.
Subramanyam Dogiparthi
….. ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ… పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే… యూ ఆవకాయ మి ఐస్ క్రీం దిసీజ్ ది హాట్ అండ్ స్వీట్ లవ్ స్ట్రీం … నిజంగా సినిమా అలాగే ఆవకాయ+ ఐస్ క్రీం లాగానే ఉంటుంది . నేనయితే ఎన్నిసార్లు చూసానో ఈ సినిమాను ! మొత్తం ఈ సినిమా ట్రూపుకంతా చప్పట్లు కొట్టాల్సిందే .
ఎన్ని పార్శ్వాలను చూపారో ! ఒకవైపు ఇద్దరు యువకులు ఒక యువతి మధ్య ఆకర్షణ , ప్రేమ . ఆ ప్రేమకు నలుపు తెలుపు , తూర్పు పడమర , కులము మతము ఏమీ ఉండవు , ఆ ఆకర్షణ ప్రేమలను ఆపజాలవు అనే ఓ సందేశం . మరోవైపు సంపాదన కోసం దేశం కాని దేశానికి చేరి అక్కడి జీవనశైలికి సర్దుబాటు కాలేక సతమతమయ్యే నాలాంటోళ్ళ కష్టాలు బాగా చూపారు .
Ads
ఈ సినిమా వచ్చిన సంవత్సరం తర్వాత నేను అమెరికాకు వెళ్ళటం జరిగింది . ఈ సినిమాలో అన్న గారి లాగానే నేనూ తెగ ఇబ్బంది పడ్డా . ఈ సినిమా చూసినప్పుడల్లా నా కష్టాలే నాకు గుర్తుకొస్తాయి . ముఖ్యంగా తిండి , టబ్ బాత్ , మల విసర్జన తర్వాత శుభ్రం చేసుకోవడం , ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాను .
అమెరికాలో సెటిలయిన ఇద్దరు కళాకారులు గుమ్మలూరి శాస్త్రి , మీర్ అబ్దుల్లాల మానసిక పుత్రిక ఈ పడమటి సంధ్యారాగం . ఈ సినిమాలో విజయశాంతి తండ్రి ఆదినారాయణగా నటించింది ఆ గుమ్మలూరి శాస్త్రి గారే . నిజ జీవితంలో కూడా ఆయన నాటకాలరాయుడే . సుత్తి వీరభద్రరావు డబ్బింగ్ చెప్పటంతో ఆయన కూడా ఉన్నట్లే ఈ సినిమాలో .
ఆ తర్వాత ఈ సినిమా సినిమాగా మారటంలో ప్రధాన పాత్రధారులు జంధ్యాల , బాలసుబ్రమణ్యం . ఈ ప్రాజెక్టుని ఓకే చేయటం , రెండు దేశాల సంస్కృతులను సమ్మిళితం చేస్తూ అందమైన కధను నేసారు జంధ్యాల . ఓ సినిమాకు కావలసిన మలుపులు , ఊపులు , అన్నింటినీ చేర్చారు జంధ్యాల . అందుకే ఆయనకు ఉత్తమ కధా రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది .
ఈ సినిమా పది కాలాల పాటు మిగిలిపోవటానికి అవసరమైన శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు బాలసుబ్రమణ్యం . 18 వ శతాబ్దపు కర్నాటక సంగీత వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర విరచిత పిబరే రామరసాన్ని మన చేత జుర్రించారు బాలసుబ్రమణ్యం . పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం . అంత గొప్ప పదాలను అన్నాచెల్లెళ్ళు బాలసుబ్రమణ్యం , శైలజలు అంతే గొప్పగా పాడారు .
మన తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య విరచిత ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు పాట . జంధ్యాల ఓ బుల్లి కృష్ణుడిని ముద్దుగారే అన్నట్టుగానే భలే చూపించారు . ఆ తెల్ల బుల్లి కృష్ణుడు ఏ 40+ లోనే ఉండి ఉంటాడు ఇప్పుడు . జానకమ్మ అద్భుతంగా పాడారు .
ఇవన్నీ తూర్పు పాటలయితే ఈ సినిమాలో ఓ పడమటి పాట కూడా ఉంది . బాలసుబ్రమణ్యమే వ్రాసి ఆయనే పాడారు . ఈ పాట కాకుండా ఆయన మరింకేమయినా పాటల్ని వ్రాసారేమో నాకు తెలియదు . Life is shabby without you baby అంటూ సాగే ఈ పాట ఫుల్ వెస్ట్రన్ బీట్లతో ప్రేక్షకులను ఊపేస్తుంది .
పైగా ఈ పాట పాడే రొనాల్డ్ పాత్రలో డ్రమ్స్ శివమణి గొప్పగా సెట్టయ్యాడు సూటయ్యాడు . అతని పేరుని బాలసుబ్రమణ్యమే సజెస్ట్ చేసారట . శివమణి బ్రహ్మాండంగా నటించాడు . కాదు . ఇరగతీసాడు .
సినిమా అంతా విజయశాంతి చుట్టూనే తిరుగుతుంది . విజయశాంతి గొప్పగా నటించింది . ఆమె నటించిన ఇలాంటి సినిమాలను చూసినప్పుడు అనవసరంగా ఆమెను రాములమ్మను చేసారే అనిపిస్తుంది . హీరోగా నటించిన తెల్ల కుర్రాడు థామస్ జేన్ ఒక ఏక్టింగ్ స్కూల్లో విద్యార్ధి . బాగా నటించాడు .
ఇంక ఈ సినిమాలో గుమ్మలూరి శాస్త్రి గారు ఎలా అదరగొట్టేసారో ఎవరూ మరచిపోలేరు . మరో ముఖ్య పాత్ర గణపతి . నటుడి పేరు విజయ్ . శుభలేఖ సుధాకర్ డబ్బింగ్ చెప్పాడు . ఈ గణపతిని మేపలేక నానా తిప్పలు పడే తండ్రి శేషగిరిరావు పాత్రలో నటించిన ఇండియన్-అమెరికన్ పేరు కూడా శేషగిరిరావే . పొట్టి ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు . వీరందరితో పాటు అమెరికాలో నివసిస్తున్న ఎంతో మంది ప్రవాసాంధ్రులు తళుక్కుమంటారు . అందరూ ఓ పండగ లాగా ఈ సినిమాను పూర్తి చేసినట్లుగా అనిపిస్తుంది .
హాస్య చిత్రాలకు చిరునామా అయిన జంధ్యాల ఆనందభైరవి , పడమటి సంధ్యారాగం వంటి బరువైన సినిమాలను కూడా తీయగలరని నిరూపించుకున్నారు . హేట్సాఫ్ టు జంధ్యాల . ఇంత గొప్ప సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది .
1987 ఏప్రిల్లో వచ్చిన ఈ సినిమాని మా తరంలో కానీ ఈ తరంలో కానీ చూడనివారు ఉండరు . ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . It’s a romantic classic . An unmissable one . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article