Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…

October 20, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. నట మత్తేభాలు , నట సింహాలు గర్జించిన , ఘీంకరించిన భారీ చిత్రం , ఓ అద్భుత కళాఖండం , ఓ దృశ్య కావ్యం ఈ 16వ శతాబ్దపు చారిత్రక చిత్రం విశ్వనాథ నాయకుడు .

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ బేనరుపై తాండ్ర పాపారాయుడు వంటి చారిత్రక సినిమాను తీయాలని ఎంతో పట్టుదలగా దాసరి చేత ఈ మహా సినిమాను తలపెట్టాడు నిర్మాత వడ్డె రమేష్ . ఆరోజుల్లోనే సుమారు రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను .

Ads

విజయనగర , చోళ , పాండ్య రాజ్యాలతో ముడిపడి ఉన్న కధ ఈ విశ్వనాథ నాయకుడి కధ . 16వ శతాబ్దంలో దక్షిణాపధంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఎక్కువ భాగం పాలించబడుతున్న రోజులు . ఆయన సేనాధిపతి నాగమ నాయకుడు . ఆయన కొడుకు విశ్వనాథ నాయకుడు ఉప సేనాని . పాండ్య రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చోళ రాజయిన వీరశేఖరుడు ప్రయత్నిస్తూ ఉంటాడు .

మధుర రాజయిన చంద్రశేఖర పాండ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు రక్షణను కోరుతాడు . చోళ రాజు మీద యుధ్ధం చేసి మధురని విడిపించాక నాగమ నాయకుడు తనకు తానే స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు . అతన్ని ఓడించడానికి , రాజద్రోహాన్ని అణచివేయటానికి ఆయన కొడుకు అయిన విశ్వనాథ నాయకుడినే పంపుతారు రాయల వారు .

యుధ్ధంలో చోళ రాజుని , నాగమ నాయకుడి పెంపుడు కొడుకయిన తిమ్మప్పని చంపి నాగమ నాయకుడిని బంధించి తెస్తాడు విశ్వనాథ నాయకుడు . ఆత్మాభిమానం కల నాగమ నాయకుడు ఆత్మాహుతి చేసుకుంటాడు . రాయల వారు విశ్వనాథ నాయకుడిని పాండ్య , చోళ రాజ్యాలకు అధినేతగా పట్టాభిషేకం చేయడంతో శుభం కార్డు పడుతుంది .

1529 నుండే మధుర నాయక వంశం పాలన కిందకు వస్తుంది . ఆ నాయక వంశ పాలన విశ్వనాథ నాయకుడితోనే ప్రారంభం అవుతుంది . ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్రలు . శ్రీకృష్ణ దేవరాయలు , నాగమ నాయకుడు , విశ్వనాథ నాయకుడు .

రాయల వారిగా కృష్ణంరాజు , విశ్వనాథ నాయకుడిగా కృష్ణ ఫైనలైజ్ అయ్యాక నాగమ నాయకుడి కోసం వెతకటం మొదలు పెట్టారట . అప్పుడే పేస్ మేకర్ పెట్టించుకున్న శివాజీ గణేషన్ని తటపటాయిస్తూ అడిగితే ఆయన వెంటనే చేస్తానని ముందుకొచ్చారట .

సినిమాలో ఈ ముగ్గురి సీన్లు , ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అదిరిపోతుంది . ముగ్గురూ ముగ్గురేగా విజృంభిస్తారు . శివాజీ నటన చూస్తుంటే వీర పాండ్య కట్టబ్రహ్మన సినిమా గుర్తుకొస్తుంది . కృష్ణ నటన చూస్తుంటే అల్లూరి సీతారామరాజు , సింహాసనం సినిమాలు గుర్తుకొస్తాయి . కృష్ణంరాజు నటన చూస్తుంటే తాండ్ర పాపారాయుడు సినిమా గుర్తుకొస్తుంది .

ఈ సినిమాలో డైలాగులను ముగ్గురు వ్రాసారు . కొండవీటి వెంకట కవి , యామినీ సరస్వతి , దాసరి నారాయణరావు . ముగ్గురు మహారధులు వ్రాస్తే ఎలా ఉంటాయో ఊహించవచ్చు .

ఈ చారిత్రక కధను ఇద్దరు రచయితలు తయారు చేసారు . కొండముది శ్రీరామమూర్తి , యామినీ సరస్వతి . టైటిల్సులో కొండముది శ్రీరామమూర్తి అని వేసారు . నాకు తెలిసి పూర్తి పేరు కొండముది శ్రీరామచంద్రమూర్తి . Subject to correction . యామినీ సరస్వతి అంటే స్త్రీ కాదు . అది కలం పేరు . అసలు పేరు దొర్నిపాటి వెంకట సుబ్బారావు .

