.
Bhavanarayana Thota …. వీరప్పన్ చెర నుంచి బైటపడ్డ రాజ్ కుమార్…. ఆ వార్త మాకెలా ఎక్స్‌క్లూజివ్‌గా తెలిసిందీ అంటే…
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!
(ఎవరేం చెప్పినా వినాలి. కానీ, విన్న వెంటనే తొందరపడకుండా బాగా ఆలోచించాలి. అలా నిజానిజాలు తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు)
వార్తల విషయంలో ఇదెంత నిజమో చెప్పే సంఘటన ఇది.
సెప్టెంబర్ 15, 2000 ఉదయం 9 గంటలు సన్ నెట్వర్క్ కార్యాలయం
ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే ఒకసారి సన్ న్యూస్ ఛీఫ్ ఎడిటర్ రాజాను కలవటం అలవాటు. ముఖ్యంగా రాజ్ కుమార్ కిడ్నాప్ విషయంలో కొత్త సంగతులేమైనా ఉంటే తెలుస్తాయని.
Ads
ఆ రోజు అలా వెళ్ళేసరికి ఆయన చాలా టెన్షన్ లో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ” ఎన్న విశేషమ్ ?” (ఏంటి విశేషాలు ?) అని అడిగా. శందనక్కడత్తల్ వీరప్పన్ పిడియిలిరుందు నడిగర్ రాజ్ కుమార్ విడుదలై ఎన్రు ఒరు ఫ్లాష్ న్యూస్ అడ్బిటి రెడియా వెచ్చికొంగ.. నా సొల్రపో పోడలామ్” (చందనం స్మగ్లర్ వీరప్పన్ చెర నుంచి నటుడు రాజ్ కుమార్ విడుదల అని ఫ్లాష్ న్యూస్ టైప్ చేసి రెడీగా ఉంచుకొండి. నేను చెప్పినప్పుడు వేద్దురుగాని) అన్నారు.
ఓహ్! ఆశ్చర్యం.. ఆసక్తి… మూడున్నర నెలలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్న విషయమది. మొత్తానికి కథ సుఖాంతమయింది. కానీ అదెలా జరిగిందో కాస్త వివరంగా అడగాలని ఉన్నా.. అసలే టెన్షన్ లో ఉన్న మనిషిని విసిగించదలచుకోలేదు. జెమిని, తేజ చానల్స్ లో ఫ్లాష్ న్యూస్ టైప్ చేయించటానికి పరుగులాంటి నడకతో మా సెక్షన్ వైపు వెళ్ళా.
గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫ్లాష్ వేద్దామని కాసేపటికే తిరిగి రాజా దగ్గరికొచ్చా. అతనిలో టెన్షన్ ఇంకా పెరిగింది తప్ప ఏ మాత్రమూ తగ్గలేదు. ఫోన్ రాగానే ఆయన మొహంలో మరింత టెన్షన్ పెరిగింది. అలా ఫోన్ మాట్లాడుతూనే ప్లే ఔట్ రూం వైపు పరుగు. నాకూ అర్థమైంది. ఎలాగూ ఆ ఫ్లాష్ వార్త వెయ్యాల్సిందిగా చెప్పాల్సింది కూడా అక్కడే కాబట్టి నేను కూడా ఆయనవెంటే పరుగందుకున్నాను.
సరిగా అక్కడికి చేరుకునే సరికి అవతలి వ్యక్తి ఫోన్ లో ఆ విషయాన్ని ధ్రువీకరించినట్టుంది. సన్ టీవీ ప్లే ఔట్ లో ఉన్న వ్యక్తికీ, నాకూ ఒకేసారి చెప్పారు ఆ ఫ్లాష్ న్యూస్ వేసెయ్యమని. రెండు చానల్స్ లో ఒకేసారి ఆ వార్త ప్రత్యక్షమైంది.
