.
కొన్ని విషయాల్లో సీపీఎం ధోరణులతో విభేదించేవారు సైతం… అక్షరాస్యత, హెల్త్ కేర్, సంక్షేమం దిశలో కేరళ ప్రభుత్వం చేసే కృషిని మెచ్చుకోవాలి… అఫ్‌కోర్స్, ఎల్డీఎఫ్ స్థానంలో యూడీఎఫ్ ప్రభుత్వం వచ్చినా ఈ విషయాల్లో అక్కడి ఉన్నతాధికార యంత్రాంగం కృషి కొనసాగుతూనే ఉంటుంది, అభినందనీయం…
ప్రస్తుతం నచ్చిన వార్త ఏమిటంటే… నవంబరు ఒకటిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయబోతోంది… ‘‘తీవ్ర పేదిరకం లేని రాష్ట్రం’’ అనే ప్రకటన అది… మళ్లీ చదవండి… పేదరికం లేని రాష్ట్రం కాదు… తీవ్ర పేదరికం లేని రాష్ట్రం…
Ads
ఎవరు తీవ్ర పేదరికం కేటగిరీలోకి వస్తారు… సరైన నిర్వచనం, సరైన ప్రామాణికాలను చెప్పలేం గానీ… పేదరికం మీద రకరకాల సంస్థలు రకరకాల ప్రాతిపదికలు చెబుతుంటాయి గానీ… కేరళ ప్రభుత్వం 2021 లో ఓ కార్యాచరణను ప్రారంభించింది…
దాని పేరు ‘తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం’ (Extreme Poverty Eradication Project – EPEP)… పినరై విజయన్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదీ ఒకటి…
అసలు ఎవరు ఆ తీవ్ర పేదలు..? కొన్ని ప్రామాణికాలను తీసుకున్నారు ఈ కుటుంబాల ఎంపికకు… అసలు ఏమాత్రం ఆదాయం లేనివాళ్లు… సమాజం, ప్రభుత్వం బాసటగా నిలిస్తే తప్ప మనుగడ లేని కుటుంబాలు… అనారోగ్యాలు, వ్యాధులతో ఏమీ సంపాదించే స్థితిలో లేనివాళ్లు… ఆశ్రయం, వసతి లేనివాళ్లు… తీవ్ర పేదలు అనేపదంకన్నా నిరుపేదలు అనే పదం ఆప్ట్…
ఇలా 64 వేల కుటుంబాలను ఎంపిక చేశారు… అంత జనాభాలో 64 వేల కుటుంబాలు అంటే ఒక శాతం కూడా కాదుగా అంటారా..? కంపల్సరీగా సర్కారీ సాయం అవసరమైన కుటుంబాలు అన్నమాట…
- ఇక్కడ ఓ ప్రస్తావన తప్పనిసరి… సీపీఎం ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ భరోసా అవసరమున్న కుటుంబాలను ఎంపిక చేసి, సాయం చేయడం స్టార్ట్ చేసింది… కానీ కేసీయార్ ఏం చేశాడు తెలంగాణలో..? వోట్ల కోసం దళితబంధు అన్నాడు, అందరికీ నగదు పంపిణీ…చివరకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నాసరే ఇస్తాను అన్నాడు… మిగతా కులాల్లో వ్యతిరేకత కనిపించేసరికి బీసీ బంధు అన్నాడు, ఏవేవో చెప్పాడు, ఏదీ సరిగ్గా చేయలేదు, అయిపాయె… ఇక ఏపీలో జగన్, చంద్రబాబు, కర్నాటక, తెలంగాణల్లో ఫ్రీ స్కీమ్స్ సంగతి సరేసరి… ఇప్పుడు బీహార్‌లో కూడా అలవిమాలిన ఏవో పథకాలు ప్రకటిస్తున్నారు నితిశ్, తేజస్వి…
సీపీఎం అలా గాకుండా ఓ నిర్దిష్ట కార్యాచరణను అమలు చేసింది… ఎలాగంటే..?
1. ఆహార భద్రత (Food Security) …ఆహార లేమి (Food Deprivation) ఉన్న కుటుంబాలకు ఉచితంగా లేదా రాయితీపై నిరంతరాయంగా ఆహార వస్తువులను, రేషన్‌ను అందించారు… ఆకలి సమస్య లేకుండా, కుటుంబానికి ప్రతిరోజు తగిన పోషకాహారం అందేలా చూడటం దీని లక్ష్యం…
2. ఆరోగ్యం & సంరక్షణ (Health & Care)…. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న లేదా మంచాన పడిన సభ్యులు ఉన్న కుటుంబాలకు ఉచిత వైద్య సంరక్షణ, చికిత్స అందించారు ప్రాధాన్యతనిచ్చి… ఆరోగ్య బీమా (Health Insurance) సౌకర్యాలు కల్పించారు… మంచాన పడిన వారికి సేవ చేసేవారికి (Caretakers) జీవన భృతి అందించారు… ఆరోగ్య సమస్యల కారణంగా ఆదాయం కోల్పోకుండా నిరోధించడం దీని లక్ష్యం…
3. ఆదాయం & జీవనోపాధి (Income & Livelihood)…. ఆదాయం లేని కుటుంబాలకు స్వయం ఉపాధి (Self-employment) పథకాలు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందించారు… కుటుంబ సభ్యులకు వారి నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించి, స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడేలా చూశారు… సామాజిక భద్రతా పింఛన్లు (Social Security Pensions) అందేలా చేశారు… దీని లక్ష్యం కుటుంబం సొంతంగా నిలదొక్కుకునే శక్తిని కల్పించడం…
4. ఆశ్రయం & ఇతర ప్రాథమిక హక్కులు (Shelter & Basic Rights) … ఇల్లు లేని వారికి (Homeless) లేదా సురక్షితమైన ఆశ్రయం లేని వారికి ప్రభుత్వ ‘లైఫ్ మిషన్’ (Life Mission) కింద ఇళ్లను మంజూరు చేయడంలో ప్రాధాన్యత ఇచ్చారు… ప్రభుత్వ పథకాలు పొందడానికి అవసరమైన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు వంటి పత్రాలు లేని వారికి వాటినిచ్చారు… మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు… దీని లక్ష్యం నిరాశ్రయం నుంచి విముక్తి కల్పించడం…
సంక్షిప్తంగా, కేరళ ప్రభుత్వం 64,006 కుటుంబలకు సమస్యల ఆధారంగా ఓ Customized పరిష్కార ప్యాకేజీని అమలు చేసింది… ఇప్పుడు ఆ కుటుంబాలను తీవ్ర పేదరికం నుంచి బయటపడేయగలిగారు కాబట్టి నవంబర్ ఒకటి (కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) రోజున తీవ్ర పేదరికం లేని మొదటి భారతీయ రాష్ట్రంగా ప్రకటించనున్నారు..!!
ఎడాపెడా ఫ్రీ పథకాలతో ఖజానాను ఖాళీ చేసి, ప్రజల్ని బిచ్చగాళ్లుగా చేయకుండా… నిజంగా ప్రభుత్వ సాయం అవసరమైనవారికి మాత్రమే ఎలా అందించాలో సీపీఎం ప్రభుత్వం చేసి చూపించింది… గుడ్…
Share this Article