.
తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లపై బ్లేమ్ గేమ్ నడుస్తోంది… చెల్లని జీవోతో రేవంత్ బీసీలకు ద్రోహం చేశాడని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు… అసలు బీఆర్ఎస్, బీజేపీ ఇన్‌ప్లీడ్ కాలేదు, బీజేపీ పూనుకుంటేనే బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం చెప్పేది, అసలు ద్రోహి బీజేపీయే అని కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానమే తప్పు, సో, ఆ రిజర్వేషన్లకు ఆమోదముద్ర దక్కదని ముందు నుంచే చెబుతున్నాం అంటూ బీజేపీ…
సీపీఐ, సీపీఎంతో పాటు బీసీ సంఘాలు, బీసీ మేధావులు కూడా విమర్శలు చేస్తున్నారు… బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధింపుకి నిరసనగా 14న రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు… వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్లు… పదండి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు చేద్దామని మరికొన్ని సూచనలు… మొత్తానికి రాష్ట్ర రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది… అదే చర్చ సాగుతోంది… దీంతో మిగతా రాష్ట్ర సమస్యలన్నీ పక్కకు వెళ్లిపోయాయి…
Ads
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలనే ఆలోచనలో ఉంది… కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టే హైకోర్టులో తేల్చుకొమ్మని చెప్పింది… పైగా సుప్రీంకోర్టు పాత తీర్పులు, ఆదేశాలను పేర్కొంటూ హైకోర్టు స్టే ఇచ్చింది… నిజానికి హైకోర్టు ఇచ్చింది స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ మీద కాదు, రిజర్వేషన్ల జీవో మీద స్టే… అంటే 42 శాతానికి పెంపు మీద… 50 శాతం గరిష్ట పరిమితికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదంటోంది…
ఐనా సరే, ఒకవేళ పాత రిజర్వేషన్ల జీవోల ప్రకారం గనుక ఎన్నికలకు వెళ్లే పక్షంలో… ఇప్పటికే పూర్తిచేసిన రిజర్వేషన్లను మళ్లీ మార్చాల్సిందే… ఒకవేళ సుప్రీంకోర్టుకు గనుక వెళ్తే స్థానిక ఎన్నికల్లో ఇంకా జాప్యం తప్పదు… ఒకవేళ పాత జీవోలు, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లే పక్షంలో… కాంగ్రెస్ పార్టీ తాము ఇవ్వదలిచిన 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడతామని, అంతే శాతం బీసీలకు సీట్లు ఇస్తామని చెబుతుంది…
తద్వారా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా అనివార్యంగా బీసీలకు ప్రయారిటీ ఇవ్వాల్సిన స్థితిని క్రియేట్ చేసి, ఆ రెండు పార్టీలను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది… మరి ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్లు..? అదొక చిక్కుముడి..! అప్పట్లో జయలలిత కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, పెంచిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టించింది కాబట్టి తమిళనాట ఎక్కువ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి… కానీ ఇప్పుడు ఆ రాజకీయ పరిస్థితి లేదు కదా…
లేదా సుప్రీంకోర్టు సూచించిన మేరకు ప్రక్రియ సాగాలి… సో, ఇదంతా ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు… ఏతావాతా పార్టీల నడుమ ఓ సమరం… మొత్తమ్మీద చూస్తే… మేం గరిష్ట స్థాయిలో బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నించాం, చట్టం చేశాం, ఆర్డినెన్స్ తెచ్చాం, జీవోలు ఇచ్చాం, ఢిల్లీలో ధర్నా చేశాం, కోర్టుల్లో కొట్లాడాం… మా సంకల్పంలో నిజాయితీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది…
సరిగ్గా అది కాంగ్రెస్ పార్టీకి బీసీల్లో ఎక్కడ మైలేజీ పెరుగుతుందోననే సందేహంతో… ఆ ఫాయిదాను కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చేయడానికి… బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే పనిలో పడ్డాయి… ఒకవేళ పాత జీవోల ప్రకారమే ఎన్నికలకు వెళ్లే పక్షంలో ఈ చర్చ యావత్తూ కాంగ్రెస్ పార్టీకి ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే ఇక..!!
Share this Article