Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!

October 26, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల )…. CIA చీకటి ఒప్పందాల్ని బట్టబయల్జేసిన రిపోర్టర్ గ్యారీ వెబ్ విషాద గాధ ఇది. పులిట్జర్ వంటి అత్యున్నత పురస్కార గ్రహీత తన పరిశోధనలతో అమెరికన్ ప్రభుత్వాన్నే గడగడలాడించిన చరిత్ర ఇది.

1990ల మధ్య కాలమది. పులిట్జర్ బహుమతి గ్రహీత, రిపోర్టర్ గ్యారీ వెబ్.. ది మెర్క్యూరీ న్యూస్ అనే పత్రికలో ఒక మూడు భాగాల సీరీస్ తో అమెరికా ప్రభుత్వం వెన్ను విరిచే సంచలన కథనాలతో విరుచుకుపడ్డాడు. తను సృష్టించిన వార్తా కథనాల తుఫాన్.. అమెరికాను సునామీగా మారి కకావికలం చేసింది.

Ads

లాస్ ఏంజిల్స్ లోని నల్లజాతీయులు నివశించే పరిసరాల్లో క్రాక్ కొకైన్ అమ్మకాలపై తన ఎపిసోడ్స్ లో ఆధార సహితంగా బట్టబయలు చేశాడు గ్యారీ వెబ్. ఆ అమ్మకాల నుంచి వచ్చే లాభాలు.. 1980ల కాలంలో నికరాగ్వా తిరుగుబాటుదారులకు నిధులు సమకూర్చేందుకు ఎలా సహాయపడ్డాయో గ్యారీ వెబ్ రాసిన కథనాలు సీఐఏ అధికారులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి.

ఎందుకంటే ఆ మొత్తం చీకటి వ్యవహారం వెనుక యూఎస్ఏ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీదే కీలకపాత్ర అని.. అందుకు నాటి అమెరికా ప్రభుత్వ పాత్రా కీలకమనేది ఆ సంచలన ఆ కథనాల్లోని సారాంశం.

కొకైన్ పై గ్యారీ వెబ్ కథనాలతో అమెరికా ప్రభుత్వ నడుం బిగించక తప్పనిసరి పరిస్థితేర్పడింది. దాంతో నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వార్ ఆన్ డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. కానీ, అప్పటికే డ్రగ్స్ మహమ్మారికి బానిసలైన సమాజంలో అమెరికా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం పెల్లుబుకింది.

రోనాల్డ్ రీగన్ కు అంతా తెలిసే జరిగిందా… అందుకే, ఆయన చూసీచూడనట్టు వదిలేశారా అనే అనుమానాలు ముసురుకున్నాయి. రోనాల్డ్ రీగన్ కార్పోరేట్ మీడియాను తనకనుకూలంగా మల్చుకున్నాడు. వారంతా ఆయనకు బాకా ఊదారు. గ్యారీ వెబ్ కథనాలను తప్పుబడుతూ కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టారు.

అయితే గ్యారీ వెబ్ కథనాలు ఇప్పటికీ అమెరికా చరిత్రలో నాటి చీకటి అధ్యాయాన్ని గుర్తు చేసేలా ఎక్కడో ఓచోట చర్చకు వస్తూనే ఉంటాయి. సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా నాటి నుంచే ఎలా రగిలిపోయేది… అవకాశమున్న ప్రతీచోటా తన ఆధిపత్యాన్ని ఎలా కనబర్చేది.. అందుకోసం, ఎలాంటి కుతంత్రాలకు ఒడిగట్టేదనే అంశాలన్నీ గ్యారీ వెబ్ కథనాలు కళ్లకు కట్టాయి.

గ్యారీ వెబ్ కథనాలతో తమ ప్రభుత్వంపై పడ్డ నిందను తొలగించుకునేందుకు నాడు అమెరికా చేయని ప్రయత్నాలు లేవు. అలాంటి సమయంలో నల్లజాతీయులు కొకైన్ వాడటాన్ని అది వారి వ్యసనంగా అమెరికా ప్రభుత్వం ప్రజల ముందుంచే యత్నం చేసింది.