ఉదయ (సన్ నెట్వర్క్ వారి కన్నడ చానల్ – అది కూడా అక్కడి నుండే ప్రసారమయ్యేది) వాళ్ళకు చెబుదామా అని అడిగితే ఎందుకులే అన్నట్టుగా సైగ చేశారు. కర్నాటకలో కూడా సన్ టీవీ ద్వారా ఆ వార్త ముందుగా తెలియాలనే స్వార్థం ఆయన కళ్ళలో కనిపించింది. నిజానికి అందులో దురుద్దేశమేమీ లేదు… ఒక జర్నలిస్టుగా ఆయన తృప్తి ఆయనది.
****
ఐదు నిమిషాలు గడిచింది. సీట్లో కూర్చుని ఎదురుగా ఉన్న టీవీలో ఆ ఫ్లాష్ వైపు విజయగర్వంతో చూస్తుండగానే రాజా చేతిలో ఫోన్ మోగింది.” కలైజ్ఞర్” (కరుణానిధి) అని నాకు వినపడేలా పేరు చదువుతూ ఆన్ చేసి ” అయ్యా వణక్కంగ ” అని ఆయన అభినందనలకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
( మేనల్లుడు మురసోలి మారన్ కొడుకు కళానిధి మారన్ నడిపే సన్ టీవీలో కరుణానిధి వాటాదారు. పైగా సన్ టీవీని డీఎంకే కోసం వాడుకునేవారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆయనే సీఎం) . అవతలివైపు ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదుగాని ఈయన ముఖకవళికలను బట్టి తిడుతున్నారని మాత్రం అర్థమైంది.
కాస్త గొంతు తగ్గించి వివరణ ఇస్తున్నట్టుగా తన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజా. అయినా సరే అవతలివైపున కరుణానిధి కోపం తగ్గినట్టు కనిపించలేదు. ఎదురుచెప్పి లాభం లేదనుకుని రాజా మౌనంగా ఉండిపోయారు. అలా నాలుగు నిమిషాలపాటు తిట్టాక కరుణానిధి విసుగ్గా ఫోన్ పెట్టేశారు.
అడక్కపోయినా, ఎదురుగా కూర్చున్న నాకు ఆ ఫోన్ సంభాషణ గురించి చెప్పాలనుకున్నారు రాజా. కలైజ్నర్ ఈ స్క్రోల్ చూసి ఇంటెలిజెన్స్ ఛీఫ్ ని అడిగారట. ఆయన తనకేమీ తెలియదని చెప్పారట. కర్ణాటక సీఎమ్ కి ఫోన్ చేస్తే, మీ చానల్ వాళ్ళే చెబుతున్నారు అని ఆయన వ్యంగ్యంగా అన్నారట.
ఆ కోపంతో ఫోన్ చేసి “రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మూడు నెలలుగా ఇదే పని మీద ఉంటే, మాకు తెలియకుండా నీకు తెలుస్తుందా? నీ ఇష్టమొచ్చినట్లు వార్త ఇచ్చి చానల్ పరువు తీయాలనుకుంటున్నావా” అని విసుక్కున్నారు తప్ప తాను చెప్పేదేమీ వినిపించుకోవటం లేదని రాజా బాధపడ్డారు.
ఇంతలోనే మరో ఫోన్. ఈసారి చానల్ అధిపతి కళానిధి మారన్ నుంచి. “ఏంటయ్యా.. తాత కోప్పడుతున్నారు. ఆ వార్త ఎలా వేశావ్ ?” కరుణానిధి తరహా ఘాటుదనం మాత్రం ఆయన గొంతులో వినిపించలేదు. అప్పటికే దాదాపు18 ఏళ్లపాటు సన్ టీవీ న్యూస్ విభాగానికి అధిపతిగా పనిచేసిన రాజా మీద నమ్మకం కాస్త బలంగానే ఉండటం కూడా కారణం కావచ్చు. అన్నీ సరిచూసుకున్నాకే వేశానని రాజా సమాధానం.
” మరి తాత అలా అంటున్నారు. నన్ను అడిగితే నాకేం తెలియదన్నాను. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే నేను నీతో మాట్లాడినట్టు చెప్పకు. ఆయనకు ఏం సమాధానం చెప్పుకుంటావో నీ ఇష్టం. బాగా కోపంగా ఉన్నారు” అని ఫోన్ పెట్టేశారు. విన్నది విన్నట్టుగా నాకు చెప్పి కాస్త ఊపిరి పీల్చుకున్నారు రాజా.
