.
కేసీయార్ హయాంలో అరాచకంగా సాగిన విద్యుత్తు అక్రమాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసీచూడనట్టుగా వదిలేసిందా..? ఎవరి పాపాన వాళ్లే పోతారులే అని సీఎం క్షమించేస్తున్నాడా..? లేక ఇంకేదైనా వ్యూహాన్ని అమలు పరుస్తున్నాడా..? ఓ ప్రభుత్వాధినేతగా పాత ప్రభుత్వాల అక్రమాల వెల్లడి తన బాధ్యత అని మరిచిపోయాడా..?
పొద్దున్నే ఈనాడులో ఓ వార్త… యూనిట్ విద్యుత్తు పవర్ ఎక్స్ఛేంజ్ కొన్ని స్లాట్లలో మరీ కేవలం 2 పైసలే యూనిట్ చొప్పున దొరుకుతోందనేది ఓ ప్రధానాంశం కాగా… ఈ ధరలు పడిపోయిన దెబ్బకు రాష్ట్రంలోని 5 థర్మల్ ప్లాంట్లను షట్‌డౌన్ చేశారనేది మరో ప్రధానాంశం…
Ads
భద్రాద్రిలో 3 ప్లాంట్లు, యాదాద్రిలో 2 ప్లాంట్లు మూసేశారు తాత్కాలికంగా… ఎందుకు..? ఈ ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి వ్యయం మరీ ఎక్కువ… 5.50 నుంచి 6 రూపాయలు… ఒకవైపు ఎక్స్‌ఛేంజిలో 10 నుంచి 20 పైసలకు కూడా పవర్ దొరుకుతున్నవేళ… ఆర్రూపాయాల కరెంటు జనంపై భారమే కదా…
ఎందుకిలా ధరలు పడిపోయాయి..? దేశమంతా వర్షాలు… బోలెడంత సౌరవిద్యుత్తు అందుబాటులోకి వచ్చింది… తెలంగాణలో గత మార్చిలో 17 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే, ఇప్పుడది 11 వేల మెగావాట్లకు పడిపోయింది… అందుకని మన థర్మల్ ప్లాంట్లను మూసేశారు…
రాష్ఠ్రం ఏర్పడిన కొత్తలో ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్లు, దానికోసం కారిడార్‌కు డబ్బు చెల్లింపులతోపాటు ఎడాపెడా సాగిన కరెంటు కొనుగోళ్లలో కమీషన్ల బాగోతాలు… దీనికితోడు కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి ప్లాంట్లు కట్టారు… ఇవన్నీ కాళేశ్వరం బాపతు అక్రమాలు, వైఫల్యాలను మించిన యవ్వారాలు…
జస్ట్, ఎక్స్‌చేంజిలో ధరలు పడిపోగానే ఫస్ట్ భద్రాద్రిలో జనరేషన్ ఆపేస్తున్నారు… ఆపినా ఆ ఫిక్స్‌డ్ ఛార్జీలు జనంపై పడక తప్పదు… కాలుష్య కారకమైన సబ్ క్రిటికల్ ప్లాంట్లను దేశమంతా తొలగిస్తున్నారు… ఇప్పటికి 18,800 మెగావాట్ల ప్లాంట్లను తొలగించారు…
బేస్ లోడ్ పవర్, ఎనర్జీ సెక్యూరిటీ, గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ ప్లాంట్లు అవసరమే కావచ్చుగాక, కానీ కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంటు నిర్మాణం కేసీయార్ పెద్ద తప్పిదం… ఒకవైపు దేశం సూపర్ క్రిటికల్, అల్ట్రా సూపర్ క్రిటికల్ వైపు వెళ్తుంటే కేసీయార్ తెలంగాణను వెనక్కి నడిపించాడు… సబ్ క్రిటికల్ కాలుష్యం తగ్గాలంటే తెలంగాణ జనంపై మరో భారం… ఎలాగంటే..?
కాలుష్య ఉద్గారాలపై (ముఖ్యంగా SOx, NOx) నిబంధనలను కేంద్రం కఠినతరం చేస్తోంది… సబ్-క్రిటికల్ ప్లాంట్లు ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండాలంటే, వాటిలో ఖరీదైన ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (FGD) వంటి కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి… ఈ అదనపు ఖర్చు భరించలేని పక్షంలో, ప్లాంట్‌ను మూసివేయడం తప్పనిసరి కావచ్చు…
భారతదేశం 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలు (Net-Zero Emissions) లక్ష్యాన్ని పెట్టుకుంది… పునరుత్పాదక ఇంధన ధరలు మరింత తగ్గినప్పుడు, బ్యాటరీ నిల్వ సాంకేతికత చౌకగా, సమర్థవంతంగా మారినప్పుడు, బొగ్గు ఆధారిత విద్యుత్తు అవసరం తగ్గుతుంది… ఆ సమయంలో, భద్రాద్రి వంటి బొగ్గు ప్లాంట్లను తొలగించడం జరుగుతుంది…
రాబోయే కాలంలో హైబ్రిడ్ పవర్, రెన్యువబుల్ పవర్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) లే ప్రధానం… మరీ ఈ సాంకేతిక వివరాల్లోకి ఇక్కడ వెళ్లలేం గానీ… కేసీయార్ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై తొలుత ఓ కమిషన్ వేశారు… తరువాత కొన్ని పరిణామాల నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోగా, ఆయన స్థానంలో జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ విచారణ పూర్తి చేసి, నివేదిక కూడా సమర్పించారు…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ వివరాలను సభకో, ప్రజలకో వెల్లడి చేయడం లేదు… తను కేసీయార్‌ను క్షమించాలనుకుంటే వోకే… కానీ తన హయాంలో సాగిన కీలకమైన విద్యుత్తు రంగ అక్రమాలు, వైఫల్యాలు, అడ్డదిడ్డం నిర్ణయాలు, కాళేశ్వరాన్ని మించిన తప్పులు జనానికి తెలియాల్సిన అవసరం లేదా పాలకా..? పోనీ, ఇదీ సీబీఐకి అప్పగించి, చేతులు దులుపుకోవచ్చు కదా..!!
Share this Article