………. By…….. Taadi Prakash…………. కోవిడ్ కాలంలో మరో మామూలు రోజు
Chronicle of a death fore told
————————————————-
దిగులుగా తెల్లవారుతోంది.
మరో శుక్రవారం. మే 21. హైదరాబాద్.
సోమాజిగూడలోని మా వీధిలో, ఆక్సిజన్ రేటు తెలియని అమాయక చెట్లు… గాలికి పచ్చగా ఊగుతున్నాయి.
చల్లని చావుకబురు లాగా, సన్నని వాన తుంపర
*
“చూశావా! శైలజని కేబినెట్లోకి తీసుకోవడం లేదంటగా” అన్నది మా ఆవిడ నళిని.
ఆ వార్తే చదువుతున్నాను నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో.
“ఆడవాళ్ళ విషయంలో మార్క్సిస్టులు, విప్లవకారులు, ఆర్ఎస్ఎస్ వాళ్లు అని ఉండరు. మగాళ్ళు వుంటారు. విజయన్ అయినా, ఒకవేళ నేనయినా, అంత శ్రద్ధతో సేవ చేసిన శైలజని క్షమించడం జరగదు” అన్నాను.
“నాశనం అయిపోతారు” అని శపించింది.
*
“సరేగాని, ఇడ్లీలోకి అల్లం పచ్చడేనా?” అడిగాను.
పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం రెడీ చేయడం నా పని.
“ఎందుకూ! మంచి కొబ్బరికాయ ఉందిగా. కొబ్బరి పచ్చడి చేస్తా. పిల్లలూ తింటారు” అనింది.
ఆంధ్రజ్యోతి, హిందూ పూర్తి చేసేసరికి మంచి ఫిల్టర్ కాఫీ పిలుస్తోంది.
సిప్ చేస్తూ బాల్కనీ లోంచి ఎత్తైన చెట్ల తల మీంచి నీలాకాశాన్ని చూస్తుంటే కేవీ గుర్తొచ్చాడు.
*
కేవీ అంటే ఒక అసాధారణమైన ఆర్టిస్ట్. గొప్ప యానిమేటర్. 45 ఏళ్ల వయసు కూడా ఉండదు. వారం క్రితమే బెంగళూరు సత్య సాయి హాస్పిటల్ లో చనిపోయాడు, కోవిడ్ తో. ముట్టుకుంటే కందిపోయేలా కోమలంగా, అందంగా గులాబి రంగులో ఉంటాడు. 2009లో ‘సాక్షి’ ఛానల్ యానిమేషన్ డిపార్ట్మెంట్ లోకి మా అన్నయ్య మోహన్, కేవీని తీసుకున్నాడు. అతని జీతం లక్ష రూపాయలు. ఈ కుర్రాడికి అంత జీతమా? అన్నాను. అరేయ్! వాడు చాలా పెద్ద ఆర్టిస్ట్ రా అన్నాడు మోహన్.
కేవీ మా ఏలూరు, పద్మశాలీల కుర్రాడు. పేరు కటకం వెంకటేశ్వరరావు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఒకప్పుడు పాపులర్ హీరో.
భార్య, మూడు నాలుగేళ్ళ పాపతో మోహన్ ఆఫీసుకు వస్తుండేవాడు. జర్కిన్ వేసుకుని, చెదిరిన జుట్టుతో, మొహమాటపు నవ్వుతో good boy లాగా ఉండేవాడు. భార్య పేరు శుభ. ఇంటర్ చదివిందనుకుంటాను. పాప బాగా మాటకారి. అల్లరిది. మోహన్ చుట్టూ ఉండే అందరికీ ఆ బిడ్డ ఎంటర్టైన్మెంట్. బెంగుళూరు టెక్నికలర్ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ కేవీ. నెల జీతం రెండు లక్షలు. బొమ్మలు, సంగీతం, పాటలు… ఇవే జీవితం కేవీకి. ఆ రౌడీపిల్ల అంటే పంచప్రాణాలు. హీరో లాంటి భర్తని, ముద్దొచ్చే కూతుర్ని చూసుకుని తెగ మురిసిపోయేది శుభ. కేవీ చనిపోయేనాటికి ఆ పాప వయసు 14 ఏళ్లు. తల్లి, కూతురు ఏడ్చిఏడ్చి తడారిన కళ్ళతో హైదరాబాద్ తిరిగి వచ్చేసి ఉంటారు, లేదా
ఏలూరు అయినా వెళ్లి ఉంటారు.
