Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దావత్ వితౌట్ దారు..! ఆల్కహాల్‌పై మోజు తగ్గుతున్న యువతరం..!!

October 24, 2025 by M S R

.

మన మందు పార్టీలు మొదట వీకెండ్. తరువాత సెలవు రోజులు. ఆపై పండగరోజులు. శుభకార్యాలు. ప్రత్యేక దినాలు… చివరికి ప్రతిరోజూ అయ్యింది.

తాగడం మంచిదా? చెడ్డదా? అన్న చర్చ ఏనాడో తెరవెనక్కు వెళ్ళిపోయింది. “మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ వార్నింగ్ టెక్స్ట్ ఉంటే చాలు. ఎంత మద్యమైనా తాగచ్చు.

Ads

ఇప్పటి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్… అన్నిట్లో “మద్యం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ హెచ్చరిక సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చిన్నా పెద్ద, రాజు పేద, స్త్రీపురుష భేదం లేకుండా ఇప్పుడు సమాజం తాగడంలో సమానత్వాన్ని సాధించింది. ఇదొక మహా మద్యోదయం. ఇదొక మత్తోదయం.

ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు, నాలుగు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.

మహా నగరాల్లో పగలూ రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.

బాధలు మరచిపోవడానికి తాగేవారు;
బాధ పెట్టడానికి తాగేవారు;
బాధపడడానికి తాగేవారు;
ఆనందం పట్టలేక తాగేవారు;
ఆనందం కోసం తాగేవారు;

మర్యాద కోసం తాగేవారు;
మర్యాదగా తాగేవారు;
అమర్యాదగా తాగేవారు;
ఏమీ తోచక తాగేవారు;
వ్యసనంగా తాగేవారు;

ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు… ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు. వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే ఎక్కువగా మిక్కిలి మక్కువగా తాగుతూ ఉంటారు.

సమాజం ఎప్పుడూ ముందుకు పురోగమిస్తూనే ఉంటుంది. ప్రగతిశీలత దాని స్వభావం. దావత్ మందు పార్టీల్లో గ్లాసుల గలగలలు, మాంసం ముక్కల ఘుమఘుమలు, పీల్చే పొగల ధుమధుమలు ఓల్డ్ ఫ్యాషన్. కొంచెం కొకైన్, కొంచెం గంజాయి, కొంచెం హుక్కా, కొంచెం స్టఫ్ దట్టించి… ఒళ్ళు మరచి గుండెలు చిల్లులు పడే, చెవుల్లో రక్తం కారే డిజె చప్పుళ్లకు అర్ధనగ్న, పూర్ణ నగ్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ లు చేయకపోతే ఆధునిక రేవ్ పార్టీల రేవళ్ళము కాకుండాపోతాం కదా!

ఈ సిచుయేషన్ కు పేకముక్కల జూదం ఓల్డ్ ఫ్యాషన్. ఆధునిక క్యాసినో మిషన్లు మార్కెట్లో ఉన్నాయి కదా? ఇంత అత్యాధునిక రేవాతి రేవ్ పార్టీల్లో ఊరవతల కుండల్లో పులియబెట్టిన కృత్రిమ డైజోఫార్మ్ నాటు సారా తాగుతారా ఎవరైనా? విదేశీ మద్యం చల్లగా గొంతులో దిగుతూ ఉంటే వెచ్చగా బాధలన్నీ కరిగిపోవా?

నవనాగరిక సమాజంలో ఏం మనుషులండీ…మీరు? మా ఆనందం మాది. ప్రశాంతంగా రేవ్ పార్టీలు కూడా చేసుకోనివ్వరా? ఒకపక్క ప్రభుత్వమే మద్యం పాలసీలు తెచ్చి…టార్గెట్లు పెట్టి…అమ్మించి…తాగించి…జోకొట్టి మత్తులో ముంచుతూ… మరో పక్క తెల్లపొడి స్టఫ్ పీల్చకూడదు. కొకైన్ కొనకూడదు. అమ్మాయిలతో నగ్ననృత్యాలు చేయకూడదు. సొంత ఫార్మ్ హౌసుల్లో క్యాసినో జూదాలు ఆడకూడదు- అనడం ద్వంద్వప్రమాణం కాదా!

నానా విష రసాయనాలతో పండించిన ఆహారాన్నే నేరుగా నోట్లోకి వేసుకుని తిని… బతికి బట్టకట్టగలుగుతున్నాం. ఆఫ్టరాల్ ఈ కొకైన్ తెల్లపొడులు ఏమి చేస్తాయి?

