.
కాంతార సినిమా కథను కాస్త డిఫరెంటుగా చూడాలి… ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా నాగరికుడు అనేవాడు ఎప్పుడూ వనాల్లోకైనా వెళ్లి మరీ అనేక కుయుక్తులతో మూలవాసుల మీద కగార్ దాడులు చేస్తాడు, పెత్తనం చేస్తాడు… సహజ భూఖనిజ వనరుల్ని, మానవ వనరుల్ని దోచుకుంటాడు, వెట్టి చేయించుకుంటాడు…
అవసరమైతే మరో మూలవాసుల తెగల నడుమనే తగాదాలు పెడతాడు… దోపిడీ సహించలేని మూలవాసులు తిరగబడుతూనే ఉంటారు, ఎక్కువగా ఓడిపోతూనే ఉంటారు… కానీ కాంతార కథలో మాత్రం వాళ్లకు దైవిక శక్తులు తోడుగా ఉంటాయి…
Ads
- రిషబ్ శెట్టి ఈ కథను స్ట్రెయిటుగా చెప్పకుండా… తంత్ర శక్తులు వర్సెస్ దైవిక శక్తులు అనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చి, తమ మంగుళూరు ప్రాంత గుళిగ దైవాన్ని, ఆ జానపద సంస్కృతిని ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించాడు… పక్కా ఓ జానపద కథగా మారిపోయింది ఇలా…
తన తెగవాళ్లకు వెట్టి నుంచి విముక్తి కల్పించడం, వాళ్లు హద్దులు దాటేసి మనపైకి వచ్చేదాకా ఎందుకు ఆగాలి, మనమే వెళ్దాం అని తెగింపుతో ముందుకు వెళ్లడం, తమ వనరుల విలువను తెలుసుకుని, వ్యాపారంతో వస్తుమార్పిడితో తమ తెగ ఆవాసాల్లో సకల సౌకర్యాల కల్పనకు పాటుపడటం సగటు ప్రేక్షకుడిని కనెక్టయ్యే అంశాలు…
రుక్మిణి వసంత్ రాజకుమార్తె పాత్రకు బాగా సూటైంది, కానీ రాజకుమారుడు పాత్రధారి ఎవరో గానీ… ఆ కేరక్టరైజేషన్ కుదరలేదు, ఆ పాత్రకు తనెవరో గానీ నప్పలేదు… రిషబ్ తల్లి పాత్రకు కాంతారలో తీసుకున్నట్టే మానసి సుధీర్‌ను తీసుకుంటే బాగుండేదేమో…
- నిజానికి రిషబ్ మీద బాహుబలి సీన్ల ప్రభావం బాగా ఉన్నట్టుంది… కోట గోడ పైనుంచి బాణాలు, అగ్నిగోళాలు ప్రయోగించడం, నాగరికులకూ మూలవాసులకూ నడుమ పోరాట దృశ్యాలు వంటివి చూస్తుంటే బాహుబలి సీన్లు చటుక్కున స్పురిస్తాయి… బాహుబలిలో విగ్రహస్థాపన సమయంలో కూలీలను ఎలా కొడతారో, కాంతార ప్రీక్వెల్‌లో కూడా గుడి నిర్మాణ కూలీలను అలాగే కొడుతుంటారు… ఐతే కొన్ని విషయాల్లో మాత్రం రిషబ్‌ను బాగా మెచ్చుకోవచ్చు…
సాధారణంగా రాజమౌళి క్రియేట్ చేసే సీన్లలో పర్‌ఫెక్షన్ కనిపిస్తుందనీ, తను అనుకున్నట్టు వచ్చేదాకా ఊరుకోడనీ అంటారు కదా… రిషబ్ ఈ విషయంలో రాజమౌళికి తాత… ప్రతి సీన్ చూస్తుంటే రిషబ్ ఎంత కష్టపడి ఉంటాడో అర్థమవుతూ ఉంటుంది మనకు… రిషబ్ నటుడిగా ఇరగదీశాడు.., ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో గుళిగ అవతారంగా… చివరలో చాముండి ఆవహించినప్పుడు మరీనూ…
