.
ఎవరో ఓ తిక్క ప్రశ్న, కించపరిచే ప్రశ్న వేశారు కదా… ప్రదీప్ రంగనాథన్ హీరో మెటిరియలా అని..! ఆ ప్రశ్న వేసిన జర్నలిస్టు అసలు జర్నలిజం మెటీరియాలేనా అనే ప్రశ్నను పక్కన పెడితే…
నాగార్జున చెప్పినట్లు… రజినీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి చూడటానికి హీరో మెటీరియల్సా..? కానీ అద్భుతాలు సాధించలేదా..? అసలు హీరో మెటీరియల్ అంటే ఏమిటి..? లుక్కా..? సిక్స్ ప్యాకా..? నటన బేసిక్స్ కూడా తెలియకుండా ఏళ్ల తరబడీ వారస హీరోలు ఇండస్ట్రీని దున్నేయడం లేదా..?
Ads
వాళ్లతో పోలిస్తే ప్రదీప్ చాలా చాలా బెటర్… లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్లు కొట్టాడు… ఇంజినీరింగ్ చదివిన నిర్మాత, దర్శకుడు, నటుడు, ఎడిటర్, రచయిత… ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మళ్లీ వచ్చాడు… నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ విడుదలకు ముందే… ఓటీటీ, శాటిలైట్స్ డబ్బు అదనం… మరి వాడు హీరో మెటీరియల్ కాకపోవడం ఏమిటి..?
ఒక బావ, ఒక మరదలు… ఆమె అతన్ని ప్రేమిస్తుంది, కానీ తను వేరే వాళ్లను ప్రేమిస్తాడు… బ్రేకప్పులు… తనను మరదలు విడిచిపెట్టి దూరం వెళ్లాక ఆమెనే తను లోలోపల బాగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతుంది… వెళ్లి మామను మా ఇద్దరికీ పెళ్లి చేయాలని అడుగుతాడు… తరువాత ఏమైంది అనేదే కథ…
ప్రదీప్ రంగనాథన్ ఈ తరం నటుడు… పాత ఛాందస పోకడల్లో ఇమిడిపోయేవాడు కాదు… డ్యూడ్‌లో అతను మరోసారి తన మంచి టైమింగ్, తనదైన మ్యానరిజమ్‌లతో ఆకట్టుకుంటాడు… ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కు కూడా ఓ మంచి పాత్ర లభించింది… డ్యూడ్ చిత్రానికి మూలస్థంభాలలో ఒకడు… అతని పాత్ర రెండు విభిన్న షేడ్స్ కలిగి ఉంది…
రీసెంట్ పాపులర్ హీరోయిన్ మమిత బైజు హీరోయిన్ ఈ డ్యూడ్ సినిమాలో… కథకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో ఆకట్టుకుంది… ప్రదీప్ రంగనాథన్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది… మొదటి సగం చాలా వరకు ఆకర్షణీయంగా ఉంది సినిమా…
మొదటి అర్ధభాగం బాగా గడిచిన తర్వాత, రెండవ భాగంలో సినిమా వేరే దారిలో వెళుతుండటంతో కథనం వేగం తగ్గుతుంది… కథనం భావోద్వేగం వైపు మళ్లి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడు వినోదం పాలు తగ్గుతుంది… ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పటికీ, భావోద్వేగ ప్రభావం అంత ప్రభావవంతంగా ఉండదు…
ప్రదీప్ రంగనాథన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పదే పదే చెప్పినట్లుగా, అతని పాత్ర కొంచెం రిస్కీ… అందరికీ నచ్చకపోవచ్చు… అలాగే, డ్యూడ్ ప్రేక్షకులకు అల్లు అర్జున్ సినిమా ఆర్య2 గుర్తు చేస్తుంది…
సాయి అభ్యాంకర్ సంగీతం ఉల్లాసంగా ఉంది, నేపథ్య సంగీతం కూడా ప్రభావవంతంగా ఉంది… దర్శకుడు కీర్తిశ్వరన్ విషయానికి వస్తే, అతను తన తొలి సినిమాతోనే మంచి మెరిట్ చూపించాడు…
మొత్తం మీద, డ్యూడ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించే చూడదగ్గ ఎంటర్‌టైనర్… చివరి గంటలోని సన్నివేశాలు అందరికీ కనెక్ట్ కాకపోయినా, ప్రదీప్ రంగనాథన్ వినోదాత్మక ప్రదర్శన కారణంగా ఈ సినిమా నిలిచిపోతుంది… ఈ సినిమా విజయ పరిధి ప్రేక్షకులు రెండవ అర్ధభాగాన్ని ఎలా స్వీకరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది…
Share this Article