వాళ్లకి మణులు వద్దు, మాన్యాలు వద్దు.
ఒక్క కేవీ మాత్రమే కావాలి.
కేవీ తిరిగి రావాలి.
వాళ్ళిద్దర్నీ ఈ భూమ్మీద ఏ శక్తీ ఓదార్చలేదు.
*
“ఇడ్లీ పెట్టాను టేబుల్ మీద. నెయ్యి వేసుకో”.
కొబ్బరి పచ్చడితో వేడిగా ఎంత బాగుందో!
“మరో అర కప్పు కాఫీ ఇవ్వరాదూ..!”
*
2010లో మా ఆఫీసులో రాత్రి పార్టీ అయిపోతుండగా “కేవీ.. ఒక పాట పాడు” అన్నాడు మోహన్.
వీడూ పాడతాడా? అనుకున్నాను.
నెమ్మదిగా, నాజూగ్గా, ఒక ఫెమిలియర్ ఆలాపన. మొఘలే ఆజం పాట కదా. ఇతనికెలా తెలుసు?
“ప్రేమ్ జోగన్ బన్…”
అది హృదయాన్ని వెలిగించే సోహ్నీ రాగం.
అది ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గానం.
ఆ రాగంలోని మాధుర్యపు విచారం, ప్రేమ పారవశ్యంలోని సౌందర్యం, గాఢమైన అనుభూతి కేవీ గొంతులో పలుకుతున్న తీరుకి ఒక shock లాంటి సంభ్రమంతో విన్నాం.
అదే పాటని అలా ఎన్నిసార్లు పాడేడో కేవీ. వుండివుంటే భారతదేశంలోని అగ్రశ్రేణి ఆర్టిస్ట్ గా గొప్ప గౌరవం పొందేవాడు. ఆర్టిస్టులు శంకర్, అన్వర్, బ్రహ్మం, ఆంజనేయులు… ఎవరినైనా అడగండి ఇదే మాట చెబుతారు.
*
కేవీ జుట్టు పీకుతూ, నవ్వుతూ నాన్నతో ఆడుకుంటున్న ఆ అయిదారేళ్ల పసిపిల్లే నాకు పదేపదే గుర్తొస్తోంది. కేవీ తప్ప మరో ప్రపంచం తెలియని ఆ శుభ… ఇక ఎన్ని వందల రాత్రులు కన్నీళ్లతో నిద్రపోతుందో…
*
అదిగో… ఫోన్ మోగుతోంది.
“నేను అన్వర్ ని సార్. ఆర్టిస్ట్ గోపీ గారి పరిస్థితి బాగోలేదు. రమణాచారి గారు ‘గాంధీ’లో జాయిన్ చేశారట. అల్లం నారాయణ గాని, గోరటి వెంకన్నతో గాని మాట్లాడరాదూ…”
*
ఏంటి నాన్నా, లంచ్ ఏమిటి? సాంబారూ, వంకాయ వేపుడూ, గోంగూర పచ్చడి అంటదేంటి? అమ్మ.
చిన్న కొడుకు విదుర ఫిర్యాదు. టూమచ్ కదరా, అంతకంటే ఏం కావాలి?
ఫ్రైడే నాన్నా. మంచి మటన్ ఉంటుంది.
టెండర్ కట్స్… ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను”
“చేసుకో”
*
నేనిప్పుడే మాట్లాడతాను అన్నాడు గోరటి వెంకన్న.
అల్లం నారాయణకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. మళ్లీ ఇంతలోనే అన్వర్ ఫోన్.
“లేదు సార్, గోపీ గారు మనకిక లేరు. వాళ్ళ అబ్బాయి చైతన్య చెప్పాడు. గోపీ రెండు నెలల క్రితం మా ఇంటికొచ్చాడు. టీ పెట్టిచ్చాను. చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన” అన్వర్ గొంతులో
కన్నీళ్లు ధ్వని స్తున్నాయి.
