.
గుజరాత్ తాజా మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల దృష్టిలో ఒక పేరు పడింది… తన పేరు హర్ష్ రమేష్ భాయ్ సంఘవి… సింపుల్‌గా హర్ష్ సంఘవి…
గుజరాత్ రాజకీయాల్లో హర్ష్ సంఘవి శకం… అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రిగా రికార్డు! ఇవీ చాలా పత్రికల్లో వచ్చిన హెడింగులు… అవును, తన వయస్సు 40 ఏళ్లు… ఇప్పుడు తను గుజరాత్‌కు ఉపముఖ్యమంత్రి…
Ads
తాజా మంత్రివర్గ విస్తరణలో హర్ష్ సంఘవికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, కీలకమైన హోమ్ (గృహ) పోర్ట్‌ఫోలియో కూడా దక్కింది… హోమ్ మాత్రమే కాదు, జైళ్లు, సరిహద్దు భద్రత, ప్రొహిబిషన్ (మద్యపాన నిషేధం) & ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు,, రవాణా, న్యాయం (Law and Justice) శాఖలు కూడా…
వేరే రాష్ట్రాల్లో అయితే ఈ పోర్ట్‌ఫోలియోలను ముగ్గురు నలుగురు మంత్రులకు సర్దేవారు… అసలు ఎవరు ఈ హర్ష్ సంఘవి..?
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందాడు సంఘవి… ఆయన పాలనాదక్షతను మెచ్చుకుంటూ రాజకీయ వర్గాల్లో ఆయన్ను ఇప్పుడు “గుజరాత్ అమిత్ షా”గా పిలుస్తున్నారు…
రాకెట్ వేగంతో రాజకీయ జీవితం
అతి పిన్న వయస్కుడైన MLA…: సూరత్‌కు చెందిన హర్ష్ సంఘవి, 2012లో తన 27వ ఏటనే గుజరాత్ శాసనసభలోకి తొలిసారి ప్రవేశించాడు… మజురా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ ఏడాది అసెంబ్లీలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా నిలిచాడు…
రికార్డు విజయం..: తొలి ఎన్నికల్లోనే ఆయన రికార్డు స్థాయిలో విజయం సాధించి, ఆ సంవత్సరంలో రాష్ట్రంలో నాల్గవ అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తిగా నిలిచాడు…
బీజేపీ కోట…: వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో బీజేపీకి బలమైన కోటను నిర్మిస్తూ, 2017, 2022 ఎన్నికలలో కూడా సంఘవి విజయవంతంగా తన స్థానాన్ని నిలుపుకున్నాడు… ముఖ్యంగా 2022లో, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పివిఎస్ శర్మపై 1,16,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు…
యువ మంత్రి…: గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడం ద్వారా కేంద్ర నాయకత్వం దృష్టిలో పడిన సంఘవి, 36 సంవత్సరాల వయస్సులోనే గుజరాత్ యొక్క అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు…
సూరత్‌లో పాటిదార్ కోటా ఆందోళన వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో, ఆ ప్రాంతంలో పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించాలనే వ్యూహంలో భాగంగా ప్రధాని మోడీ, హెచ్‌ఎం షా, అప్పటి రాష్ట్ర చీఫ్ సి.ఆర్. పాటిల్ ఆయనకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు…
తాజాగా మంత్రివర్గ విస్తరణలో ఆయన హోమ్ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకోవడం, గుజరాత్ రాజకీయాల్లో వేగంగా పెరుగుతున్న ఆయన ప్రాధాన్యతను, భవిష్యత్తును స్పష్టం చేస్తోంది…
Share this Article