సాధారణంగా సీక్వెల్ మీద పట్టుండదు దర్శకులకు… బాహుబలి ఫస్ట్ పార్ట్ కాస్త హై సీన్లతో ప్రేక్షకజనరంజకంగా సాగినా, సెకండ్ పార్ట్, అందులోనూ క్లైమాక్స్ నాసిరకమే… మరీ తాటిచెట్లను స్ప్రింగుల్లా వాడటం కూడా..! కానీ కాంతార ఫస్ట్ పార్ట్‌కన్నా సెకండ్ పార్ట్‌లో రిషబ్ శ్రమ ఎక్కువ కనిపిస్తుంది… ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లను పీక్స్‌కు తీసుకుపోయాడు..,
ఆ ఆడశిశువు కాళ్లూ చేతులూ సరిగ్గా ఆడవు, రిషబ్ వెంట్రుకల్ని, గోళ్లను తన చెలికత్తెలతో రుక్మిణి వసంత్ కత్తిరింపచేస్తుంది… వీటికీ క్లైమాక్స్ అంశాలకూ ముడిపెట్టిన తీరు బాగుంది… సరే, కథాకథనాలు ఎలా ఉన్నా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్‌ను… నిజంగా విజువల్ వండర్‌గా మార్చాడు…
- పచ్చటి, చిక్కటి అడవి, ఓవైపు జలపాతాలు, గుట్టలపై మేఘాలు… చీకట్లో ఆదివాసీ ఆవాసాలు, దీపాలు… థియేటర్లలో కొన్ని ఫ్రేమ్స్ చూస్తుంటే పులకింతే… ఆ అడవుల్లో ఆ ఆవాసాల సెట్లు, ఎక్కువ శాతం చీకట్లో నడిచే కథ, బందరు పోర్టు సీన్లు… తగినట్టు చిత్రీకరణ… వందల మందికి మూలవాసీ వేషధారణ, మరింత నల్లగా ఉండే మరో తెగ మనుషులు… ఆ అడవుల్లో ప్రతి సీన్ కోసం రిషబ్ పడిన శ్రమ కనిపిస్తుంది…
ఎక్కడికక్కడ సీన్లను, ప్రత్యేకించి క్లైమాక్స్ సీన్లను అజనీష్ లోకనాథ్ బీజీఎం కూడా బాగా ఎలివేట్ చేసింది… థమన్ ఓసారి ఖచ్చితంగా కాంతార చాప్టర్ వన్ చూడాలి… బాక్సులు బద్దలయ్యే మోతలు కాదు, ప్రేక్షకుడిని ఆ సీన్లకు ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోవాలి… థమన్ వేస్టని కాదు… అజనీష్ ప్రయోగం ఇంకాస్త పవర్‌ఫుల్… క్లైమాక్స్‌లో భూతకోల, ఆ బీజీఎంతో కథలో లీనమయ్యే ప్రేక్షకుడు అసంకల్పితంగా భూతకోలలాగే భుజాలు కదిలిస్తాడు…
రిషబ్ శెట్టికి కామెడీని కథలో ఎలా ఇరికించాలో తెలియదు… అందులో తేలిపోయాడు.,. సరే, ఈ కథలో డ్యూయెట్లు, రొమాన్స్ ఎలాగూ లేవు… వీసమెత్తు అసభ్యత, అశ్లీలం లేదు సినిమాలో… అంటే వెగటుతనం లేదు… చివరకు బాహుబలిలో తమన్నా బట్టలిప్పిస్తాడు రాజమౌళి… కానీ రిషబ్ ఆ వాసనల జోలికీ పోలేదు..! కాంతార మూడోభాగం మీద ఇంకా ప్రేక్షకులకు ఎక్కువ అంచనాలు ఉంటాయి… రిషబ్‌కు అది అగ్నిపరీక్షే…!!
Share this Article