.
ఓసారి బీహార్ దాకా వెళ్లొద్దాం పదండి… ఆర్జేడీ కూటమికీ, బీజేపీ కూటమికీ నడుమ టఫ్ ఫైట్ అంటున్నారు కదా… దేశంలోకెల్లా అపర్చునిస్ట్ సీఎం నితిశ్ వర్సెస్ స్కూల్ డ్రాపౌట్ తేజస్వి యాదవ్ నడుమ పోరాటంలో విజేత ఎవరు..?
ఇక్కడ ఆర్జేడీ కూటమి గెలిస్తే బీజేపీకి సెట్ బ్యాక్… దాని ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుంది… బీజేపీ గెలిస్తే మటుకు ఇక బీజేపీకి కొన్నేళ్ల వరకూ దేశంలో ఢోకా లేనట్టే…
Ads
ముందుగా ప్రశాంత్ కిషోర్ పార్టీ సంగతి… తను బీహారీ కేఏపాల్… మొత్తం 243 స్థానాల్లో పోటీ అన్నాడు, ఎవరితో పొత్తు లేదన్నాడు… తీరా నామినేషన్లు వేశాక ముగ్గురు అభ్యర్థులు ఛ, మేం ఈ పోటీలోనే ఉండబోం అంటూ విత్ డ్రా చేసుకున్నారు… ఆ స్థానాలు… దానాపూర్ (Danapur), బ్రహ్మంపూర్ (Brahampur), గోపాల్‌గంజ్ (Gopalganj)…
బీజేపీ బెదిరింపులే కారణమని ఓ పిచ్చి సాకు చెప్పాడు… మరో నియోజకవర్గంలో (వాల్మీకినగర్), జనసురాజ్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు కూడా రద్దయ్యాయి… పోలింగ్ నాటికి గట్టిగా నిలబడే వాళ్లెందరో తెలియదు…
మరోవైపు అధికారంలోకి వచ్చినట్టే అనే ధీమాలో ఉన్న ఆర్జేడీ కూటమిలో బోలెడు లుకలుకలు… కూటమి పేరు మహాఘట్‌బంధన్… ఇండి కూటమి కాదు, అదిప్పుడు లేనట్టే లెక్క… ఈ ఘట్‌బంధన్ కూటమిలో ప్రధాన పార్టీలైన రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ మధ్యే కాకుండా, చిన్న భాగస్వామ్య పక్షాలతో కూడా సీట్ల వివాదాలు ఏర్పడ్డాయి…
సీట్ల పంపకాల్లో అన్యాయం జరిగిందని ఆరోపించిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సొంతంగా కొన్ని సీట్లలో పోటీచేయాలని అనుకుంది, చివరకు ఏమనుకుందో ఏమో గానీ బీహార్ బరి నుంచే తప్పుకుంది…
గిరిజనులు అధికంగా ఉన్న ఏరియాల్లో ఆర్జేడీ కూటమి వోెట్లకు దెబ్బ ఈ పరిణామం… సీట్ల పంపకం సరిగ్గా లేక… RJD, కాంగ్రెస్ – ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాయి… వీటిని ‘స్నేహపూర్వక పోరాటాలు’ (Friendly Fights) అని కూడా అంటున్నా, ఇది కూటమి వోట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది… నర్కటియాగంజ్, కహల్గావ్, సికింద్రా వంటి సుమారు 8 నుండి 12 స్థానాల్లో RJD, కాంగ్రెస్, CPI వంటి మిత్రపక్షాలు నేరుగా పోటీ పడుతున్నాయి…
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) 142… భారత జాతీయ కాంగ్రెస్ (INC) 62… కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (CPI(ML)L) 20… వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) 14… కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 9… కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM) 4… ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 3 సీట్లల్లో పోటీ… మొత్తం (Total) 254… (మిత్రపక్షాల మధ్య పోటీల వలన మొత్తం సంఖ్య 243 కంటే ఎక్కువగా ఉంది…)
మహాఘట్ బంధన్ అంతర్గత విభేదాల (లుకలుకలు)తో పోలిస్తే… ఎన్డీయే (NDA – జాతీయ ప్రజాస్వామ్య కూటమి) కూటమి ఐక్యంగా, మెరుగ్గా సిద్ధమైనట్లు కనిపిస్తోంది…
భారతీయ జనతా పార్టీ (BJP) 101…. జనతాదళ్ (యునైటెడ్) (JD(U)) 101…. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)) 29 …. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) 6…. హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) (సెక్యులర్) 6 …. మొత్తం (Total) 243…
మరో కూటమి కూడా ఉంది పోటీలో… ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మొదటి అభ్యర్థుల జాబితా ప్రకారం… 25 మంది అభ్యర్థులు… AIMIM పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాంషీరామ్) (ASP-KR) అప్నీ జనతా పార్టీ (AJP) తో కలిసి గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ (GDA) పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది…
ఓసారి 35 సీట్లు అంటారు, మరోసారి 64 సీట్లు అంటారు, ఏ పార్టీ ఎన్ని సీట్లో ఆ కూటమికే తెలియదు… AIMIM ప్రధానంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో (కిషన్‌గంజ్, పూర్ణియా, అరేరియా, కటిహార్ జిల్లాలు) దృష్టి సారించింది… 2020 ఎన్నికల్లో ఈ పార్టీ 19 సీట్లలో పోటీ చేసి 5 స్థానాలను గెలుచుకుంది…
ఒకవేళ బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ సీట్లు గెలిచి, అది కూడా మెజారిటీకి దగ్గరగా లేదా దానిని దాటితే, బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది… ఏమో, ఎప్పటిలాగే గెలిచిన సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా నితిశ్‌కే పట్టం కడతారో… ఎందుకంటే..? మళ్లీ ఆర్జేడీతో జతకట్టినా కడతాడు… ఏమో, కేంద్ర కేబినెట్‌లోకి తనను తీసుకుని, సీఎంగా ప్రస్తుతం ఉపముఖ్యమంత్రులుగా ఉన్న సామ్రాట్ చౌధరి లేదా విజయ్ కుమార్ సిన్హా వంటి సీనియర్ బీజేపీ నాయకుల్లో ఒకరు ముఖ్యమంత్రిని చేస్తారేమో…
ఆర్జేడీ నుంచి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవే… మరొకరి గురించీ చెప్పుకోవాలి… లాలూ మరో కొడుకు తేజప్రతాప్… “బాధ్యతారహిత ప్రవర్తన” “కుటుంబ విలువల”కు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆరు సంవత్సరాల పాటు RJD పార్టీ నుండి బహిష్కరించారు తనను ఆమధ్య…
RJD నుండి బహిష్కరించబడిన తర్వాత, ఆయన జనశక్తి జనతా దళ్ (Janshakti Janata Dal – JJD) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు… తను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హసన్‌పూర్ స్థానాన్ని వదిలిపెట్టి, తన కొత్త పార్టీ తరపున మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశాడు… తను గెలిస్తే గొప్పే..!!
Share this Article