వాళ్ళిద్దరికీ ఎలాగూ సరిగా చెప్పలేకపోయారు గాని, నా నుంచి ఎలా తప్పించుకుంటారు ? “ఇంతకీ ఎలా తెలిసింది ? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు ?”అని అడిగా. రాజా చెప్పిన విషయం కంటే ముందుగా అసలు ఆ కిడ్నాప్ పూర్వాపరాలు తెలియాలి.
*****
2000 సంవత్సరం జూలై 30 రాత్రి 9 గంటల సమయంలో రాజ్ కుమార్ ను ఆయన గెస్ట్ హౌస్ నుంచి వీరప్పన్ ముఠా కిడ్నాప్ చేసింది. తన అనుచరుల మీద పెట్టిన టాడా కేసుల ఉపసంహరణ సహా పది డిమాండ్లతో కూడిన ఆడియో టేపును ఆ సమయంలో వీరప్పన్ ఇచ్చి వెళ్ళాడు. రాజ్ కుమార్ భార్య సావిత్రమ్మ దాన్ని తెల్లవారు జామున రెండు గంటలకు కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ ఎమ్ కృష్ణకు అందజేస్తూ కిడ్నాప్ సంగతి తెలియజెప్పారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉలిక్కిపడ్డారు. పోలీసులను అప్రమత్తం చేశారు. డిమాండ్లకు తలొగ్గటం మినహా చేయగలిగేదేమీ లేదని వాళ్ళకు తెలుసు. అదేవిషయం చెప్పి పంపటానికి నక్కీరన్ గోపాల్ ను దౌత్యం చేయాల్సిందిగా కోరారు. అలా ఐదారుసార్లు దౌత్యాలు నడిచాయి. అనిశ్చితి తొలగలేదు.
******
ఉదయాన్నే రాజా ఆఫీసుకు బయలుదేరుతుండగా సెల్ ఫోన్ మోగింది. లాండ్ లైన్ బిఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి కాల్. ఒక అపరిచితుడు మాట్లాడుతున్నాడు. తాను మాట్లాడుతున్నది సన్ టీవీ న్యూస్ ఛీఫ్ ఎడిటర్ రాజాతోనే అనే విషయం ముందుగా ధ్రువీకరించుకున్నాడు. అతని గొంతులో ఏదో ఉత్కంఠ…
ఉద్విగ్నభరితమైన స్వరంతో ” రాజ్ కుమార్ సార్ ని వీరప్పన్ వదిలిపెట్టాడు… సన్ టీవీలో వెంటనే వేయండి సార్” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతనెవరో కనుక్కుందామని అడిగే లోపే ఫోన్ కట్ అయింది. వెంటనే ఆ నెంబర్ కి ట్రై చేస్తే చాలా సేపు ఎవరూ తీయలేదు. వదలకుండా అలాగే ట్రై చేస్తూ ఉంటే ఎట్టకేలకు ఫోన్ ఎత్తారు.
అది ఈరోడ్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూతపాడి అనే ఒక మేజర్ పంచాయితీ కేంద్రంలోని పబ్లిక్ టెలిఫోన్ బూత్ అని మాత్రమే తేలింది. దూరంగా ఉన్న ఒక హెూటల్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఫోన్ చేసుకొని వెళ్ళాడని మాత్రమే ఆ బూత్ యజమాని చెప్పగలిగాడు. అంతకు మించి ఎలాంటి ఆధారమూ లేదు. వేగం, విశ్వసనీయత మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి అది.
ఏమైనా, ధ్రువీకరించుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే ఈరోడ్ రిపోర్టర్ కి ఫోన్ చేసి వెంటనే ఆ టెలిఫోన్ బూత్ కి, దగ్గర్లోని హెూటల్ కు వెళ్ళి పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా కోరారు రాజా. క్షణాల్లో బైక్ మీద బయల్దేరాడు ఈరోడ్ రిపోర్టర్. ఈలోపు రాజా ఆఫీసుకు చేరుకున్నారు. భూతపాడి ఒక చిన్నపాటి పట్టణం. అడవి అంచున ఉంటుంది. అక్కడున్న ఒకే ఒక హెూటల్ ని కనుక్కోవటం పెద్ద కష్టమేమీ కాలేదు.
