.
కేసీయార్ కాలం చెల్లిన టెక్నాలజీని తెలంగాణ నెత్తిన రుద్దితే… రేవంత్ రెడ్డి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాడు… ఇది విద్యుత్తు రంగంలో తెలంగాణ ప్రభుత్వపు సరైన పెద్ద అడుగు… ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది…
ఇక్కడ ఓ వివరణ… గుంపు మేస్త్రీ అంటే ఎవరి పనిని వారితోనే చేయించుకుంటూ, ఓవరాల్‌గా తనకు కావల్సిన ఫలితం వచ్చేలా కోఆర్డినేట్ చేసుకోవడం… సీఎం చేయాల్సింది అదే… అన్నీ నాకే తెలుసంటూ, అన్నింట్లో వేలు పెట్టి పనినే చెడగొట్టడం కాదు…
Ads
- ఉదాహరణకు కాళేశ్వరం డిజైన్లు, ఇంజనీరింగ్ పనుల్ని తనకు ఏమీ తెలియకుండా, తెలిసినట్టుగా కేసీయార్ తెలంగాణ మీద రుద్దడం… విద్యుత్తురంగానికి వద్దాం ఓసారి… ప్రపంచమంతా వదిలించుకుంటున్న సబ్ క్రిటికల్ టెక్నాలజీని కేసీయార్ తెలంగాణ మీద రుద్దాడు భద్రాద్రి థర్మల్ ప్లాంటు పేరిట…
ఇప్పుడు కాళేశ్వరం బరాజులు, పంపు హౌజులు పనికిరాకుండా పోతే… సబ్ క్రిటికల్ ప్లాంట్లను రిజర్వ్ షట్‌డౌన్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది… అదీ నిర్వాకం… కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధోరణి తెలంగాణకు ఉపయుక్తమైన ఆధునిక టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది… నిన్నటి కేబినెట్‌లో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు నిర్ణయం అదే…
మంత్రివర్గ నిర్ణయాల్లో దీన్ని ఓ పాసింగ్ లైన్‌గా చాలామంది చూస్తున్నారు గానీ, నిజానికి ఇది విశేషమైన ముందడుగు… చాలామందికి అసలు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ అంటేనే తెలియదు… అదేమిటి..? దాని ఉపయోగం, అవసరం ఏమిటీ అంటే..?
‘‘విద్యుత్తు అనేది ఉత్పత్తి కాగానే వాడుకోవాల్సిన సరుకు… నిల్వ చేసుకోలేం’’ పవర్ సెక్టార్‌లో ఇది ఒకప్పటి మాట… కానీ కాలం మారింది, టెక్నాలజీ మారింది… విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని, స్టోర్ చేసుకుని, అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం నేటి మాట… ఎలాగంటే..?
పవర్ జనరేషన్ కాగానే భారీ నిల్వ సామర్థ్యం ఉన్న బ్యాటరీల్లో స్టోర్ చేసుకోవడం… ఇదే BESS … సరళంగా చెప్పాలంటే… మన ఇళ్లపై బిగించుకుంటున్న సోలార్ యూనిట్లు తెలుసు కదా, అది ఎండ ఉన్నప్పుడు విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది, దాన్ని వాడుకుంటూనే, కొంత బ్యాటరీల్లో స్టోర్ చేస్తాం, ఎండ లేనప్పుడు, రాత్రిపూట ఆ బ్యాటరీలోని విద్యుత్తు వాడుకుంటాం కదా… బీఈఎస్ఎస్ అదే… భారీ స్థాయిలో…
ఇంతకుముందు థర్మల్, హైడల్, గ్యాస్, బయోమాస్ వంటి విద్యుత్తు ఎక్కువ… కానీ సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి… కాలుష్యం లేదు, క్లీన్ పవర్, గ్రీన్ పవర్… ఐతే గాలి ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడే ఉత్పత్తి… మరి అవి లేనప్పుడు..? ప్రాజెక్టుల్లో నీళ్లు లేనప్పుడు..?
- రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఒక్కచోట స్టోర్ చేస్తే… 1) అవసరం ఉన్నప్పుడు వాడుకోగలం… 2) గ్రిడ్ కుప్పకూలకుండా గ్రిడ్ ఫ్రీక్వెన్సీని మెయింటెయిన్ చేయగలం… 3) పీకవర్స్‌లో గ్రిడ్ డిమాండ్ తట్టుకోగలం… 4) విద్యుత్ కోతలు లేదా బ్లాకౌట్ల సమయాల్లో బ్యాకప్ శక్తిని అందించగలం… ఒక్కమాటలో చెప్పాలంటే… నిరంతర విద్యుత్తుకు మార్గం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం…
ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ మరో ప్రధాన ఉపయోగం ఏమిటంటే..? కాలుష్యకారకమైన థర్మల్ పవర్ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తుంది… అంటే, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దోహదపడుతుంది…
డెవలప్డ్ కంట్రీస్ వేగంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వైపు అడుగులు వేస్తున్నాయి… కాలిఫోర్నియాలోని మోస్ ల్యాండింగ్ ఎనర్జీ స్టోరేజ్ (Moss Landing Energy Storage) దాదాపు 750 MW ప్లాంటు ప్రపంచంలోనే చాలా పెద్దది… ఆస్ట్రేలియాలో వల్కన్ పవర్ (Vulcain Power) 460 MW, టెస్లా బిగ్ బ్యాటరీ (Hornsdale Power Reserve) 150 MW కూడా పెద్దవే…
తెలంగాణ జెన్‌కో (TSGENCO) శంకర్‌పల్లి వద్ద 500 MW సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది కొన్నాళ్లుగా… ఇది దేశంలోనే అతి పెద్ద సింగిల్-సైట్ ప్లాంట్లలో ఒకటిగా మారే అవకాశం ఉంది… కేంద్రం కూడా కొంతమేరకు వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇస్తుంది…
రిలయన్స్ NU సన్‌టెక్ ఆసియాలోనే (చైనా తర్వాత) అతి పెద్ద సింగిల్- సైట్ బ్యాటరీ స్టోరేజీగా 465 MW సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనుంది…
- ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరింత పెద్ద స్టోరేజీ ప్లాంటు ఏర్పాటుకు పూనుకుంటోంది… వరల్డ్ బెస్ట్… బిగ్గెస్ట్… అదీ విశేషం… ఐతే పీపీపీ పద్ధతా లేదా జెన్‌కో తరఫునా తెలియాల్సి ఉంది… గత జులైలో కేంద్రం వోకే చెప్పింది, ఇప్పుడు కేబినెట్ దానికి ఆమోదముద్ర వేసింది…
రామగుండం- బి (RTS-B) అనే కాలం చెల్లిన 52 ఏళ్ల కాలుష్యకారక ప్లాంట్ కూల్చేసి, అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు కట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన… నిర్ణయం..!!
..
ఈ సర్కారుకు ముచ్చట నుంచి ఒక సూచన… PHS… అంటే pumped energy storage, hybrid power మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణకు బహుళ ఉపయోగం…
Share this Article