తల్లావఝుల శివాజీ గారు ఆందోళనతో ఫోన్ చేశారు- నువ్వు ఎవరితోనన్నా మాట్లాడరాదూ.. అంటూ. గోపీ ఇందాకే చనిపోయారు అని చెప్పాను. “ఏంటబ్బా, ఎన్ని వినాలి ఇలాంటివి?” అంటున్నారేగానీ శివాజీ గొంతు పూడుకుపోతోంది.
*** *** ***
మహబూబ్ నగర్ బీడు భూముల్నించి వచ్చి తెలంగాణ కళారంగాన్ని సస్యశ్యామలం చేసిన వాడు గోపీ. క్రోక్విల్ తో, బ్రష్ తో, ఇండియన్ ఇంకులో సప్తస్వరాలూ పలికించగలడు. ఎన్ని వందల, వేల ఇలస్టేషన్లు వేశాడో. ‘ఉదయం’ దినపత్రికకి, ఎంతో అందమైన, గుండ్రటి అక్షరాల మాస్ట్ హెడ్ రాసింది లగుసాని గోపాల్ గౌడ్ గారే! మోహన్ కి సన్నిహిత మిత్రుడు. ఎంతో మర్యాదగా, ఈజీగా, సరదాగా ఉండేవాడు. చూస్తే వాట్సాప్ లో గోపీ గురించి ఒక పేరా రాసి పంపాడు అన్వర్. ఫోటో కూడా… ఫేస్బుక్ లో పెట్టాను.
*** *** ***
“మటన్ కర్రీ భలే ఉంది నాన్నా. సాంబారు మామూలే దుమ్ముదుమ్ము” అని పెద్దవాడు అనూర అంటుండగా ఫోన్ మోగుతోంది మళ్లీ.
జర్నలిస్టు, కవి దేశిరాజు :
ఆర్టిస్ట్ గోపీ గారు అంటే సదాశివరావు గారు చనిపోయింది ఆయన చేతుల్లోనేగా! అని అన్నాడు. “అవును” అన్నాను. ఆ మాట ఫేస్ బుక్ లో రాలేకపోయారా అన్నాడు. నిజమే రాయాల్సింది కదా అనిపించింది.
కథా రచయితగా ప్రసిద్ధుడైన మాజీ పోలీసు అధికారి సదాశివరావు గారికి ఆర్టిస్ట్ గోపి బాగా తెలుసు. 2020 డిసెంబర్ ఏడో తేదీన మార్నింగ్ వాక్ కి వెళ్దాం రా.. అన్నారు సదాశివరావు గోపీతో. మీ ఇల్లు తెలియదు అన్నాడు గోపీ. చల్లా నర్సింగ్ హోమ్ దగ్గరికొచ్చి ఫోన్ చేయమన్నాడు. అలాగే చేశాడు.
79 ఏళ్ల సదాశివరావు వచ్చి, గోపీతో కలిసి కొద్దిసేపు నడిచి, అలసటగా ఉందని, రోడ్డు పక్కనే కూర్చునీ,గోపీ చేతుల్లో వొరిగిపోయాడు. పెద్దాయన అకస్మాత్తుగా చనిపోవడాన్ని గోపీ తట్టుకోలేకపోయాడు. మూడు నాలుగు రోజుల తర్వాత ఒక సభలో కలిసిన గోపీ, ఆ ట్రాజెడీ గురించి వివరంగా నాకు చెప్పాడు.
నకిరేకల్ లో ఉండే రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశాను. కృష్ణమూర్తి ఆర్టిస్ట్ అని చాలా మందికి తెలియదు. గోపీ మృతి వార్త విని
80 ఏళ్ల కృష్ణమూర్తి కదిలిపోయారు.
“చాలా గొప్ప ఆర్టిస్టు వాడు” అన్నారు.
