.
చివరకు రేవంత్ రెడ్డి కళ్లురిమి, స్వయంగా కొరడా పట్టుకుంటే తప్ప… ఆ అవినీతి రవాణా చెక్ పోస్టుల నుంచి వాహనదారులకు విముక్తి లభించలేదు… అదేమిటో అర్థం కావాలంటే వివరాల్లోకి వెళ్లాలి…
అందరికీ తెలుసు, రవాణా చెక్ పోస్టుల్లోని అవినీతి… పెద్ద ఎత్తున డబ్బులిచ్చి మరీ ఆ చెక్‌పోస్టుల్లో డ్యూటీలు వేయించుకుంటారు.,. తెలంగాణ మాత్రమే కాదు, ఈ రోగం దేశం మొత్తమ్మీద ఉన్నదే… పేరుకు తనిఖీలు, పన్ను వసూళ్లు ఎట్సెట్రా చెబుతారు గానీ… అసలు బోర్డర్ చెక్ పోస్టుల ఫాయిదా ఏమిటనేది పెద్ద భ్రమపదార్థం…
Ads
కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే..? దాదాపు రెండేళ్ల క్రితమే ఓ విధానం, దానికి తగినట్టు మార్గదర్శకాలతో అన్ని రాష్ట్రాలకు పంపించింది… ఈ చెక్ పోస్టులను ఎత్తిపారేయాలని..! అన్ని రాష్ట్రాలూ విధిగా పాటించాలని ఏమీ లేదు… కానీ ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి…
ఈ అవినీతి పోస్టుల యవ్వారం వాళ్లకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు..? పైగా ప్రధాన బాధితులు కదా… దాదాపు 15 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు… జీఎస్టీ వచ్చింది, ఆన్‌లైన్ చెల్లింపులకు పోర్టళ్లు పెట్టాయి… కానీ తెలంగాణలో మాత్రం అమలు చేయలేదు… ఎంచక్కా సాగిపోతోంది కదా అని ఉన్నతాధికారులు దాటేస్తూ వస్తున్నారు…
రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంది… చెక్ పోస్టులను ఎత్తివేయాలని, వాహనదారులను అవినీతి నుంచి రక్షించాలని..! ఓ జీవో కూడా ఇచ్చారు… కానీ అందులోనే రకరకాల క్లాజులు పెట్టుకుని, ముందుగా ప్రజల్లో అవగాహన ప్రచారం జరిపాకే చెక్ పోస్టుల ఎత్తివేత జరగాలని మెలికలు పెట్టారు…
అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తున్న విధానం, ఆల్రెడీ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం, ఆమేరకు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ… ఐనా చెక్ పోస్టులు యధావిధిగా నడిపించారు ఉన్నతాధికారులు… సీఎం దృష్టికి తీసుకొచ్చారు కొందరు… కొన్ని ఏసీబీ కేసులూ పడ్డాయి… ఇక్కడే రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా సీఎంకు పాలన మీద, బ్యూరోక్రాట్ల మీద పట్టు లేదని భ్రమపడ్డారు…
సీఎం రాత్రికల్లా చెక్ పోస్టులు ఎత్తేయాలని గడువు పెట్టాడు… బారికేడ్లు, బోర్డులు, టెంట్లు అన్నీ పీకేయాలని, మరుసటిరోజుకు చెక్ పోస్టులు కనిపించకూడదని ఉరిమాడు… అదుగో అప్పుడు కదిలింది యంత్రాంగం… ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు…
వాట్ నెక్స్ట్..? ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ ఏర్పాటు చేస్తారు… అంటే ఏమీ లేదు… మొబైల్ చెక్ పోస్టులు..! మళ్లీ ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు, యవ్వారాలు… చూడాలిక..!!
Share this Article