.
కొన్నేళ్ళక్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట నియాపోలిస్ నేల ఎకరా వంద కోట్ల రూపాయలు పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. రియలెస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి స్వరాలు కట్టి పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ రాగాల వల్ల తేలిపోయింది.
భారతదేశంలో బాంబే, ఢిల్లీతో పాటు ఎక్కడా లేనంత ఎక్కువ ధరకు భూములు అమ్ముడు పోతున్నాయని భ్రమ కలిగించడంలో సక్సస్ అయ్యామని రియలెస్టేట్ మాఫియా చేసుకున్న విజయోత్సవ సంబరాలు పూర్తికాకముందే…ఇదంతా హైప్ అని…ఒట్టి డొల్ల అని…ఒక పథకం ప్రకారం కొందరు ఒకటి లేదా రెండెకరాల రేటును అమాంతం పెంచి…ఆ రేట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు స్థిరపరచిన…స్థిరాస్తి వ్యాపారుల రియల్ ఎత్తుగడ అని మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.
Ads
ఆ కథనాల సాంకేతిక, ఆర్థిక అంశాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా అర్థం కావడానికి అందులోనుండి ఒకటి రెండు విషయాలను పట్టుకుంటే చాలు.
కోకాపేట ఎకరా వంద కోట్ల లోకోత్తర వేలం పాట ఆస్కార్ అవార్డు తరువాత…శంకరపల్లి భూముల వేలం పాటల అంతర్జాతీయ అవార్డుల ప్రదానం జరిగింది. అంతదాకా గజం ముప్పయ్ వేల రూపాయల ధర ఉన్నది…ఈ ఈవేలం గాలిపాటల్లో లక్ష రూపాయలతో పల్లవి మొదలయ్యింది. రెండు చరణాలు పూర్తయ్యేసరికి శ్రోతల కాలికింద భూమి కదిలిపోయింది.
గజం లక్ష అంటే ఎకరా దాదాపు యాభై కోట్లు. మొన్నటిదాకా ఎకరా పదిహేను కోట్లు. వంద ప్లాట్లకు వేలం పాటలో పాల్గొని రేట్లు నాలుగయిదంతలు పెంచిన రియలెస్టేట్ విలయవిద్వాంసులు తరువాత అడ్రస్ లేకుండా పోయారు. వేలం పాటలో పాల్గొనడానికి కట్టిన కనీస రుసుమే లక్షల్లో ఉంది. నిర్ణీత గడువులోగా అత్యంత ఎక్కువ ధర పాడినవారు వచ్చి…ఆ సొమ్ము చెల్లించకుంటే…ముందు కట్టిన ఆ రుసుము వెనక్కు రాదు. అలా నూటికి 95 మంది వదులుకున్న సొమ్మే హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ- హెచ్ ఎం డి ఏ కు కోట్లకు కోట్లు మిగిలిపోయింది.
దీనితో అరటిపండు ఒలిచిపెట్టినట్లు కోకాపేట వంద కోట్ల వెనుక ఉన్న కథ అందరికీ అర్థమయింది. వందల ఎకరాలు ఉన్నవారు ఒక ఎకరాను ఈ వేలంవెర్రి జూదంలో ఎర వేస్తారు. చుట్టూ మిగతా భూములకు ఆకాశం అంచులు తాకిన ధరనే నిర్ణయిస్తారు.
కోకాపేటలో ఇళ్లు కొనాలనుకుని వెళ్లేవాడు పగలే చుక్కలు కనిపించి కళ్లు తిరిగి పడిపోతూ ఉంటాడు. అర ఎకరమో, పావు ఎకరమో ఉన్నవాడు క్యాలిక్యులెటర్లో సున్నాలు పట్టని వందల కోట్ల పగటి కలలు కంటూ…అమ్ముకోలేక పట్టపగలే చీకట్లలో పడి ఉంటాడు. ప్రపంచ నగరానికి ఈ వందకోట్ల పాటే సిగ్నేచర్ ట్యూన్ అని అధికార పక్షం అంటుంది. అధికార పక్షం గూట్లో మనిషి పాడిన వందకోట్ల పాటలో అపస్వరాల రియలెస్టేట్ గతితప్పిన గమకాలను ప్రతిపక్షం ఎత్తిచూపుతుంది.
రియలెస్టేట్ మాఫియా లక్షల కోట్ల భూవ్యాపారాలు ఎలా చేస్తోందో మీడియా వైనవైనాలుగా చెబుతూ ఉంటుంది. సామాన్యుడు కొనలేని, చేరుకోలేని, కనీసం కలగనలేని వందో అంతస్తు ఆకాశహర్మ్యం హై రైజ్ బాల్కనీలో మరో కోకాపేట వేలం పాటల సంగీత కచేరీకి ముహూర్తం నిర్ణయమవుతూ ఉంటుంది.
ప్రస్తుత సందర్భం:- నాటి కోకాపేట నియోపోలీస్ ఎకరా వంద కోట్లకే మూర్ఛపోయినవారు ఇప్పటివరకూ కోలుకోలేదు. ఇప్పుడు ఊరి నడిబొడ్డున రాయదుర్గంలో ఎకరా 177 కోట్లకు వెళ్ళింది. అంటే గజం భూమి దాదాపు నాలుగు లక్షల రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఎందరు మూర్ఛపోతారో!
ఏయ్! ఎవర్రా అక్కడ?
హైదరాబాద్ రియలెస్టేట్ పడిపోయింది అన్నది! కనీసం షేర్ ఆటో వేసుకుని రాయదుర్గం రండి! కోకాపేట నియోపోలీస్ ను తలదన్నిన నయాపోలిస్ లు రాయదుర్గంలో మూలకొకటి ఉన్నాయి!
అన్నట్లు-
రెండొందల కోట్లతో భూమి కొని, వందల, వేల కోట్లతో బిల్డింగులు కట్టి…అమ్మితే చదరపు అడుగు రేటు ఎంత ఉంటుంది? ఎంత ఉంటే మనకెందుకు? హైదరాబాద్ ఈజ్ రైజింగ్! రియలెస్టేట్ లెక్కలే సగటు జీవనప్రమాణాలకు కొలమానాలుగా మారినప్పుడు…ఈ భూముల ఈవేలం రైజింగే ప్రభుత్వాలకు ఊపిరి! మన తలసరి ఆదాయ కీర్తికి కిరీటం! మన సామాజిక భద్రతకు పెట్టని కోట-“రాయదుర్గం”!
ఇదొక- అంతులేని రియల్ “వేలం” వెర్రి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article