.
Subramanyam Dogiparthi
…. ఆలోకయే శ్రీబాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం . అద్భుతమైన శ్రీకృష్ణ లీలా తరంగం .
17 వ శతాబ్దపు నారాయణ తీర్ధులు విరచిత శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఓ తరంగం . ఇలాంటి శ్రావ్యమైన తరంగాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచన కళాతపస్వి విశ్వానాధుడికి కాక మరెవరికయినా వస్తుందా !
Ads
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… నారాయణ తీర్ధులుగా ప్రసిధ్ధులయిన తల్లావఝ్ఝుల గోవింద శాస్త్రి , విశ్వనాధ్ ఇద్దరూ మా గుంటూరు జిల్లా వారే . నారాయణ తీర్ధుల వారి జన్మస్థలం నాగార్జున యూనివర్సిటీ దగ్గర కాజ అనే గ్రామం . నేను పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో ఆనాటి వైస్ చాన్సలర్ హరగోపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరి పేరు మీద అధ్యయన కేంద్రాన్ని కూడా నెలకొల్పాం .
సాధారణంగా పౌరాణిక చిత్రాలలో కుప్పలుకుప్పలు పాటలు , పద్యాలు ఉంటాయి . ఉంటేనే చూసేవారు ఆరోజుల్లో . సాంఘిక చిత్రాలలో కధకు , సినిమా రన్నింగుకు అడ్డమొస్తాయని గొణుక్కుంటూ ఉంటారు . అలాంటిది విశ్వనాధ్ సాంఘిక సినిమాల్లో పాటలు , శ్లోకాలు , కీర్తనలు ఎన్ని ఉంటాయో ! ఒక్కటి కూడా విసిగించదు . అలాంటి సినిమాల్లో ఒకటి ఈ శృతిలయలు .
తెలవారదేమీ స్వామీ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా వ్రాసారో ! ఈ పాటకు ఆయనకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది . ఇంత కన్నా మరో గొప్ప సాహిత్య సృష్టి ఇన్ని రాశులయునికి అనే పాట . పన్నెండు రాశుల గురించి అన్నమయ్య పాట… పాట చిత్రీకరణ , రాజశేఖర్ సుమలతల నటన కూడా అద్భుతం . వ్రాసిన శాస్త్రి గారికి హేట్సాఫ్ .
నాకు నచ్చిన మరో పాట శ్రీగణనాధం భజామ్యహం పాట . పూర్ణచందర్ , శ్రీనివాస్ పాడారు . బృందావన్ గార్డెన్సులో చాలా అందంగా చిత్రీకరించారు . మరో ప్రయోగం అన్నమయ్య తందనానా భళా కీర్తనను రీమిక్స్ చేసి హోటల్లో పాడించారు . ఆ సంకరం చేయకుండా ఉండి ఉంటే బాగుండేదేమో !
ఇలా ఒక్కొక్క పాట గురించి ఒక్కో థీసిస్సే వ్రాయవచ్చు . సంగీతానికి జననీజనకులు శృతిలయలు అనే భావనతో ఇంత గొప్ప కధను తయారుచేసుకున్నారు విశ్వనాధ్ . ఒక నిస్వార్ధ సంగీత కళారాధకుడు త్యాగయ్య , అన్నమయ్య , రామదాసులకు సంగీత భారతి అనే దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకుంటాడు .
ఈ యజ్ఞంలో ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకున్నా తన కార్యసాధన కొరకు ముగ్గురు అనాధలను చేరదీసి సంగీత విద్వాంసులను చేస్తాడు . తండ్రి కార్యసాధన కొరకు డబ్బు సంపాదిస్తామని పట్నం వెళ్ళి డబ్బయితే సంపాదిస్తారు . డబ్బుతో పాటు స్వార్ధాన్ని , దుర్వ్యసనాలనీ మూటగట్టుకుంటారు .
ఈ ముగ్గురు పెంపుడు కొడుకులుగా రాజశేఖర్ , నరేష్ , మురళీకృష్ణ నటించారు . బహుశా రాజశేఖర్ నట జీవితంలో మరచిపోలేని పాత్ర ఇదేనేమో ! ఈ ముగ్గురికి భార్యలుగా సుమలత , ముచ్చెర్ల అరుణ , శ్రీకుమారిలు నటించారు . సుమలతకు హీరోయినుగా మంచి పేరు తెచ్చింది… బిడ్డల కోసం పరితపించే సాధారణ స్త్రీగా ముచ్చెర్ల అరుణ చాలా బాగా నటించింది .
మళ్ళీ మెయిన్ కధలోకి వద్దాం . సీత పాత్రలో పెద్ద కోడలు భర్త నిరాదరణతో అత్తమామలకు సేవ చేసుకుంటూ ఉండిపోతుంది . కొడుకుని సంగీత , నృత్యాలలో దిట్టను చేస్తుంది . కొడుకు సహాయంతో ముగ్గురినీ సంస్కరించి తండ్రి సంగీత భారతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తుంది .
ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు షీరో సుమలతే . ఆమె కొడుకుగా నటించిన చిచ్చరపిడుగు షణ్ముఖ శ్రీనివాస్ నటనకు జేజేలు . నృత్యాలలో కూడా గొప్పగా నటించాడు . సత్యనారాయణ నటన . ఇలాంటి మోసపోయిన తండ్రి పాత్రలు ఆయనకు కొత్త కాకపోయినా సంగీత కళాపోషకుడిగా అద్భుతంగా నటించారు . అంజలీదేవికి కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . భర్త అడుగుజాడల్లో నడిచే ఆదర్శ గృహిణిగా చక్కగా నటించింది .
ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర జయలలితది . ఎక్కడా ఎలాంటి అసభ్యతా లేకుండా ఆ నెగటివ్ , వాంప్ పాత్రను సృష్టించిన విశ్వనాధుని , అంతే గొప్పగా నటించిన మా గుంటూరు నటి జయలలితను మెచ్చుకోవలసిందే .
ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , వంకాయల , మిశ్రో , తదితరులు నటించారు . శాస్త్రి గారి సాహిత్యానికి జీవం పోసారు సంగీత దర్శకులు కె వి మహదేవన్ , గాయనీ గాయకులు బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , పూర్ణచందర్ , శ్రీనివాస్ , సుశీలమ్మ , జానకమ్మ , వాణీ జయరాం , శైలజ .
ఈ సినిమాకు చక్కటి సంభాషణలను అందించారు ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ . గత మాసంలోనే స్వర్గస్థులయ్యారు . వారికి నివాళి .
కీర్తి , కనకం , అవార్డులు , అన్నీ పుష్కలంగా వచ్చాయి ఈ సినిమాకు . హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలకు కూడా పాత్రల్ని కల్పించారు విశ్వనాధ్ . ఇంత కళా సృష్టి 18 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది . నేనయితే ఎన్ని సార్లు చూసానో ! నాకు చాలా ఇష్టమైన సినిమా .
1987 ఏప్రిల్ ఆఖర్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఎన్ని సార్లయినా చూసి తరించవచ్చు . విశ్వనాధ్ వంటి కళాతపస్వులు మళ్ళీ వస్తారా !? వస్తారని భారతీయ సాంస్కృతిక సంపదను ముందు తరాలకు చేరుస్తూ ఉంటారని ఆశిద్దాం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article