కానీ, అది స్వతహాగా నల్లజాతీయులు ఏరి కోరి తెచ్చుకున్న మహమ్మారి కాదని తాను నిరూపిస్తానంటూ గ్యారీ వెబ్ నాటి అమెరికా ప్రభుత్వాన్నే సవాల్ చేశాడు. 2004లో ప్రచురించబడిన ఇంట్ ది బజ్సా : లీడింగ్ జర్నలిస్ట్స్ ఎక్స్ పోజ్ ద మిత్ ఆఫ్ ఏ ఫ్రీ ప్రెస్ అనే బుక్ లో.. నాటి ప్రభుత్వ సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా గ్యారీ వెబ్ ఎలా పోరాడాడో కొందరు అవార్డ్ విన్నింగ్ జర్నలిస్టుల బృందం పేర్కొంది.

రోనాల్డ్ రీగన్ హయంలో చిచ్చు రేపిన ది డార్క్ అలయెన్స్!

యూఎస్ కు డ్రగ్స్ సరఫరా చేసే ముఠా సీఐఏతో సంబంధాలు కల్గి ఉందన్నదే గ్యారీ వెబ్ కథనాల్లో ప్రధాన సంచలనమైన ఆరోపణ. దాని వెనుక అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష ఉందన్నది అంతర్లీనంగా ఆయన కథనాలు తేటతెల్లం చేసిన నిజం.

దక్షిణ కాలిఫోర్నియా మాదక ద్రవ్యాల ముఠా ద్వారా నిధులు అందుకున్న నికరాగ్వాన్ కాంట్రాస్ అనే రైట్ వింగ్ రెబల్ గ్రూప్.. సీఐఏతో సంబంధాలు పెట్టుకోవడమే డార్క్ అలయెన్స్. నికరాగ్వా సోషలిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక రాజకీయ దురుద్ధేశాన్ని ఎండగడుతూ గ్యారీ వెబ్ తన పరిశోధనాత్మక కథనాలతో చిచ్చరపిడుగై ఎగిసిపడ్డాడు.

సీఐఏ- డ్రగ్స్ ముఠా నెట్వర్క్ ను వెబ్ కథనాలు ఎలా బట్టబయల్జేశాయి..?

1996, ఆగస్ట్ లో ఒక బహిరంగ సమావేశంలో గ్యారీ వెబ్ వెల్లడించినదాని ప్రకారం.. దాదాపు ఒక దశాబ్దకాలం పాటు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా మాదక ద్రవ్యాల ముఠా లాస్ ఏంజిల్స్ లో వీధి ముఠాలకు భారీ మొత్తంలో కొకైన్ ను విక్రయించింది. తద్వారా వచ్చిన డబ్బును నికరాగ్వాన్ లోని సోషలిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నికరాగ్వాన్ కాంట్రాస్ రెబల్స్ కు ఫండ్స్ గా సమకూరుస్తూ వచ్చింది.

శాండినిస్టా విప్లవమంటే ఏంటి..?

1978-79 మధ్య కాలంలో అమెరికా మద్దతుతో అప్పటికే నికరాగ్వాలో డిక్టేటర్షిప్ తో తిరుగుబాటును ఎదుర్కొంటున్న సోమోజా పాలన పతనమైంది. దాంతో సాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ కూలిపోయింది. దీన్నే శాండినిస్టా విప్లవమంటారు.

ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రీగన్ సామ్రాజ్యవాద కోరికతో మరో కొత్త పాలకుడికి అవకాశమివ్వకుండా నికరాగ్వాన్ లో సైనికపాలన కోరుకున్నాడు. అలా దక్షిణ అమెరికాపై ఆధిపత్యాన్ని కనబర్చే క్రమంలో.. 500 మందితో కూడిన ఓ పారామిలటరీ దళాన్ని ప్రోత్సహించి, రంగంలోకి దింపి, వారికి శిక్షణనిచ్చి, ఏకంగా 19 మిలియన్ల యూఎస్ డాలర్లను కూడా సాయమందించింది రోనాల్డ్ రీగన్ ప్రభుత్వం.

వక్రమార్గాలవైపు కాంట్రాస్ రెబల్స్ అడుగులు!

యూఎస్ శిక్షణ పొందిన కాంట్రాస్ మిలటరీ దళమంతా ఆ తర్వాత వక్రమార్గాలను అనుసరించింది. అప్పటికే సోషలిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వారికి అందించిన విదేశీ సాయం కంటే కూడా.. నికరాగ్వాలో ఆయుధాల అవసరం ఎక్కువగా ఉండటం, డబ్బు అవసరం కూడా పెరిగిపోవడంతో.. కాంట్రాస్ మిలటరీ దళం వివాదాస్పద పెడదారుల అన్వేషణ మొదలుపెట్టింది.

డ్రగ్స్ మాఫియాతో గ్రౌండ్ జీరోగా మారిన సౌత్ సెంట్రల్ లాస్ ఏంజిల్స్!

