.
దీపావళి స్పెషల్ వీకెండ్ అని ఊదరగొట్టి బిగ్‌బాస్ సండే షోను మూడు గంటలు నడిపించారు గానీ… ఏ ఒక్క దశలో ఆసక్తిని కలిగించలేదు… నిస్సారంగా… పేలవంగా… నాసిరకంగా… కాస్త సాత్విక్ పేరడీ పాటలు బాగున్నాయి గానీ, హైపర్ ఆది పంచులు తోకపటాకుల్లా కూడా పేలలేదు…
ఒక్కటి మాత్రం కాసేపు ఆసక్తిగా చూసేలా చేసింది… అది జటాధర సినిమా ప్రమోషన్… ఎప్పటి నుంచో ఈ సినిమా వార్తలు వస్తున్నా సరే, బిగ్‌బాస్ వీకెండ్ షోలో ఈ ప్రమోషన్ ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం కొన్ని విశేషాలు చకచకా గుర్తొచ్చాయి…
Ads
ఏటో ట్రెయిలరో, టీజరో ఏదో వేసి చూపించారు… శిల్పా శిరోద్కర్ వచ్చింది స్టేజ్ మీదకు… అప్పుడెప్పుడో 33 ఏళ్ల క్రితం మోహన్‌బాబు సినిమా బ్రహ్మలో కనిపించింది… మళ్లీ అదే సంవత్సరంలో నాగార్జునతో ఖుదాగవా అనే హిందీ సినిమాలో కూడా చేసింది… అంతే…
టాలీవుడ్‌తో బంధం ఇంకేమీ లేదా..? ఉంది… మహేశ్ బాబు మరదలు ఆమె, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ చెల్లెలు… కానీ తెలుగులో మళ్లీ నటించలేదు… ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది, ఈమధ్య కొన్ని వార్తల్లో ఉంటోంది… హిందీ బిగ్‌బాస్‌లో చేసింది… యాభయ్యేళ్లుపైబడ్డాక బుల్లి తెరపై,, వెండితెరపై కనిపించడానికి తాపత్రయపడుతోంది… ఈ జటాధర సినిమాలో పాత్ర కూడా అందుకే…
ఈ సినిమాలో మరో పాత్రధారి సోనాక్షి సిన్హా… 15 ఏళ్ల తరువాత మళ్లీ డెబ్యూ అంటోంది ఆమె… నిజమే, తెలుగులో డెబ్యూ… శతృఘ్న సిన్హా బిడ్డ… 15 ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చినా తెలుగు ఇండస్ట్రీ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు… పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లేవు, లావైంది… ఇప్పుడు జటాధరలో ఓ కీలక పాత్ర చేస్తోంది…
సరే, ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు గురించి చెప్పక్కర్లేదుగా… కాకపోతే కొన్నాళ్లుగా సక్సెస్ లేదు… ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్ పాత్ర అట… ఏదో తాంత్రిక పాత్ర… లుక్కు కూడా మారిపోయింది… ఈ సినిమా జానరే సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్… తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా (సెమీ పాన్- ఇండియా) విడుదల కానుంది…
ఇందులో సోనాక్షి ధన పిశాచి (ధనాన్ని కాపాడే క్రూరమైన ఆత్మ) అనే శక్తివంతమైన ప్రతినాయక (విలన్) పాత్రలో నటిస్తుండగా… శిల్పా శిరోద్కర్ ఏదో యోగిని లేదా ఏదో తాంత్రిక పాత్ర చేస్తున్నట్టుంది…
పురాతన కథలు, నమ్మకాల ఆధారంగా ‘ధన పిశాచి’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది… దాచిపెట్టిన ధనాన్ని మంత్రాలతో బంధించే ‘పిశాచ బంధనం’ అనే చీకటి ఆచారాన్ని, దాని చుట్టూ అల్లుకున్న అత్యాశ, ప్రతీకార కథాంశాన్ని ఇది చూపిస్తుంది… సైన్స్, అంధ విశ్వాసాల మధ్య జరిగే పోరాటంగా కథనం ఉంటుంది…
స్టోరీ లైన్ వోెకే… ప్రజెంటేషన్ ఏమిటో తెరపై చూద్దాం గానీ… ఎప్పుడో తెర మరిచిన ఇద్దరు హిందీ తారల్ని ఈ సినిమాలోకి కీలక పాత్రల్లోకి తీసుకురావడం ఆసక్తికరంగానే ఉంది..!!
Share this Article