.
( రమణ కొంటికర్ల )…. తమిళనాడులోని ఒక కుగ్రామం నుంచి వచ్చాడు. ఇప్పటికి వరుసగా మూడోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకడిగా గుర్తింపబడుతున్నాడు. భావితరాలకు సైన్స్ అవసరమని తాను భావించి.. దాన్నే బోధిస్తున్న ఆ ప్రొఫెసర్ ప్రయాణం క్వైట్ ఇంట్రెస్టింగ్.
తమిళనాడు నీలగిరి వంటి ఓ చిన్న జిల్లాకు చెందిన డాక్టర్ అశోక్ కుమార్ వీరముత్తు పేరు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధ కాంటెంపరరీ శాస్త్రవేత్తల్లో వినిపిస్తోంది. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ పబ్లిషర్స్ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో మూడోసారి ఈ డాక్టర్ సాబ్ చోటు సంపాదించారు.
Ads
2023 నుంచి మొదలు 2024, 2025లోనూ ఆయన ప్రపంచంలోని మేటి ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందడం విశేషం. ఎందుకంటే.. స్టాన్ ఫోర్డ్, ఎల్సెవియర్ పబ్లిషర్స్ ఇచ్చే ఈ ర్యాంకింగ్స్ ను అత్యంత గౌరవనీయంగా భావిస్తారు.
డాక్టర్ అశోక్ కుమార్ టార్గెట్ పర్యావరణ పరిరక్షణ. అలాగే, ఇంకా గొర్రెదాటు మూఢనమ్మకాలతో… పుక్కిటి పురాణాలతో కాలం వెళ్లదీస్తున్న సమాజాన్ని సైన్స్ వైపు మళ్లించడం అశోక్ కుమార్ చేపట్టిన ఓ పెద్ద టాస్క్. పర్యావరణ పరిరక్షణ నుంచి వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ వరకూ ఆచరణాత్మకమైన పరిష్కారాలను సూచిస్తూ సైన్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో అశోక్ కుమార్ చెబుతారు.
సైన్స్ ఫర్ పీపుల్ అని నమ్మిన వ్యక్తి!
పర్యావరణ హాని చేస్తున్న వ్యర్థాల నిర్వహణకు మెరుగైన పరిష్కారాలను కనుగోవడంతో అశోక్ కుమార్ గ్లోబల్ రికగ్నిషన్ పొందారు. ప్లాస్టిక్ మహమ్మారి గ్లోబల్ వార్మింగ్ వంటి భారీ వినాశనకారుల్లో కీలకపాత్ర పోషిస్తున్న రోజుల్లో.. ఆ వ్యర్థాలను ఉపయోగించుకుని పర్యావరణ హితంగా మార్చి మైక్రోఆల్జీ ఆధారిత ఇంధనాన్ని అభివృద్ధి చేశారు డాక్టర్ అశోక్.
ఇలా వివిధ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. అందుకే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ కొరియా ఆయన్ను “బ్రెయిన్ పూల్: విజిటింగ్ గ్లోబల్ సైంటిస్ట్” అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన పరిశోధలను ఇచ్చిన స్థిరమైన ఫలితాలకు, ఆయన కృషికి దక్కిన అవార్డే బ్రెయిన్ పూల్ విజిటింగ్ గ్లోబల్ సైంటిస్ట్ సత్కారం.
విశ్వవ్యాప్త గుర్తింపు!
డాక్టర్ అశోక్ కుమార్ ఇప్పుడంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు… పేరుమోసిన ప్రపంచ ప్రసిద్ధ సైంటిస్టుల నుంచి మన్ననలు పొందుతున్నారేమోగానీ… తానూ, చిన్ననాట చాలామందిలాగే ప్రభుత్వ పాఠశాల్లోనే చదివిన విద్యార్థి. కానీ, చదువుపైనున్న ఆసక్తి.. సైన్స్ విలువ తెలుసుకున్న ఆ జిజ్ఞాస అశోక్ కుమార్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 18 యూనివర్సిటీస్ తో కలిసి ఆయన తయారు చేసిన పరిశోధనా పత్రాలు.. 130కి పైగా పేరు మోసిన అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.
భూమిపై జీవులు, వాటి పరిమాణక్రమం, ఇతర గ్రహాలు ఇలాంటి పలు అంశాల్లో సైన్స్ ను సామాన్యులకు చేరువ చేసే సామాన్యశాస్త్రంగా ఆచరాణాత్మకంగా ఆవిష్కరించే కృషి చేస్తూ ఈ తమిళనాడు ప్రొఫెసర్ మన్ననలందుకుంటున్నారు.
ప్రస్తుతం అశోక్ కుమార్ వర్కింగ్ ప్లేస్ ఎక్కడ..?
చెన్నైలోని సవీత విశ్వవిద్యాలయంలో వేస్ట్ మేనేజ్మెంట్, రీ న్యూయెబుల్ ఎనర్జీ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు డాక్టర్ అశోక్ కుమార్. థాయిలాండ్ లోని చులాలాంగ్ కార్న్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ టెక్నాలజీ మలేషియాతో పాటు, పలు కొరియన్ విశ్వవిద్యాలయాల్లోనూ విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
వ్యర్థాల పునరుద్ధరణ, వాటిని పునరుత్పాదక శక్తిగా మార్చడం పట్ల ఆయన సంకల్పసిద్ధి.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎక్కడికెళ్లినా సైన్స్ పరిశోధనల్లో గేట్లు తెరిచేలా చేసింది. దాంతో భారత్ గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఇప్పుడు అశోక్ కుమార్ పేరు మార్మోగుతోంది. స్టాన్ ఫోర్ట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఓ పరిశోధకుడికి వరుసగా ముడేళ్ల నుంచి అత్యుత్తమ శాస్త్రవేత్తగా గుర్తింపునివ్వడమంటే.. కేవలం అది అశోక్ కుమార్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయ పరిశోధనా రంగానికే దక్కిన గుర్తింపు.
ఓ కుగ్రామంలో జీవితాన్ని ప్రారంభించి, ఎదురైన ప్రతీ సవాల్ నూ ఫేస్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తన సైన్స్ పరిశోధనలను షేర్ చేసి, గ్లోబల్ సైంటిస్ట్ స్టార్ గా ఎదిగారు. సైన్స్ ఎందుకు అవసరం, దాని అవసరమెంతో చెప్పడానికి.. ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్ పరిశోధనలు, దానిపై ఆయన ఆసక్తి కనబర్చడానికి గల కారణాలే ఉదాహరణలు…
Share this Article