Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘గంధర్వగళం..! జీవితంలో మొదటిసారి ఈ గొంతుకతోనే ప్రేమలో పడ్డాను’’

October 20, 2025 by M S R

.
Shanthi Ishaan… “సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియే… బస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”

90s kids కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.

జీవితంలో మొదటిసారి ఎవరి గొంతుకతో అయినా ప్రేమలో పడ్డాను అంటే అది కుమార్ సాను గొంతుకే! నా స్కూల్ డేస్ లో రేడియోలో కుమార్ సాను పాటలు మొట్టమొదటిసారి వింటున్నప్పుడు ఇదీ అని చెప్పలేని అనుభూతి. కొన్నాళ్ళకు తెలియకుండానే అది నా ఫావరెట్ వాయిస్ గా మారింది. అంతకుముందు చాలా పాటలే విన్నా, చాలా గొంతుకలే విన్నా ఇది నా ఫావరెట్ అని ఎప్పుడూ అనిపించలేదు.

Ads

నదీమ్- శ్రవణ్ జోడీతో కలిసి కుమార్ సాను పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది.

కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. ‘సాజన్’ పాటలంటే ప్రాణం పెట్టే నాకు ఈ పాటంటే మరీ ప్రేమ. అది కుమార్ సాను వల్లే అని వేరే చెప్పాలా?

1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్ తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది.

గొంతులో ఒక రకమైన జీరతో, nasal voiceలో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్- శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు.

నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే అయినా నా ఫేవరెట్ కాంబో మాత్రం జతిన్- లలిత్ తోనే! DDLJ కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా?

‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్ హై’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’ (కభీ హా కభీ నా) ‘ఏక్ దిన్ ఆప్’ (యస్ బాస్) లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటి పాటలు. ‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) నా ఆల్ టైం ఫావరెట్స్ లో ఒకటి. ఈ కాంబోలో ఇంత కంటే ఇష్టమైన మరోటి ఉంది. అదే ‘ఖూబ్ సూరత్’లోని ‘మేరా ఎక్ సప్నా హై’! కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన ఈ పాట వింటే కలల్లో తేలిపోవడం ఖాయం.

అను మల్లిక్ కాంబినేషన్ లో ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్ని హిట్ నంబర్స్ పాడినా నాకు బాగా నచ్చేది మాత్రం ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ పాట. లిరిక్స్, కంపోజిషన్ పరంగా ఇది ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన పాటల్లోకి నాకిది చాలా ఇష్టమైన పాట.

1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు.

‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి.

1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా elegantగా అనిపిస్తుంది.

  • ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.

కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో ఆయన పాడిన పాటలు వింటే తేనెలో ముంచి తేల్చినట్లుగా ఫీలయ్యేది మా జనరేషన్! ‘బాజీగర్ ఓ బాజీగర్’, ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్ కి కొన్ని ఉదాహరణలు.

కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు.

1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ- ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.

  • మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’ లాంటి హిట్ సాంగ్స్ పాడారు. 2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు.

అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 67 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్ లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.

కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు.

ఈమధ్య కాలంలో కేకే, అరిజీత్ సింగ్, మోహిత్ చౌహాన్, పపోన్ లాంటి సింగర్స్ పాటలు నాకు బాగా నచ్చుతున్నాయి. కానీ childhood love ఎన్నటికీ మర్చిపోలేం కదా! అందుకే ఇలా అప్పుడప్పుడు తలుచుకోవడం! (ఇవాళ కుమార్ సాను పుట్టినరోజు)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘గంధర్వగళం..! జీవితంలో మొదటిసారి ఈ గొంతుకతోనే ప్రేమలో పడ్డాను’’
  • చార్మినార్ భాగ్యలక్ష్మి…! ఫాఫం బీఆర్ఎస్ పాట్లు, అగచాట్లు, ఇక్కట్లు..!!
  • సూపర్ కిడ్..! కేబీసీలో జవాబు చెప్పే వేగం చూస్తే… నిజంగా ఓ విభ్రమ..!!
  • మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…
  • దీపావళి… రెండు ఊళ్ల పేరూ అదే… ఓ ఇంట్రస్టింగు కథ…
  • ట్రంప్‌ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!
  • తెర విడిచిన, తెర మరిచిన ఆ ఇద్దరితో… ఓ కొత్త జటాధరుడు..!!
  • అత్తిల్లు, పుట్టిల్లు కాంగ్రెస్..! కమలదళంలో చేరిన ఆరేళ్లకే మంత్రి..!!
  • దీపావళి అమ్మకాలకు దెబ్బ… రెండ్రోజులు బంద్ వాయిదా వేస్తే బాగుండేది…
  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions