.
మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదోరకంగా ప్రభుత్వాన్ని, పార్టీని గోకడానికే ప్రయత్నిస్తున్నాడు… తన నియోజకవర్గం తెలంగాణలో భాగమేననీ, అక్కడ కూడా ప్రభుత్వ పాలసీలు వర్తిస్తాయనీ, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మునుగోడుకు తాను సీఎం కాననీ మరిచిపోతున్నాడు…
తనేం అంటున్నాడంటే..? మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ (Wine Shops ) టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశాడు…
Ads
షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించాడు…
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశాడు… వైన్ షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నాడు…
ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్‌లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నాడు… ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్‌ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నాడు…
స్థూలంగా గమనిస్తే ఎమ్మెల్యే పెట్టే ఆంక్షలు, షరతులు ఆమోదయోగ్యం అనిపిస్తాయి… సమాజహితం అనిపిస్తాయి… కానీ తను అధికార పార్టీ ఎమ్మెల్యే… నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ పాలసీతో సంబంధం లేదనీ, ఇవి నా షరతులు అని ఎలా అంటాడు..? మునుగోడుకు ఏమైనా స్వయంప్రతిపత్తి ఉందా..? అక్కడ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే చెప్పిందే శాసనమా..?
రేప్పొద్దున ఇంకా ఇతరత్రా అన్ని విషయాల్లో కూడా వేరే ఎమ్మెల్యేలు ఇలాగే సొంత పాలసీలను, షరతులను ప్రవేశపెడితే… ఇక ప్రభుత్వాలు దేనికి..? ఇదంతా కావాలని గోకడమేనా..? రియాలిటీ విషయానికి వస్తే, పర్మిట్ రూమ్స్ ఉండటమే బెటర్, లేకపోతే మందుబాబులు బయట ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా తాగేసి న్యూసెన్స్ చేస్తారు…
షరతులు పాటించకపోతే తరువాత నష్టపోతారు అనడం బెదిరించడమే.,. ఊరి బయట మాత్రమే ఉండాలనేది ఆచరణలో సాధ్యం కాదు… కాకపోతే స్కూళ్లు, ప్రార్థన స్థలాల సమీపంలో ఉండకూడదు, అదెలాగూ ప్రభుత్వ పాలసీలో ఉన్నదే… సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మాలనేదీ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమే…
బెల్టు షాపుల మీద ప్రతి నాయకుడూ మాట్లాడతాడు, ప్రతి ప్రభుత్వం వాటి తాట తీస్తాననే చెబుతుంది… బెల్టు షాపులు లేకపోతే అసలు మద్యవ్యాపారమే లేదు… మహిళల సాధికారత అనే పదానికి విస్తృతార్థం ఉంటుంది… ఇది కాదు…
నేను చెబుతున్నట్టుగానే మద్యం విధానం ఉండాలని నేరుగా పార్టీని, ప్రభుత్వాన్నే అడగాలి… లేదా నచ్చకపోతే పార్టీని వదిలేయాలి, తన పదవినే వదిలేయాలి… ఆ మాట చెప్పొచ్చుగా ఎమ్మల్యే సాబ్..!!
Share this Article