@@@
ఆమె మనిషే…
స్త్రీని వంటగదికి, పడకగదికి పరిమితం చేసే సమాజం 20వ శతాబ్దంలో కొంత స్పృహ తెచ్చుకుని ఆమెను కాస్త బయటకు రానిచ్చింది. అయితే భద్రత మాత్రం ఇవ్వలేకపోతోంది. ఈ 21వ శతాబ్దంలో కూడా ‘ఆమె’ విషయంలో సమాజం సంస్కారం పొందలేదు.
Ads
ఇప్పటికీ ఆమెను వంటగదికి, పడకగదికి పరిమితం చేసే కుటుంబాలు చాలా ఉన్నాయి. మహాఅయితే గుమ్మంలో ఊడ్చి ముగ్గేయడానికి, పెరట్లో బట్టలు ఉతికి ఆరేయడానికి మాత్రమే వంటగది, పడకగది దాటి రాణిస్తున్నారు.
ఆమె ఇప్పుడు ఉద్యోగం చేసినా ఇంట్లో అన్నిపనులు చేయాల్సిందే. అది అదనం. ఆ మాటకొస్తే ఇంటిపనులు, వంటపనులు, ఒంటిపనులు చేయడానికి మాత్రమే పుట్టిన రోబో.
స్త్రీని కేవలం ఇంటిపని మనిషిగా, ఒంటిపని మనిషిగా మాత్రమే చూసే కుటుంబాలకు, ఆ కుటుంబాల్లో నలిగిపోయే స్త్రీల ఆత్మ గౌరవ ఘోషకు ఈ సినిమా ఓ చిట్టి గొంతుక ఇచ్చినట్టు అనిపించింది.
మగపిల్లలకు కనీసం మంచినీళ్ళు కూడా తెచ్చుకోవడం, తిన్న కంచం కడక్కపోయినా కనీసం సింకులో వేయడం వంటి చిన్న పనులు కూడా నేర్పకుండా, ఆడపిల్లలకే అన్నిపనులు అంటగట్టే అన్ని కుటుంబాలకు సినిమా చివర్లో తన తమ్ముడి ద్వారా ఓ హెచ్చరిక చేస్తుంది కథానాయకి. ఇది చాలా కుటుంబాల చెంపలు చెళ్ళుమనిపించిన సన్నివేశం.
తనను మనిషిగా చూడలేని మామ, భర్త ముఖాన మురికినీళ్ళు పోసి ఆ బందీఖాన నుండి ఆమె బయట పడుతుంటే, ఆమె పోసిన మురికినీళ్ళు చాలామంది మగాళ్ళ ముఖంపై పడాలేమో అనిపించక మానదు.
పగలు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తిన్నంత అసహ్యంగానే రాత్రి తన శరీరాన్ని తింటుంటే ఆమె చూసిన చూపు ‘ఆమె మనిషే’ అని అంగీకరించలేని పురుషాధిక్య సమాజాన్ని చెత్తకుప్పతో ఆమె కన్నులు పోల్చడం చూసి సిగ్గుపడాల్సిందే.
“వంటింట్లో ఏం పనుంటది ఈ ఆడోళ్ళకు” అనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిందే. నేను చిన్నప్పుడే అమ్మను చూసేశా. అమ్మ కట్టెలపొయ్యిదగ్గర రోజుకు ఎన్నిగంటలు గడిపేదో, ఎంత శ్రమ పడేదో, అసలు ఇంట్లో అమ్మ ఎంత చాకిరి చేస్తే మేం బయటపడే వాళ్ళమో నేను చూశాను.
Share this Article