.
ప్చ్… బంగారం దూసుకుపోతూనే ఉంది… సగటు మనిషికి అందకుండా… రాబోయే కాలంలో ఇమిటేషన్, గిల్ట్, వన్ గ్రామ్ ఎట్సెట్రా ఆభరణాలు లేదా వెండితో చేసే కోటింగ్ ఆర్నమెంట్సో దిక్కయ్యేట్టున్నాయి… అఫ్‌కోర్స్, యువత వాటిని పాపులర్ చేస్తే… భారతదేశ బంగారం మార్కెట్‌ను, కాదు, ప్రపంచ బంగారం మార్కెట్‌నే ఛేంజ్ చేసినవాళ్లవుతారు…
ఎస్, ఒక దేశ ఆర్థికి సత్తా ఏమిటో దాని దగ్గర ఉండే బంగారం నిల్వలు చెబుతాయి… ఆ నిల్వల విలువే ఆ దేశ కరెన్సీ విలువను శాసిస్తుంది… సో, బంగారం బంగారమే… కానీ దాని ఉత్పత్తి..?
Ads
కేజీఎఫ్ సినిమా చూసినంత వీజీ కాదు… మైళ్ల కొద్దీ లోతుల్లోకి తవ్వుతూ… టన్నుల కొద్దీ ఎత్తిపోస్తూ… ప్రాసెస్ చేస్తే… అరకొరగా దొరుకుతూ ఉంటుంది బంగారం… ఛ, ఏ రాగిలాగో, ఏ అల్యూమినియంలాగో సులభ ఉత్పత్తి ప్రక్రియతో బంగారం దొరికితే నాసామిరంగా… ప్రతి స్త్రీ ఒళ్లూ బంగారు తాపడమే కదా… పురుషులు కూడా దట్టంగా ఇంటి మీద దిగేస్తారు కూడా…
అంతెందుకు…? నిన్న ఎక్కడో చదివాం కదా, స్వీట్లకు బంగారుపూత పూసి అమ్ముతున్నారని… తింటున్నారని… అంత సులభంగా బంగారం దొరకాలే గానీ ఆ స్వీట్లు ఎల్లెడలా దొరకుతాయి ఇక, ఇడ్లీ, దోసె రేట్లకే… కానీ మరో చిక్కుంది… అంత లభ్యత ఉంటే, ఇప్పటి ఈ ధర ఉండదు బంగారానికి…
అసలు చెట్లకు కాయలు కాసినట్టు బంగారం గనుక కాస్తే… ఆహా, ఆ ఊహే ఎంత బంగారమో కదా… కానీ నిజం… అదే ఈ కథనం…
ఏంరా… నోట్లు చెట్లకు కాస్తున్నయ్ అనుకుంటున్నవా అనే డైలాగ్ చాలాసార్లు వింటాం కదా… కానీ చెట్లకు కరెన్సీ కాగితాలు కాదు గానీ బంగారు రేణువులు, మీరు చదివింది నిజమే… బంగారు రేణువులు కాస్తున్నాయి ఓచోట…
అది నార్వే… స్ప్రూస్ చెట్ల ఆకులు సూదుల్లా (కొష్షెగా) పదునుగా ఉంటాయి… కొన్ని చెట్ల ఆకుల్లో ఓరకమైన సూక్ష్మజీవుల చర్యల ద్వారా సూక్ష్మమైన బంగారు కణాలు ఉత్పత్తి అవుతున్నట్టు జియోలాజి కల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యా లయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు…
అంతా సహజ ప్రక్రియే… ఓ కిరణ జన్య సంయోగ క్రియలాగా..! కొన్నిరకాల స్ప్రూస్ చెట్లలో విభిన్న రకాల సూక్ష్మజీవులు రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి… పీ3ఓబీ-42, క్యుటిబ్యాక్టీరియమ్, కొరినెబ్యాక్టీరియం వంటి బ్యాక్టీ రియా ఈ చెట్లలో పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది… సూదిగా ఉండే ఆకులు చిన్న ప్రయోగశాలలుగా పని చేస్తాయి…
మట్టి నుంచి ద్రవ రూపంలోని బంగారం చెట్ల వేళ్ల ద్వారా ప్రయాణించి, ఆకుల సూదుల్లోకి చేరుతుంది. సూక్ష్మ జీవులు ఈ ఆకుల సూదుల్లో బయోఫిలిం వంటి పొరను సృష్టిస్తాయి… ఈ ద్రవ రూప బంగారం ఈ ఆకుల సూదుల్లోకి చేరి, ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుంది… ఇదీ ప్రక్రియ వివరణ…
కానీ అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణం లేదు… నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, స్థానిక పరిస్థితులు, అంటే నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని స్పూస్ చెట్లకు మాత్రమే బంగారం పండుతుంది…
ఏయే నేలల్లో… ఏయే వాతావరణ పరిస్థితుల్లో… ఏయే బ్యాక్టీరియాతో… ఏయే అనుకూలతల్లో ఈ బంగారం ఉత్పత్తి జరుగుతున్నదో మరింత వివరంగా పరిశోధనలు సాగితే… ఇంకేముంది..? జగమే బంగారం కదా… కానీ ఒక్క స్ప్రూస్ చెట్లకే గాకుండా, ఇతరత్రా అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే చెట్లలోనూ ఈ ఉత్పత్తి సాధించగలిగితేనే టన్నుల కొద్దీ బంగారం సాధ్యం…
సర్, సర్, చిన్న డౌట్… అవే స్ప్రూస్ పరిసరాల్లో ప్లాటినం కూడా పండుతుందేమో కాస్త కనుక్కొండి ప్లీజ్… ఈ గనులు, ఈ తవ్వకాలు ఎట్సెట్రా లేకుండా… గోల్డ్ ఫామింగ్ స్టార్ట్ చేసేస్తాం..!!
Share this Article