.
కేసీయార్ దాదాపు 1600 కోట్ల ఖర్చుతో యాదగిరిగుట్ట గుడిని పునర్నిర్మించాడు… ఆధునిక సెక్యులర్ భారతదేశంలో ఆ నిర్ణయం సాహసమే… అంతేకాదు, ఓ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, తనకే రిపోర్ట్ చేసేలా ఆదేశించి, ఇంకెవ్వరినీ వేలుపెట్టకుండా చూశాడు…
గుట్టపైని చిరువ్యాపారులను తరిమేశాడు, గుట్ట కిందే పుష్కరిణి, కల్యాణకట్ట… వీవీఐపీ విల్లాలు, కాటేజీలు ఎట్సెట్రా… శిలానిర్మాణాలు… ఇదంతా నాణేనికి ఒక కోణం… మరోవైపు…
Ads
1) స్థంభాలపై తన బొమ్మలు, తన పథకాలకు ప్రచారయావ… 2) గుట్ట మీద యాంబియెన్స్ సాకుతో భక్తుల సౌకర్యాలకు చెల్లుచీటి… 3) ఇప్పటికీ ఓచోట కురుస్తున్న నాణ్యతలోపాలు.,. 4) పేదవాడి దేవుడిని ధనిక దేవుడిగా చేశాడన్న అపప్రథ… 5) ప్రారంభోత్సవాన్ని పూర్తిగా బీఆర్ఎస్ కార్యక్రమంగా నిర్వహణ… 6) గవర్నర్ తమిళిసైకు అవమానం… 7) ఉగ్రనరసింహుడిని శాంతరూపంలోకి మార్చే కుట్ర…
…. ఇలాంటి మరకలు ఎన్ని ఉన్నా… స్థూలంగా గుడిని నభూతో అన్నట్టు నిర్మించాలనే సంకల్పం విషయంలో కేసీయార్‌ను మెచ్చొచ్చు… తను చెప్పిందే శాసనంలా ఓ పద్ధతిగా పునర్నిర్మాణం జరిగింది… ఎలా అంటే ఓ బాలాలయం కట్టేసి, విగ్రహాలకు నిత్యపూజలు, దర్శనాలకు ఆటంకాలు లేకుండా చూసి, గుడి పునర్నిర్మాణానికి ఆటంకాలు లేకుండా, శాస్త్రవిహితంగా చర్యలు తీసుకోవడం అభినందనీయం…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా గోపురాన్ని బంగారుతాపడం పూర్తిచేశారు… మరి వేములవాడ విషయంలో ఏమిటీ గందరగోళం..? ప్రణాళికరాహిత్యం..? అడ్డదిడ్డపు అడుగులు..?
నిజానికి కేసీయార్ కేవలం యాదగిరిగుట్టకు ప్రాధాన్యం ఇచ్చి… శైవక్షేత్రాలను గాలికి వదిలేశాడు… వేములవాడ, భద్రాచలంలపై మరీనూ… వేములవాడకు 400 – 500 కోట్లో ఇస్తానన్నవాడు మళ్లీ పత్తాకు లేడు… మొదట్లో ముత్యాల తలంబ్రాలు తీసుకునిపోయి మళ్లీ పత్తాకు లేడు… ఈ స్థితిలో వేములవాడ గుడి అభివృద్ధికి 150- 200 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు… అది ప్రభుత్వం ఎంచక్కా ప్రొజెక్ట్ చేసుకోదగిన ప్లస్ పాయింట్…
కానీ దిక్కుమాలిన కార్యాచరణతో రావల్సిన ఆ మంచి పేరునూ ఇప్పుడే చేజేతులా చెడగొట్టుకుంటున్నది ప్రభుత్వం… అసలు బాలాలయం నిర్మించి, అందులోకి మూర్తులను శాస్త్రవిహితంగా తరలించి, పునర్నిర్మాణం పూర్తయ్యాక అంతే మంత్రహితంగా పునఃప్రతిష్టో, ప్రాణప్రతిష్టో చేయాల్సి ఉంది… అదే అత్యుత్తమ పద్ధతి… కానీ శృంగేరీ పీఠం సలహాలు పేరిట, భీమేశ్వరాలయంలోకి మారుస్తున్నారు…
కోడె మొక్కులు భీమేశ్వరుడికి చెల్లించాలా..? ఇదెక్కడి వైపరీత్యం అని భక్తులు, స్థానిక రాజకీయ నాయకుల అభ్యంతరాలు… గడియకో ప్రకటన… ఈవో ఒకటి, కమిషనర్ మరొకటి, లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఇంకొకటి… అసలు ఎములాడకు వెళ్లాలా వద్దానే డైలమా ఇప్పుడు భక్తుల్లో… తీరా ఇప్పుడు ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి దర్శనాలకు అనుమతిస్తారట, ఒరిజినల్ మూర్తులకు యథాస్థానంలోనే నిత్యపూజలు ఉంటాయని మరో వివరణ… అసలు వేములవాడలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని దురవస్థ…
ఈ నిర్వాకం ఇలా ఉంటే… రోడ్డు విస్తరణ పేరిట దాదాపు వంద బిల్డింగులను కూల్చారు… నెలన్నర అయిపోతున్నా రోడ్డుకు నో టెండర్స్, నో వర్క్స్… ఆ షాపుల శిథిలాల నడుమ తలపట్టుకుని కూర్చుని ఆ వ్యాపారులు లబోదిబో… దేవాదాయ శాఖకు ఓ మంత్రి ఉంది… ఆమెకు వేములవాడలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, పట్టదు.., ఆమెకు పొంగులేటితో, భద్రకాళి గుడి విషయంలో వరంగల్ నాయకులతో కైలాట్కాలతోనే సరిపోతోంది… సీఎం రేవంత్ ఓ సీరియస్ యాక్షన్ ఆలోచిస్తేనే, ఇది ఓ గాడిన పడే వీలుంది…
Share this Article