*** *** ***
…… (Artist Gopi. Animator K.V.Singer Srinivas. Poet, Singer Deepak)
మంచి మాంసం, సాంబారు, పెరుగన్నంతో లంచ్ ముగించి, మీనాక్షి పాన్ ఉంటే ఎంత బావుణ్ణు .. అనుకుంటుండగా సీనియర్ జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్య ఫోన్ చేశారు. భారతదేశంలో కులాల మీద గొప్ప స్టడీ వున్నవాడు నాంచారయ్య. “గోపీ, గౌడ్ అని తెలుసా మీకు? ‘సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్ కూడా గౌడే. కేరళకు చెందిన పెద్ద కార్టూనిస్టు, రచయిత ఒ.వి. విజయన్ కూడా. ఈడిగ, అదే కల్లుగీత కులం వాడేనని తెలుసా?” అని అడిగాడు.
హైదరాబాద్ వెస్ట్ మారేడు పల్లిలోనే విజయన్ ఉండేవాడు. మోహన్, నేను రెండు మూడుసార్లు విజయన్ని కలిసి మాట్లాడాం అని చెప్పాను. విజయన్ రచన ‘సాగా ఆఫ్ ధర్మపురి’ ప్రపంచ ఖ్యాతి పొందింది. ఆయన గురించి ‘అద్భుతమైన చండాలం’ అని మోహన్ ఒక వ్యాసం రాశాడు.
రెడ్ హిల్స్ లో ఉండే సీనియర్ రిపోర్టర్ యడవల్లి శ్రీనివాసరెడ్డికి ఊరికే ఫోన్ చేశాను. “అయ్యా మన మిత్రుడు, జర్నలిస్టు, ఎన్టీవీ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి చనిపోయాడు, కోవిడ్ తో, ఇవ్వాళ పొద్దున్నే” అని చెప్పాడు. ఇక చాలు ఈ రోజుకి అనుకుని, బ్లాక్ టీలో నిమ్మకాయ పిండుకుని, ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే…
కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఎంతో వేదనతో పెట్టిన పోస్ట్… మంచి సింగర్ ‘జై’ శ్రీనివాస్, చిన్నవయసులోనే కోవిడ్ తో కన్నుమూశాడని. 41 ఏళ్ల ఆ పాటగాడి పేరు నేరేడుకొమ్మ శ్రీనివాస్. మందమర్రి ప్రాంతం వాడు.
*** *** ***
అరుదుగా పలకరించే చందు సుబ్బారావు సాయంత్రం ఫోన్ చేసి “అదృష్టదీపక్ గురించి ఏమన్నా రాయరాదా. మన చిరకాల మిత్రుడు కదా” అన్నారు. ఈ కోవిడ్ చావులు… ఏమని రాయడం అని మౌనంలో కూరుకుపోతుంటే ఏదో ఫోన్… “ప్రకాష్ గారా. మీరు fbలో రాస్తున్నవి చదువుతున్నానండీ. నాకు కొన్ని బాగా నచ్చాయి. నాది హైదరాబాద్. ఐటీలో చేస్తుంటాను. నా పేరు దేవి”.. అని చెబుతుండగా, ఆమెకు ఫోన్ వచ్చినట్టుంది. “సారీ అండీ. మీరు లైన్ లోనే ఉండండి, ఒక్క నిమిషం” అనింది. దేవి కి ఫోన్ చేసిన మరో ఆవిడ “చాలా దారుణం కదా. చిన్న వయసు కూడాను” అంటోంది. పర్సనల్ కాల్ కదాని నేను ఫోన్ కట్ చేశాను. 5 నిమిషాల్లో ఆ దేవి ఫోన్ చేశారు. “సారీ మా పక్కింట్లోనే భార్య, భర్త. ఇద్దరూ డాక్టర్లు. ఇందాక ఆవిడ చనిపోయింది కోవిడ్ తో. 28 ఏళ్లే. సారీ, నేను మాట్లాడలేకపోతున్నా. మళ్లీ చేస్తాను” అన్నారామె.