ఇప్పుడన్ని శుభకార్యాల్లో లిక్కర్ కాక్ టైల్ బార్ కౌంటర్లు పెట్టడం ఒక మర్యాదగా, విలువగా, సంప్రదాయంగా, ఆచారంగా మారింది. ఆబ్కారీ శాఖకు అప్లై చేసుకుంటే అధికారికంగా ఫీజు కట్టించుకుని అనుమతులు కూడా ఇస్తోంది. రేప్పొద్దున అన్ని శుభకార్యాల్లో రేవ్ పార్టీల ఏర్పాట్లు తప్పనిసరి అవుతాయి. ఆచారాలే కాలగతిలో పాటించి తీరాల్సిన చట్టాలవుతాయి.

ఈమధ్య దసరా రోజుల్లో ఒక్క హైదరాబాద్ మహానగరం ఎన్ని వందల కోట్ల మద్యం తాగిందో వివరిస్తూ చుక్కల లెక్కలతో వార్తలొచ్చాయి. అదొక ఘనకార్యమైనట్లు ఈ వ్యాసం గుర్తించడం లేదు కాబట్టి ఆ వివరాలు ఇక్కడ అనవసరం. ఎందుకో తెలియదు కానీ సినిమాలు తాగడాన్ని విపరీతంగా చూపుతున్నాయి.

ప్రభుత్వాలు కూడా మద్యం అమ్మకాలమీదే బతుకుతూ ఉంటాయి కాబట్టి… ప్రభుత్వ విధానంగా మద్యాన్ని నిరుత్సాహపరచడం అన్నది కలలో కూడా జరగదు. అయితే ఈమధ్య యువతలో మార్పు వస్తోందని ఒక వార్త. ప్రస్తుతం మన చర్చ ఆ శుభపరిణామం మీద.

ఏదైనా అతి చేస్తే గతి చెడుతుంది. సోషల్ డ్రింకింగ్ అని నలుగురు కలిస్తే ముందు మందు బాటిళ్ళ గలగలలు ఉండాల్సిందే అన్నట్లు తయారైన తూలిన సందర్భాలనుండి యువత బయటపడుతోంది.

దేశంలో ప్రత్యేకించి మెట్రో నగరాల్లో యువత సోషల్ డ్రింకింగ్ లో ఆల్కహాల్ లేని, ఆల్కహాల్ అతి తక్కువగా ఉన్న పానీయాలవైపు మళ్ళుతోందని ఒక సర్వే చెబుతోంది. యువతతోపాటు 40 ఏళ్ళలోపు పెద్దవారిలో కూడా ఈ మార్పు కనిపిస్తున్నట్లు సర్వే గుర్తించింది. మంచిదే.

కొస మెరుపు:- జనంలో వస్తున్న మార్పును వ్యాపారంగా మలుచుకోవడంలో కంపెనీలు ముందుంటాయి. ఆల్కహాల్ లేని పానీయాల మార్కెట్ విలువ భారత్ లో ఏటా 70 వేల కోట్లు ఉంటుందట. ఆల్కహాల్ మార్కెట్ విలువ ఒక రాష్ట్రంలోనే ఇరవై, ఇరవై అయిదు వేల కోట్లు ఉంటుంది.

అంటే దేశం మొత్తం మీద ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మద్యం మీద ఖర్చవుతోంది. నాన్- ఆల్కహాల్ పానీయాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తరువాత సంగతి. ఆల్కహాల్ తో పోలిస్తే మంచిదే కాబట్టి ఈ మార్పును స్వాగతించాలి. ఇది చుక్కలు పొడిచిన కారు చీకట్లలో కాంతి రేఖ లాంటిది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Knowledge is not devine… జ్ఞానం ఎప్పుడూ అత్యంత ప్రమాదకరం…
  • హాస్యం అశ్లీలం చొక్కా వేసుకుని థియేటర్లకు వచ్చిన రోజులవి..!!
  • ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!
  • హఠాత్తుగా ఈ ఏసీ బస్సులు ఎందుకిలా కాలిపోతున్నయ్…? ఏం చేయాలి..?!
  • దావత్ వితౌట్ దారు..! ఆల్కహాల్‌పై మోజు తగ్గుతున్న యువతరం..!!
  • BESS… The Game-Changer for Continuous Power…
  • కోహ్లీ డక్, రోహిత్ 73… ఎక్కడొచ్చింది తేడా..? ఎవరిదీ తప్పు..?
  • అందం, వినోదం, యోగా, వ్యాపారం ప్లస్ మోసం- శిల్పాశెట్టికి పలు ముఖాలు…
  • BESS… పవర్ సెక్టార్‌లో రేవంత్‌ భేషైన ముందడుగు… అదేమిటంటే..?!
  • “నా ఎడిటర్ అభిప్రాయంతో విభేదించే స్వేచ్చ నాకు లేదా?”

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions