.
స్మశానవాటిక. జీవుల్ని పైలోకాలకు పంపించే రుద్రభూమి…
ఆ పేరు వినగానే చాలామందికి భయం… రాత్రివేళ అటు వైపు వెళ్లాలంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి…
అనేకచోట్ల అసలు పిల్లల్ని, మహిళల్ని అంత్యక్రియల వేళ స్మశానవాటికకు రానివ్వరు… అలాంటిది ఓ స్మశానవాటికలో… పగలూ రాత్రీ సైలెంటుగా, భయాన్ని దహనం చేస్తూ, అనేకసార్లు ఆ చితిమంటల నడుమ ఒంటరిగా… మృతులకు ఇహ విముక్తి ప్రసాదిస్తున్న ఓ మహిళ ఉంది — ఆమె పేరు సుధారాణి…
Ads
అసాధారణమే కాదు… ఆమె ఎంచుకున్న వృత్తి, తన కమిట్మెంట్… భయాన్ని అధిగమించి ఆమె ఆ పనిలో కనబరిచే సిన్సియారిటీ… నిజంగా చప్పట్లు కొట్టాల్సిన ఓ సక్సెస్ స్టోరీ… ఆమెకు కదా అర్జెంటుగా ఓ పద్మ పురస్కారం దక్కాల్సింది…
అవును, దావణగెరె నగరంలోని పీబీ రోడ్ వైకుంఠ స్మశానవాటికలో గత పది సంవత్సరాలుగా ఆమె చేస్తున్న సేవ ఆలోచిస్తేనే… గౌరవంతో తల వంచి నమస్కరించాలని అనిపిస్తుంది…
శవాల మధ్య సేవ, శాంతి మధ్య జీవితం
ఆమె దృష్టిలో ఈ పని ఓ పవిత్రమైన సేవ… అనాథ శవాలు వస్తే తనే స్నానం చేయించి, దహనసంస్కారం చేస్తుంది… గ్రేట్… నమ్మగలరా..?
ఇప్పటి వరకు 4,000 కంటే ఎక్కువ మృతదేహాలకు ఆమె స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించింది…
కరోనా కాలంలో… శవాన్ని తాకడానికి, స్వయంగా అగ్గిపెట్టడానికి కూడా బంధుగణం, వారసులు భయపడిపోయిన రోజుల్లో కూడా… ఆమె అన్నీ తానై… ఒంటరిగా ఆ చితులకు నిప్పు పెట్టి, ఓ దండం పెట్టేది…
“ప్రతీ శరీరం చితిపై బూడిదగా మారే చివరిక్షణం వరకు నేను చూస్తుంటా…’’ ఎన్ని కపాల మోక్షాలకు ఆమె నిశ్శబ్ద ప్రేక్షకురాలో కదా… ‘‘ఈ అనుభవం ఎవరికి వస్తుంది ప్రపంచంలో అంటుంది’’ ఆమె నిర్వేదంగా…
మేనేజర్‌గా చేరి, ముక్తికారిణిగా మారిన సుధారాణి
నిజానికి సుధారాణి అసలు ఈ పనికోసం ఇక్కడికి రాలేదు…
విజయపురం నుంచి దావణగెరకు వచ్చి వైకుంఠ ట్రస్ట్‌లో మేనేజర్‌గా చేరింది మొదట్లో…
కానీ కొంతకాలానికి శవదహనం చేసే కార్మికులు మద్యం తాగి పని చేయడం చూసి, ఆ బాధ్యత ఆమే తీసుకుంది…
“మొదట్లో చాలా భయపడ్డా… కానీ రెండో, మూడో శవం దహనం చేసిన తర్వాత… నా భయం కూడా ఈ చితిమంటల్లో దహనమైపోయింది..,” అని నవ్వుతుంది సుధారాణి…
ఆమె భర్త సిద్ధరామేశ్వర స్వామీజీ కూడా అదే ట్రస్ట్‌లో మేనేజర్.
“ఇది కేవలం పని కాదు, సేవ. చనిపోయిన వారిని ఇహం నుంచి విముక్తి చేయడం ద్వారా మనకూ శాంతి లభిస్తుంది” అని అంటాడాయన…
కరోనా కాలంలో ఆమె ధైర్యం
కరోనా సమయం అది — భయమే అతి భీకరమైన వైరస్‌లా వ్యాపించిన కాలం…
మృతదేహాల దగ్గరికి ఎవరూ రాలేదు…
కానీ సుధారాణి మాత్రం మాస్క్ వేసుకుని, కర్రలతో చితి కట్టి, అగ్ని పెట్టి, బూడిదను తుంగభద్రలో నిమజ్జనం చేసేది…
- “రోజుకు వందకు పైగా మృతదేహాలు వచ్చేవి. రాత్రి పన్నెండు వరకు నేను అక్కడే ఉండేదాణ్ని. దెయ్యాలు ఉన్నాయంటారు… కానీ నేనంటానూ – ఇక్కడ దెయ్యాలు లేవు, దయ మాత్రమే ఉంది!” అని ఆమె గట్టిగా చెబుతుంటుంది…
మృతదేహాన్ని కాదు, భయాన్ని తగలబెట్టిన స్త్రీ
ఒక మృతదేహాన్ని దహనం చేయడం చిన్న విషయం కాదు… అందులోనూ మహిళ… పైగా ఒంటరిగా కూడా…
గంటల తరబడి నిప్పు ముందు నిలబడి, బూడిదగా మారే వరకు కాపలా కాయాలి.
కానీ ఆమెకు ఇది కేవలం పని కాదు – అది ఒక పుణ్యకార్యం…
“బతికి ఉన్న వాళ్లకే భయపడాలి, చనిపోయిన వాళ్లతో మనకేం భయం, నాకేమీ కాదు” అంటుందామె…
అమ్మాయిలకు స్ఫూర్తి
చాలా చోట్ల అమ్మాయిలను శ్మశానానికి కూడా అనుమతించరు… కానీ సుధారాణి మాత్రం ఆ చీకటి ప్రదేశంలో వెలుగై నిలిచింది… ఒక స్త్రీగా, భయాన్ని జయించి, మృతులకు గౌరవం ఇచ్చిన ఆమె — “మృతదేహాలను విడిపించడం నా వృత్తి కాదు, నా వ్రతం” అని చెప్పే ఆమె ఒక స్ఫూర్తి…
ఎంత పుణ్యం చేసినా మనసంతా ప్రశాంతంగా ఉండటం అరుదు… సుధారాణి ఆ శాంతిని ఆ చితిమంటల ముందు నిలబడి పొందింది… భయాన్ని దహనం చేసి, ధైర్యాన్ని వెలిగించిన ఆ మహిళకు నమస్కారం…
Share this Article