71 సంవత్సరాల అదృష్టదీపక్, 69 సంవత్సరాల ఆర్టిస్ట్ గోపి, 45 ఏళ్ల కేవీ ఇకలేరు కదాని దిగులు చీకటిలో బెంగటిల్లుతున్నప్పుడు… నాకు, ఎవరో తెలీకపోవచ్చు. అయినా, 28ఏళ్ల స్త్రీ, పైగా డాక్టర్ చనిపోవడం ఎంత విషాదం! నమ్ముకున్న కుటుంబం ఎంత కకావికలైపోయి ఉంటుంది.
*** *** ***
“ఇదిగో ఈ పుచ్చకాయ జ్యూస్ తాగు. తేనె కలపమంటావా?” నళిని అడుగుతోంది. మొన్నాదివారమే సోమాజిగూడ యశోద హాస్పిటల్ పక్కన రత్నదీప్ లో అవీయివీ కొని బయటకి వస్తే రోడ్డుమీద ఆటో పెట్టి తాజా చేపలు అమ్ముతున్నాడు. చేప కొని, తిని కొన్ని నెలలైంది. గోదావరి, సముద్రం కలిసే నరసాపురం నుంచి వచ్చిన fish mad నళినీని ఆశ్చర్యపరుద్దాం అని చేప కొంటున్నా. నాటకీయంగా నళిని ఫోన్ చేసింది. చేప గురించి చెప్పకూడదు అనుకుంటూనే ఫోన్ తీస్తే, “అయ్యో అదృష్టదీపక్ చనిపోయాడు. టీవీలో చూపిస్తున్నారు” అనింది.
ఆరోజు మే 16. ఆదివారం ఉదయం 9 అయింది. ఎన్ని జ్ఞాపకాలో…
1974లో దీపక్ ‘ప్రాణం’ కవితా సంపుటికి విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసులో మోహన్ కవర్ పేజీ వేసినప్పటి నుంచి దీపక్ తెలుసు. కవి, రచయితగానే గుర్తింపు. సన్నిహిత మిత్రులకు మాత్రం దీపక్ అసలేంటో తెలుసు. బాగా అల్లరివాడు. మిమిక్రీ స్పెషలిస్ట్. జోకులు, వెటకారాలూ, నవ్వులూ, దీపక్ అంటే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ కాకుండా అచ్చూ కేవీ లాగే బంగారం లాంటి గాయకుడు. దీపక్ ది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. హిస్టరీ లెక్చరర్. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలిని ఉత్తేజపరిచిన నాయకుడు. అసలు పేరు అదృష్టదీప రామకృష్ణారెడ్డి.
బంగారు భూమిసూక్త మలాపించుతూ పద
అంగారగంగ లాగ తరంగించుతూ పద…
అంటూ రాంభట్ల కృష్ణమూర్తి పాటని, దీపక్ శ్రావ్యంగా పాడుతుంటే అనేకసార్లు విన్న అదృష్టవంతుణ్ణి నేను.
చింతేల నిగ్రహించు బలం లేకపోయినా
గొంతెత్తి మానిషాదమాలపించుతూ పద!
ఈ పల్లవి అన్నాక, ఓ హో..హో.. అని ఆలాపన ఉంటుంది. ఒక తన్మయత్వంతో పాడేవాడు.
కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించువారికీ
చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద!
అని దీపక్ అంటున్నప్పుడు
మాకు కళ్ళలో నీళ్ళు తిరిగేవి.
ఇంకా..
గలగలా గంగమ్మ కదిలీపోతుంటే
మిలమిలా నీ మేను మెరిసీపోతుంటే
రెప్పావాల్చక నేను, నిన్నే సూత్తంటే
వేరే సొర్గము యింక ఎక్కాడున్నాదే
ఎక్కడున్నాదే, గలగలా…
అని జానపదాలు పాడుతూ వూగించేవాడు. దీపక్ చాలా అందమైన మనిషి. నిండైన విగ్రహం. వో..వో.. తెగ నవ్వేవాడు. భలే నవ్వది haunting… enchanting. అతని చుట్టూ ఒక తేజో వలయం వుందనిపించేది. 1980ల్లో నాకు ఉత్తరాలు రాసేవాడు. ప్రకాషో… అంటూ చివర ‘దీపికాసో’ అని సంతకం పెట్టేవాడు.అతని చేతిరాత మర్చిపోలేం. అక్షరాలు శిల్పాల్లా ఉంటాయి. కాకినాడ శ్రీశ్రీ సప్తతి సభలో “20వ శతాబ్దాన్ని మడిచి జేబులో పెట్టుకున్న మహాకవి శ్రీశ్రీ” అన్నది ఈ అదృష్టదీపక్కే!