కింద రెస్టారెంట్. పైన కేవలం నాలుగే గదులు. అక్కడ ఆ రిపోర్టర్ కంటికి కొట్టొచ్చినట్టు కనిపించిన విషయం ఒకటుంది… కర్నాటక రిజిస్ట్రేషన్ తో ఫాన్సీ నెంబర్ కారు ! వెంటనే ఫోన్ చేసి రాజా కి ఇదే విషయం చెప్పాడు. నెంబర్ నోట్ చేసుకుంటూనే బెంగళూర్ లోను ఉదయ టీవీ బ్యూరో ఛీఫ్ కి ఫోన్ కలిపారాయన. ఈ నెంబర్ కారు ఎవరిదో కనుక్కొని చెప్పగలరా అని అడిగేలోపే అవతలినుంచి సమాధానం వచ్చేసింది.
రాజ్ కుమార్ కొడుకు పునీత్ కారు అది. ఆ టైం లో ఆ కారు అక్కడెందుకుంది ? సమాధానానికి బాగా దగ్గరవుతున్నట్టు అనిపించి ఉత్సాహం రెట్టింపైంది. రాజా వెంటనే ఈరోడ్ రిపోర్టర్ కి మళ్ళీ ఫోన్ చేశారు. ఆ కారులో వచ్చిన వాళ్ళు ఏ గదిలో దిగారో కనుక్కుని వాళ్ళ దగ్గరికెళ్ళి అసలు విషయం నేరుగా అడిగెయ్యమని చెప్పారు.
సరిగ్గా నేను రాజా ఛాంబర్ దగ్గరికి వెళ్ళేదాకా జరిగిన విషయం అది. అందుకే ఈ వార్త చెప్పి ఫ్లాష్ న్యూస్ రెడీ చేసుకోమన్నారు. నరాలు తెగే ఉత్కంఠతో ఈరోడ్ రిపోర్టర్ అందించే వార్త కోసం ఎదురుచూస్తున్నారాయన. స్క్రోలింగ్ కు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ఎదురుచూడటం నా వంతయింది.
అక్కడి రిపోర్టర్ అంతకంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఆ మాత్రం ముందుకెళ్లమని చెబితే చాలునన్నట్టు క్షణాల్లో ఆ గది తలుపు తట్టాడు. లోపల రాజ్ కుమార్ కొడుకు, అతని ఫ్రెండ్స్ అక్కడ డ్రింక్ చేస్తూ రిలాక్స్ అవుతూ కనిపించారు. అప్పుడు ఉదయం 9 గంటలైంది.
వాళ్ళ ముఖాల్లో రిలీఫ్ కనిపించింది. తలుపుతట్టి లోనికొచ్చిన అగంతకుణ్ణి “ఎవరు నువ్వు?” అన్నట్టు విసుగ్గానూ, విస్మయంతోనూ చూస్తూ ఉంటే, రిపోర్టర్ చాలా వినయంగా క్షమాపణ కోరుతూ, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ” రాజ్ కుమార్ సార్….” అంటూ అర్థోక్తిగా ఆపగానే “ఓహ్, అప్పుడే మీకు తెలిసిపోయిందా… సర్లే.. ఆయన ఉంజపాళయంలో భూతపాడి సర్పంచ్ రామరాజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రానికి మీడియా ముందుకొస్తార్లే ” అని చెప్పారు.
థాంక్స్ చెప్పి బయటికొచ్చిన రిపోర్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజాకు ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడుతూనే ఆ రిపోర్టర్ విజయగర్వంతో ముందుకు నడుస్తూ ఉంటే “సన్ టీవీయా ?” అని ఎవరో అడగటం వినిపించింది.
