంటనే ఆకలి వేయదు.
శరీరంలోకి షుగర్ గా నెమ్మదిగా మారుతుంది. అదే తళతళలాడే తెల్ల అన్నం తింటే వెంటనే షుగర్ గా మారి, కాసేపటికే ఆకలి వేస్తుంది. ఔషధగుణాలు, ఇతర పోషకవిలువలు తెలుపులో వెలవెలపోయి ఉంటాయి.
పెళ్లి సంబంధాల ప్రకటనల్లో కూడా మనం మొహమాటం, సిగ్గు లేకుండా తెల్లటి అబ్బాయికి, తెల తెల్లటి చిదిమితే పాలుగారే నవలావణ్య సౌందర్యవతి కావాలని స్పష్టంగా అడుగుతాం. అలా ఎవరూ దొరకరు కాబట్టి ఆ అబ్బాయి పెళ్లి తెలతెలవారుతుంది.
రిన్ బట్టల సోపుతో ఉతికిన బట్టలు వేసుకున్న అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఎలా ప్రపంచాన్ని జయించి తలెత్తుకుని నిలబడుతోందో రోజూ టీ వీ ప్రకటనల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటిదే తెల్ల అన్నం. ఔషధ పోషక విలువలు కావాలనుకుంటే గుప్పెడు విటమిన్ టాబ్లెట్లు వేసుకోవచ్చు.
ఇప్పుడు నల్ల బియ్యం అత్యంత ఆరోగ్యకరం అని చెబుతున్నారు. చైనాలో చక్రవర్తులు, రాజులు ఈ నల్ల బియ్యం తినేవారట. దాంతో చక్రవర్తుల బియ్యం అని నామకరణం చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నల్ల బియ్యం వాడకం పెరుగుతోంది. రైతులు ఈరకం వరి సాగు చేస్తున్నారు. షుగర్, క్యాన్సర్, హృద్రోగాలకు ఈ నల్లబియ్యం ఒక ఔషధంగా పనిచేస్తుందట. ఆ రోగాలు రాకుండా రక్షిస్తుందట.
ఎంత నాజూకు అయితే అంత బలహీనం. అనారోగ్యం. ఎంత యంత్రాలతో ముడిపడితే అంతగా అనర్థం. ఎంత తెలుపెక్కితే అంత ప్రమాదం. నల్లనల్లటి నలుపు మంచిదే. చాలా మంచిది. నల్ల బియ్యం ఇంకా మంచివి.
తాళి కడితే అక్షతలు చల్లి ఆశీర్వదించాలి. సంసారం ముక్కలు చెక్కలు కాకుండా, దెబ్బ తినకుండా, పచ్చగా పదికాలాలు ఉండాలని పసుపు బియ్యాన్ని అ క్షతంగా- అక్షతలుగా చల్లుతున్నాం. చల్లించుకుంటున్నాం. రేప్పొద్దున నల్ల బియ్యం ఉపయోగాలు తెలిసి అవగాహన పెరిగితే కడుపును ఆశీర్వదించాల్సింది ఆ నల్ల బియ్యమే!
సందర్భం:-
అన్నమే మన కొంప ముంచుతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐ సి ఎం ఆర్) తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు పెరగడానికి ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం, జీవనశైలిలో మార్పులే కారణమని ఈ అధ్యయనంలో నిరూపణ అయ్యింది. నేచర్ మెడిసిన్ మ్యాగజైన్ ఈ అధ్యయనం వివరాలను సమగ్రంగా ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం-
# దేశంలో 83 శాతం మంది ఏదో ఒక మెటబాలిక్ రిస్క్ తో బాధపడుతున్నారు.
# హైపర్ టెన్షన్, హై కొలెస్టరాల్, డయాబెటిస్ సాధారణమైపోయింది.
# గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక శ్రమవల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యాలు మెరుగ్గా ఉన్నాయి.
# మన ఆహారంలో వరి, గోధుమవల్ల పిండిపదార్థాలు ఎక్కువై ప్రోటీన్లు బాగా తగ్గిపోతున్నాయి. దీనితో అనేక జీవనశైలి వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి.
# పిండిపదార్థాలకు బదులు మొక్కలు, పాడి పరిశ్రమ, గుడ్లు, చేపల ద్వారా దొరికే ప్రోటీన్లు తీసుకుంటున్నవారు ఆరోగ్యంగా ఉన్నారు.
# మొత్తమ్మీద అన్నం తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం వైపు ప్రజలను మళ్లించేలా ప్రజారోగ్య విధానాలు ఉండాలని ఐసిఎంఆర్ సూచిస్తోంది.
దేవుడా!
ఆయనెవరో చెబితే అన్నం మాని పిచ్చిగా పచ్చి కూరలు తిన్నాం.
ఇంకొకాయన చెబితే అన్నం మాని పన్నీర్ తిన్నాం.
మరొకాయన చెబితే అన్నం మాని పక్షుల్లా సిరి ధాన్యాలు తిన్నాం.
దారినపోయే దానయ్య చెబితే అన్నం మాని రోటీలు తిన్నాం.
ఆశ్రమం స్వామి చెబితే అన్నం మాని పండ్లు తిన్నాం.
ఓనమాలు రాని యూట్యూబర్లు చెబితే అన్నీ మాని ఆకులు అలములు తిన్నాం.
ఇన్ని అయ్యాక…అధికారికంగా భారత వైద్య పరిశోధన మండలి అన్నం వద్దని ఇప్పుడా చెప్పేది? తూచ్! మేమొప్పుకోము! “అన్నం పర బ్రహ్మ స్వరూపం” అంటే అన్నం పరులకే బ్రహ్మస్వరూపం; మనకు కాదని విరుపు అర్థం ఉందో! ఏం పాడో!
అన్నట్లు ఈ పూట-
“కడుపుకు అన్నమే తింటున్నారా!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article