దీపక్ జ్ఞాపకాల్లోనే, ఆ పాటల పువ్వుల పడవల్లో తేలుతున్నపుడే…
తియ్యని బంగినపల్లి మామిడి ముక్కలప్లేట్లు యిచ్చి బావున్నాయి నాన్నా.. అన్నాడు విదుర.
*
ఈసారి కవి ఎమ్మెస్ నాయుడి ఫోన్.
“ఎలా ఉన్నాడు మీ తమ్ముడు?” అడిగాను.
“సీరియస్ గానే ఉందండీ. ఆసుపత్రికి కొన్ని లక్షలు కట్టాము. ఆక్సిజన్ మీద ఉన్నాడు. భార్య, పిల్లలు చూసుకుంటున్నారు. ఖర్చు భరించలేక నిన్ననే ఇంటికి తెచ్చాము. ఐదేసి లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు రెండు కొన్నాం. అసలు రేటు లక్ష.
బ్లాక్ లో రెండు లక్షలకి కొన్నాం”.
నాయుడు చెప్పుకుపోతున్నాడు.
సరే, out of danger? Survive అవుతాడా? అడిగాను.
“ఫిఫ్టీ ఫిఫ్టీ” అన్నారు డాక్టర్లు… ఆ మధ్య తరగతి కుటుంబం ఇప్పటికే చితికి, చివికి ఛిద్రమైపోయింది.
*
ఆర్టిస్టులు చంద్ర, గోపీ, కవి అదృష్టదీపక్ కనీసం 70 సంవత్సరాలు బతికారు అని సమాధాన పగడగలం. ప్రతిభావంతులైన యువకులు కేవీ, ‘జై’ శ్రీనివాస్… లాంటి వాళ్లెందరో వెళిపోతున్నారు. వొట్టి జ్ఞాపకాలుగా, వెన్నాడే వేదనగా మిగిలిపోతున్నారు.
*
రేపు మార్నింగ్ ఏమిటి? అంది నళిని.
“పూరీలు చెయ్యి. బంగాళాదుంపలు ఉన్నాయిగా. రంజాన్ రోజు ఆలూ కుర్మా చేశావుగా, అలా చెయ్ బావుంటుంది” అన్నా.
అందానికి అందము నేనే, జీవన మకరందము నేనే… జమునారాణి పాట నళిని సెల్ ఫోన్ లోంచి మధురంగా వినిపిస్తోంది. సినిమా ‘చివరికి మిగిలేది’
రేపు ఉదయం ఎవరు ఫోన్ చేస్తారో…!
*** *** ***
శ్యాం బెనగల్ సినిమా ‘భూమిక’ చిట్టచివరి సీన్ లో ఫోన్ రింగవుతూ ఉంటుంది. జీవితంలో విసుగెత్తిపోయిన స్మితాపాటిల్ నెమ్మదిగా వెళ్లి, రిసీవర్ తీసి, చెవి దగ్గర పెట్టుకుంటుంది. అటునించి ఒక మగ గొంతు హలో.. హలో.. హలో…
ఆమె సమాధానం చెప్పదు. మౌనం.
నిరామయంగా చూస్తూ ఉండిపోతుంది,
విశాలమైన కాటుక కళ్ళతో…
సినిమా అయిపోతుంది!
*** *** ***
హాలీవుడ్ పాపులర్ హీరో Keanu Reevesని
what do you think, happens when we die? అని ఒక ఇంటర్వ్యూలో అడిగారు.
Reeves జవాబు : I know that, the one’s who love us will miss us.
*** *** ***
ఈ క్రూరమైన కోవిడ్ కాలంలో మనిషి దినచర్య ఒక deadly mechanical routine… and every day resembles the other day.
.
…….. TAADI PRAKASH, 9704541559
Share this Article