వెనక్కి తిరిగి చూస్తే అతను ఆ రిపోర్టర్ వైపు తిరిగి నర్మగర్భంగా నవ్వుకుంటున్నాడు. “అవును” అని సమాధానమిస్తున్నప్పుడు తలెత్తిన డ్రైవర్ కళ్ళలో అసలైన విజయగర్వం తొణికిసలాడుతోంది. అర్థమైందన్నట్టు అభినందనపూర్వకంగా చూస్తూ సెలవు తీసుకున్నాడా రిపోర్టర్.
*****
ఇక్కడ రాజా వెంటనే ఆ వార్త ఫ్లాష్ న్యూస్ గా ప్రసారం చేసి కరుణానిధి ఆగ్రహానికి గురయ్యారు. ఆ వార్త వెనుక కథ వినటానికి కూడా సమయమివ్వని కరుణానిధి కోపానికి కారణం తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం. ఎస్ ఎమ్ కృష్ణ స్వయంగా రాజ్ కుమార్ భార్య సావిత్రమ్మతో మాట్లాడి ఖరారుచేసుకున్న తరువాత కరుణానిధికి ఫోన్ చేసి చెప్పారు.
అప్పటికి ఫ్లాష్ న్యూస్ ప్రసారమై రెండు గంటలు గడిచింది. ముఖ్యమంత్రి కరుణానిధి ఉద్దేశపూర్వకంగానే సన్ టీవీకి ఆ వార్త ముందుగా అందించారని ఆరోపిస్తూ జయలలిత విడుదల చేసిన పత్రికాప్రకటన చూసినపుడు ఇద్దరం నవ్వుకున్నాం.
మాటమాత్రంగానైనా చానల్ అధిపతి కళానిధి మారన్ కు గాని సీఎం కరుణానిధికి గాని చెప్పకుండానే ఇలాంటి వార్త ప్రసారం చేయటం ఒకవిధంగా రిస్క్ తీసుకోవటమేనని ఆ తరువాత ఒక సందర్భంలో రాజా నాతో అన్నారు. జర్నలిజం విద్యార్థులకు ఈ ఉదాహరణ చెబుతూ ఉంటా.
*****
108 రోజుల పాటు బందీగా ఉంచుకున్న వీరప్పన్ చివరికి ఎలా వదిలిపెట్టాడన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. 20 కోట్లు అడిగాడాని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ మొత్తాన్ని ఏ ఖాతా నుంచి చెల్లించాలన్న సమస్యతో ఆగిపోయాయని చెబుతారు.
ఆ సమయంలో ఇక ఆలస్యం తగదని రాజ్ కుమార్ కుటుంబం, రజనీకాంత్ పదేసి కోట్లు వేసుకొని ఒక మహిళా డాక్టర్ ద్వారా పంపారు. అక్కడ మైనింగ్ జరుపుతూ వీరప్పన్ కు ముడుపులివ్వటం ఆమెకు అలవాటే కాబట్టి ఆమె ద్వారా పంపి రాజ్ కుమార్ ను విడిపించుకున్నట్టు అ తరువాత కథనాలు వచ్చాయి.
*****
30 ఏళ్ల పాటు సన్ టీవీ న్యూస్ విభాగాధిపతిగా ఉన్న వాసుదేవన్ రాజా ‘మీండుమ్ తలైప్పు సెయిదిగళ్’ పేరుతో తన జ్ఞాపకాలను 600 పేజీల పుస్తకంగా సిద్ధం చేశారు. త్వరలో విడుదలయ్యే ఈ పుస్తకంలో ఆయన రాసే మరిన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను నేను తెలుగులో అందించటానికి ఆయన ఇప్పటికే ఒప్పుకున్నారు.
‘మీండుమ్ తలైప్పు సెయిదిగళ్’ అంటే, తమిళ వార్తల బులిటెన్ చివర్లో న్యూస్ ప్రజెంటర్లు ‘ప్రధాన వార్తలు మరోసారి’ అని తమిళంలో చెప్పటమన్నమాట. అందుకే తన జ్ఞాపకాలు చెప్పుకోవటానికి ఆయన ఈ పదబంధం వాడుకున్నారు. తోట భావనారాయణ (99599 40194)
Share this Article