.
శంఖు పుష్పం… అపరాజిత… బటర్ ఫ్లయ్ పీ… పేరు ఏదైతేనేం… కొన్నాళ్లుగా బహుళ ప్రచారంలోకి వస్తోంది… కాస్త తేమ దొరికితే చాలు ఈ తీగ పాకిపోతుంది… చాలా ఇళ్ల పెరళ్లలో, గుమ్మాల పక్కనో కనిపిస్తున్నాయి… పచ్చదనం, పూల అందం, నేచురల్ ఎలివేషన్ కోసం…
ఇంతకీ ఏమిటీ దీనికి ఇంత ప్రాధాన్యత..? ఉంది… ఆరోగ్యం, ఆధ్యాత్మికం, అందం, వ్యాపారం ఎట్సెట్రా… వివరాల్లోకి వెళ్దాం…
Ads
సాధారణ తీగగా కనిపించే శంఖు పుష్పం (Clitoria Ternatea) ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక సూపర్ ఫుడ్ (Superfood), ముఖ్యమైన వాణిజ్య పంటగా గుర్తింపు పొందుతోంది… దీని అసాధారణ ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు…
‘బ్లూ టీ’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు
శంఖు పుష్పాలను ఎండబెట్టి తయారుచేసే హెర్బల్ టీని ‘బ్లూ టీ’గా పిలుస్తున్నారు… జపాన్‌లో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ టీని వినియోగించే సంస్కృతి ఉంది… ఇటీవలి పరిశోధనలు ఈ టీ ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడిస్తున్నాయి…
ఈ పువ్వుల్లో ఉండే టెర్నాటిన్స్ (Ternatins) అనే రసాయన పదార్థం వల్లనే ఈ ప్రయోజనాలు ఉన్నాయి… ప్రత్యేకించి దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, బరువు తగ్గడానికి (లావు తగ్గడానికి) ఉపయోగకరమని చెబుతున్నారు… అంతేకాదు… ఆయుర్వేదంలో దీన్ని జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు…

ఆరోగ్య సంజీవని
ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంపై కొన్ని సానుకూల ప్రభావాలను చూపుతాయి…
1. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెంచడం, మెదడు కణాల రక్షణ
2. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు నివారణ, యాంటీ డిప్రసెంట్ లక్షణాలు
3. కొలెస్ట్రాల్ స్థాయిల తగ్గింపు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి నివారణ
4. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
5. కాలేయ శుద్ధి, జీర్ణక్రియకు ఉపయుక్తం
ఇటీవల కాలంలో బాగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులు, కొలెస్టరాల్, ఫ్యాటీ లివర్, ఊబకాయం, సుగర్, డిప్రెషన్, స్ట్రెస్… వీటన్నింటికీ దీన్ని సజెస్ట్ చేస్తున్నారు…

సౌందర్య చికిత్సల్లో కీలకం
శంఖు పుష్పం కేవలం ఆరోగ్యానికే కాక, అందానికి కూడా మేలు చేస్తుంది…. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది… చర్మాన్ని పోషించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. సౌందర్య చికిత్సలలో భాగంగా స్పా కేంద్రాల్లో వీటి వినియోగం పెరుగుతోంది…
వాణిజ్యపరంగా లాభసాటి: కిలో ధర ₹8500
తూర్పు తీర అడవుల్లో ఈ పువ్వుల సాగు, ఎండబెట్టడం ద్వారా చిన్న, మధ్య తరహా రైతులు లాభపడుతున్నారు… ఎండబెట్టిన పువ్వుల ధర ప్రస్తుతం భారత మార్కెట్లో కిలోకు సుమారు ₹8500 వరకు పలుకుతోంది… దేశీయంగానే కాకుండా, వివిధ దేశాలకు వీటి ఎగుమతి జరుగుతోంది…
ఈ పువ్వులను శుభ్రంగా డ్రైయర్‌లో లేదా ఎండలో ఎండబెట్టి, తేమలేని గాజు సీసాలో నిల్వ చేసి వాడుకోవచ్చు లేదా హైదరాబాదులోని నీలోఫర్ టీ కంపెనీ వంటి సంస్థలకు అమ్మి వ్యాపారం చేయవచ్చు… చాలామంది ఇటీవల ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్నారు…

ఆధ్యాత్మిక, తాంత్రిక ప్రాముఖ్యత
హిందూ సంప్రదాయంలోనూ, తాంత్రిక విధానాల్లోనూ ఈ పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది… శని త్రయోదశి, అమావాస్య రోజుల్లో శివుడికి ఈ పువ్వులను సమర్పించడం వల్ల శని దోషం పోతుందని భక్తుల విశ్వాసం… శనివారం సూర్యాస్తమయం సమయంలో కర్ర బొగ్గులు, పీచు తీయని కొబ్బరికాయతో కలిపి నదిలో వదిలే తాంత్రిక విధానాలు గ్రహ దోష పీడ నివారణ కోసం పాటించే ఆచారం ఉంది…
శంఖు పుష్పం తన సహజ సిద్ధమైన నీలి రంగుతో వంటల్లో (బియ్యం, నూడుల్స్‌కు సహజ రంగు కోసం), పానీయాల్లో (నిమ్మరసం కలిపితే ఊదా రంగులోకి మారుతుంది) కూడా అద్భుతంగా రాణిస్తోంది… మొత్తం మీద, శంఖు పుష్పం – ఆరోగ్యం, అందం, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలను ముడిపెడుతూ – భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది అనడంలో సందేహం లేదు… ( వి.శ్రీనివాసులు, నిజామాబాద్... 9246632166 )
Share this Article