.
ఇప్పుడు జుబ్లీహిల్స్ ఉపఎన్నిక మీదే తెలంగాణ రాజకీయం కేంద్రీకృతమైంది… ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమే పోటీ అన్నట్టుగా కనిపిస్తోంది… రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే… అందుకే తమవైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి…
నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఉపఎన్నికలు అంటే… స్థానిక నాయకుడి మరణం, సానుభూతి, కుటుంబ వారసత్వం చుట్టూ తిరిగే భావోద్వేగాల పోరుగా భావిస్తారు… అయితే, 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈ సాధారణ అభిప్రాయానికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించాయి…
Ads
తెలంగాణ ఓటరు స్పష్టంగా ఒక సందేశం ఇస్తున్నాడు… “సానుభూతి గుండెల్లో ఉంటుంది, కానీ ఓటు మాత్రం అధికారంలో ఉన్న పార్టీకే పడుతుంది…” నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఈ పాత ప్యాటర్న్‌కు కచ్చితమైన పరీక్ష…
స్పష్టమైన గణాంకాలు: 80% సార్లు గెలిచిన అధికార పార్టీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాలతో జరిగిన 5 ఉపఎన్నికలను పరిశీలిస్తే, అధికారంలో ఉన్న పార్టీ 5లో 4 సార్లు (80%) విజయం సాధించింది… అదే సమయంలో, మరణించిన నేత కుటుంబ సభ్యులు కేవలం ఒక్కసారే (నాగార్జున సాగర్) గెలిచారు…
1) పాలేరు ఉపఎన్నిక… 2016… మరణించిన ఎమ్మెల్యేది కాంగ్రెస్… కానీ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్… ఇక్కడ అధికార పార్టీ గెలిచింది… సానుభూతి ఓడిపోయింది…
2) నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక… 2016… మరణించిన ఎమ్మెల్యేది కాంగ్రెస్… కానీ అప్పుేడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్… ఇక్కడ కూడా అధికార పార్టీయే గెలిచింది… ఈసారి కూడా సానుభూతి పనిచేయలేదు…
3) దుబ్బాక ఉపఎన్నిక… 2020… మరణించిన ఎమ్మెల్యేది బీఆర్ఎస్… ఇక్కడ కూడా సానుభూతి పనిచేయలేదు… అదేసమయంలో అధికార పార్టీ కూడా గెలవలేదు… ఈ ఉపఎన్నికలో మాత్రం డిఫరెంట్ రిజల్ట్… బీజేపీ గెలిచింది…
4) నాగార్జునసాగర్ ఉపఎన్నిక… 2021… దివంగత నేతది బీఆర్ఎస్… ఇక్కడ సానుభూతి ప్లస్ అధికార పార్టీ అనే కోణం బాగా వర్కవుట్ అయ్యింది…
5) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక… 2024… దివంగత నేతది బీఆర్ఎస్… అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్… ఇక్కడా సానుభూతి పనిచేయలేదు… అధికార పార్టీయే గెలిచింది…
జూబ్లీహిల్స్ పోరు… పాత ప్యాటర్న్…
మాగంటి గోపీనాథ్ (BRS) మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది… BRS ఆయన సతీమణి మాగంటి సునీతను బరిలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ బలమైన, బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ను రంగంలోకి దించింది…
1. BRS ఆశ: సానుభూతిని ఓటుగా మార్చడం…. BRS, మాగంటి గోపీనాథ్ కి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత పట్టు, ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతిని నమ్ముకుంటోంది… ఇది గెలిస్తే పార్టీకి చాలా ప్రయోజనకరం… కానీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కేడర్‌లో కనిపించని జోష్… అంతేకాదు, పట్టణ వోటరు లెక్కలు వేరుంటాయి… ఈ వోటరుకు సానుభూతి పెద్దగా పట్టదు…
2. కాంగ్రెస్ వ్యూహం: అధికార పక్షం ప్లస్ పాయింట్స్ ఏమిటంటే…
- పాత ప్యాటర్న్ బలం: అధికారంలో ఉన్నది… ఆల్రెడీ అక్కడ అభివృద్దిపై కొన్నాళ్లుగా కాన్సంట్రేట్ చేస్తోంది… బీసీ అభ్యర్థి… మజ్లిస్ పరోక్ష మద్దతు… టీడీపీ, జనసేన మద్దతు వోట్లు కూడా బీఆర్ఎస్ వోట్లనే చీలుస్తాయి… పైగా తమ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీల ప్రభావాన్ని కూడా బలంగా నమ్ముకుంటోంది కాంగ్రెస్… అలాగే తెలంగాణ అయిదు ఎన్నికల్లో నాలుగు సార్లూ అధికార పార్టీదే గెలుపు… ఈ ప్యాటర్న్ పరిశీనార్హం…
- పట్టణ ఓటర్లు: జూబ్లీహిల్స్ ఒక మెట్రోపాలిటన్ నియోజకవర్గం… ఇక్కడ ఓటర్లు భావోద్వేగాల కంటే, ‘ప్రస్తుత ప్రభుత్వంలో తమ పనులు త్వరగా అవుతాయా?’ అనే వాస్తవ కోణంలో ఆలోచిస్తారు… ఈ సమీకరణం కాంగ్రెస్‌కు అనుకూలించే అవకామే ఎక్కువ…
‘సానుభూతి ఓటుగా మారదు, అధికార పక్షానికే ప్రజలు పట్టం కడతారు’ అనే తెలంగాణ ఉపఎన్నికల ప్యాటర్న్ మరోసారి నిరూపితం అవుతుందా..? తెలంగాణ ప్రజలు తమ నాయకులకు గౌరవం ఇస్తారు, కానీ ఓటు మాత్రం ‘భావోద్వేగంతో కాదు, రాజకీయ లెక్కతో’ వేస్తారనేదే నిజం అవుతుందా..? చూడాలిక..!!
Share this Article