ఈ సినిమా ఓ కళాఖండంగా మిగిలి పోవటానికి కారణం సంగీత దర్శకులు జె వి రాఘవులు , కనువిందైన నృత్యాలను కంపోజ్ చేసిన శ్రీను , అందమైన కాస్ట్యూమ్సులను అందించిన పి వెంకటరావు , పాటల్ని వ్రాసిన ఆరుద్ర , సి నారాయణరెడ్డి , పాడిన సుశీలమ్మ , వాణీ జయరాం , రాజ్ సీతారాం , మాధవపెద్ది రమేష్ , రామకృష్ణ . వీరందరికీ చప్పట్లు కొట్టాల్సిందే .

కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన వెంకటరావుకు నంది అవార్డు కూడా వచ్చింది . జె వి రాఘవులు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెలెస్టియల్గా , వినసొంపుగా ఉంటుంది .

ఈ సినిమాలో రాజ నర్తకిగా , విశ్వనాథ నాయకుడి ప్రేయసిగా నటించిన జయప్రద అందం , నృత్యాలు అద్భుతం . రాయల వారి సభలో నృత్యించిన ఇది నాట్య నీరాజనం చిత్రీకరణకు దాసరికి హేట్సాఫ్ . ఈ పాటకు సుశీలమ్మకు నంది అవార్డు కూడా వచ్చింది . అలాగే కృష్ణతో ఉన్న అన్ని డ్యూయెట్లలో జయప్రద నృత్యం సినిమాను దృశ్య కావ్యంగా మలిచింది .

మరవనంటోంది మనసు , ఒక నర్తకి నర్తించు వేళ , వన మయూరి అంటూ సాగే మూడు డ్యూయెట్లు చాలా అందంగా ఉంటాయి . రాయల వారు , రాణులయిన తిరుమల దేవి , చిన్నమ దేవిలతో 1+2 పాట కూడా చాలా బాగుంటుంది . ఇటు నారీ అటు నారీ ఇద్దరి నడుమ ముద్దులు చేసే మురారా అంటూ సాగే పాట చాలా రొమాంటిగ్గా చిత్రీకరించారు దాసరి .

చారిత్రక చిత్రం కావటం వలన చాలా పాత్రలు ఉంటాయి . తారాగణం భారీగానే ఉంటుంది . శివాజీ గణేషన్ భార్యగా కె ఆర్ విజయ , రాయల వారి రాణులుగా ప్రభ , సుమలత , అప్పాజీగా ప్రభాకరరెడ్డి , అష్టదిగ్గజాలుగా జె వి సోమయాజులు , పద్మనాభం , రావి కొండలరావు తదితరులు , చోళ రాజుగా రంగనాధ్ , పాండ్య రాజుగా త్యాగరాజు , నాగమ నాయకుడు పెంపుడు కొడుకుగా శరత్ బాబు , నాట్య గురువుగా రామకృష్ణ , జయప్రద తల్లిగా రాజసులోచన , అమ్మమ్మగా నిర్మలమ్మ , మరెంతో మంది నటించారు .

కృష్ణకు ఇది 250 వ సినిమా . 1987 ఆగస్టు 14న రిలీజయిన ఈ దృశ్యకావ్యం కమర్షియల్గా ఎంత సక్సెస్ అయిందో నాకు ఐడియా లేదు . దాసరి , కృష్ణ , కృష్ణంరాజు , జయప్రద కెరీర్లలో మాత్రం ఓ మైలు రాయే , ఓ సుందర విడిది . శివాజీ గణేషన్ అంత మహా నటుడికి ఇలాంటి మైలు రాళ్ళు చాలానే ఉన్నాయి .

ఈ దృశ్యకావ్యం ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . Undoubtedly an unmissable musical visual splendour . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చార్మినార్ భాగ్యలక్ష్మి… బండి సంజయ్ పెత్తనం ఉంటే కథ వేరే ఉండేది…
  • సూపర్ కిడ్..! కేబీసీలో జవాబు చెప్పే వేగం చూస్తే… నిజంగా ఓ విభ్రమ..!!
  • మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…
  • దీపావళి… రెండు ఊళ్ల పేరూ అదే… ఓ ఇంట్రస్టింగు కథ…
  • ట్రంప్‌ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!
  • తెర విడిచిన, తెర మరిచిన ఆ ఇద్దరితో… ఓ కొత్త జటాధరుడు..!!
  • అత్తిల్లు, పుట్టిల్లు కాంగ్రెస్..! కమలదళంలో చేరిన ఆరేళ్లకే మంత్రి..!!
  • దీపావళి అమ్మకాలకు దెబ్బ… రెండ్రోజులు బంద్ వాయిదా వేస్తే బాగుండేది…
  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!
  • సిరివెన్నెల ఆ పాట పంక్తుల గురించి ఎందుకంత బాధపడ్డాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions