.
మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ లోపభూయిష్టమైన న్యాయవ్యవస్థకు బోలెడు ఉదాహరణలు… లేట్ న్యాయం కూడా అన్యాయమే అని చెప్పడానికి, ప్రాసిక్యూషన్ అంధత్వానికి, ప్రభుత్వం అమానవీయ వైఖరికి ఓ బలమైన ఉదాహరణ ఇది…
Ads
భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం వేదం (సుబు) (64) ఉదంతం కేసు ఏమిటంటే… 1980లో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ హత్య కేసులో ఆయనకు అన్యాయంగా శిక్ష పడింది…
తొమ్మిది నెలల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చిన సుబు వేదం, దాదాపు తన జీవితమంతా అమెరికాలోనే గడిపారు… 1983, 1988లలో రెండుసార్లు దోషిగా తేలి, జీవిత ఖైదు శిక్ష అనుభవించారు… తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో, విచారణ సందర్భంగా ఇచ్చిన రెండు ప్లీ బార్గైన్‌లను (Plea Bargains) కూడా ఆయన తిరస్కరించారు…
43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల
2025 ఆగస్టులో, సెంటర్ కౌంటీ న్యాయమూర్తి జోనాథన్ గ్రైన్, సుబు వేదంపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చారు… ప్రాసిక్యూటర్లు డిఫెన్స్ న్యాయవాదుల నుంచి కీలకమైన FBI నివేదికను అక్రమంగా దాచిపెట్టారని న్యాయమూర్తి పేర్కొన్నారు… ఈ నివేదిక, కిన్సర్ తలపై బుల్లెట్ గాయం పరిమాణాన్ని వివరిస్తూ, .25 కాలిబర్ తుపాకీని ఉపయోగించారనే ప్రాసిక్యూషన్ వాదనపై సందేహాలు కలిగించేది…
ఈ తీర్పు తర్వాత, సెంటర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ “కాలం గడిచిపోవడం” “ముఖ్య సాక్షులు లేకపోవడం” వంటి కారణాలను చూపుతూ సుబుపై ఉన్న అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. సుబు వేదం, పెన్సిల్వేనియా చరిత్రలో అత్యధిక కాలం (43 ఏళ్లు) అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా నిలిచారు…
జైలులో ఉన్న కాలంలో, సుబు వేదం తన జీవితాన్ని వృథా చేయలేదు… ఆయన అక్షరాస్యత కార్యక్రమాలు రూపొందించారు, ఖైదీలకు డిప్లొమాలు పొందడానికి సహాయం చేశారు… అంతేకాక, ఆయన మూడు డిగ్రీలతో సహా 4.0 GPAతో MBAను పూర్తి చేశారు…
స్వేచ్ఛ దొరికినా… దేశ బహిష్కరణ ముప్పు
కథ ముగియలేదు… అక్టోబర్ 3న జైలు నుంచి విడుదలైన సుబు వేదంను, స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కూడా వీలు లేకుండా, యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు…
1980వ దశకంలో సుబు టీనేజర్‌గా ఉన్నప్పుడు LSD కలిగి ఉండటం అనే ఓ పాత డ్రగ్స్ కేసు ఆధారంగా ‘లెగసీ డిపోర్టేషన్ ఆర్డర్’ను ICE అమలు చేసింది… దీర్ఘకాలంగా అమలు కాకుండా ఉన్న ఈ ఆర్డర్‌ను, ఆయన జీవిత ఖైదు నుంచి విడుదల కాగానే అమలు చేశారు…
ICE సుబు వేదంను “1980 నుండి నేర చరిత్ర కలిగిన నిందితుడు”గా అభివర్ణించింది… అయితే, సుబు న్యాయవాది అవా బెనాచ్ దీన్ని తీవ్రంగా ఖండించారు… ఆ డ్రగ్స్ నేరం “టీనేజ్‌లో చేసిన చర్య” అని, చేయని హత్యకు ఆయన 43 ఏళ్ల జీవితాన్ని కోల్పోయారని పేర్కొన్నారు… ఇన్నేళ్ల తర్వాత, “ఎటువంటి సంబంధాలు లేని దేశానికి” ఆయన్ని బహిష్కరించడం మరో భయంకరమైన అన్యాయం అవుతుందని ఆమె వాదించారు…
కుటుంబాన్ని వదిలి వెళ్లడం అంటే…
ఈ పరిణామంతో సుబు కుటుంబం షాక్‌కు గురైంది… “ఈ ఇమ్మిగ్రేషన్ సమస్య సుబు అసలు కేసులో భాగమే… ఆ తప్పుడు దోషిత్వాన్ని రద్దు చేసి, అన్ని ఆరోపణలను కొట్టివేసినందున, ఈ కేసును తిరిగి తెరిచి, ఆయన నిర్దోషిత్వాన్ని పరిగణించాలని ఇమ్మిగ్రేషన్ కోర్టును అడిగాం” అని కుటుంబ సభ్యులు తెలిపారు…
సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాట్లాడుతూ “ఆయన తొమ్మిది నెలల వయసులో భారత్ వదిలి వచ్చారు. ఆయనకు అక్కడ ఏ సంబంధాలూ లేవు. ఆయన సోదరి, మేనకోడళ్లు, మనుమరాళ్లు అందరం అమెరికన్ పౌరులమే, ఇక్కడే నివసిస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు…
సుబు న్యాయవాదుల బృందం ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ కేసును తిరిగి తెరవాలని, బహిష్కరణను ఆపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది… తప్పుడు శిక్ష కారణంగా 43 ఏళ్లు కోల్పోయిన తర్వాత, సుబు వేదంను ప్రియమైన వారికి దూరంగా, పరిచయం లేని చోటుకి పంపడం ‘అన్యాయాన్ని రెట్టింపు‘ చేయడమేనని కుటుంబం వాదిస్తోంది…
Share this Article