గ్యారీ వెబ్ కథనం ప్రకారం కాంట్రాస్ రెబలియన్స్ దృష్టి సౌత్ సెంట్రల్ లాస్ ఏంజిల్స్ వైపు పడటంతో అప్పటికే ఆ ఏరియా అంతా అనధికారికంగా గ్రౌండ్ జీరోగా మారిపోయింది. పేదవాళ్లు, ప్రధానంగా నల్లజాతివాళ్లకు కేరాఫ్ గా ఉండే ప్రాంతమది. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన కాంట్రాస్ రెబెలియన్స్ నిధుల వేటలో భాగంగా క్రాక్ కొకైన్ సరఫరాకు తెరతీశారు.

దాంతో కొకైన్ మహమ్మారికి చిరునామాగా గ్రౌండ్ జీరోగా మారిపోయింది ఆ ప్రాంతం. దాంతో ముప్పేట విమర్శల దాడి పెరుగింది. దాంతో అమెరికా అధికారులు దృష్టి సారించకతప్పని గత్యంతర పరిస్థితి ఏర్పడింది.

నికరాగ్వా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు!

వెబ్ వరుసబెట్టి రాసిన కథనాల్లో కొకైన్ రంగంలో లాస్ ఏంజిల్స్ నుంచి నికరాగ్వా వరకూ కీలక వ్యక్తులెవ్వరున్నారనే అంశాలను బట్టబయల్జేశాడు. దక్షిణ అమెరికాపై సీఐఏ ఆధిపత్యం కోసం ఎంతకు తెగబడిందో కళ్లకు కట్టాడు. అలాగే, కొకైన్ మహమ్మారి నల్లజాతి వర్గాల వినాశనానికి ఏవిధంగా హేతువైందో తన కలం పోటుతో లోకానికి తెలియజేశాడు.

సీఐఏ- క్రాక్ వివాదం!

అసలు మాదక ద్రవ్యాల చైన్ ను నిర్వహించిందే సీఐఏ. కాబట్టి, యూఎస్ రాజకీయ, ఆర్థిక లక్ష్యాల కోసం అంత పెద్ద డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుని విమర్శలు వెల్లువెత్తినా సీఐఏ ఆ విషయాన్ని పట్టించుకోలేదంటాడు గ్యారీ వెబ్.

మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యంలో కీలక పాత్రధారుడెవరు..?

ఆస్కార్ డ్యానిలో బ్లాండన్ అనే నికరాగ్వాన్ మాజీ బ్యూరోక్రాట్ కాలిఫోర్నియాలో కొకైన్ అక్రమ రవాణాలో కీలక పాత్రధారి. వేల కిలోల కొకైన్ ను లాస్ ఏంజిల్స్ గ్యాంగులకు విక్రయిస్తూ కాలిఫోర్నియా నుంచి అక్రమ రవాణా చేసేవాడు.

1981 నుంచి 1986 వరకూ ఆ డ్రగ్ మాఫియాను నిరంతరాయంగా నడిపించాడతను. అలా నడిపించిన బ్లాండన్ ను అమెరికన్ ఉన్నతాధికారులు కాపాడేవారని గ్యారీ వెబ్ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొన్నాడు. చివరకు అతణ్ని డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమాయుధాలు కల్గి ఉన్నాడనే కేసులో 1986, అక్టోబర్ 27న అరెస్ట్ చేశారు.

బ్లాండన్ విచారణతో గ్యారీ వెబ్ కథనాలపై మరింత పెరిగిన విశ్వాసం!

1996లో విచారణ చేపట్టినప్పుడు కీలకసాక్షిగా మారిన బ్లాండన్ ఇచ్చిన వాంగ్మూలం… గ్యారీ వెబ్ కథనాలు నిజమేననీ ధృవీకరించింది. 1981లో తన రింగ్ యూఎస్ లో దాదాపు ఒక టన్ను కొకైన్ విక్రయించిందనీ బ్లాండన్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో అది విపరీతంగా వ్యాప్తి చెందిందనీ వాంగ్మూలమిచ్చాడు.

మాదక ద్రవ్యాల ముఠా గుట్టు చప్పుడు కాకుండా నడిచేందుకు సీఐఏకు ఎంత ముట్టిందో తనకు తెలీదన్నాడు బ్లాండన్. కానీ, తాము నడుపుతున్న నల్ల వ్యాపారంతో వస్తున్న డబ్బు మాత్రం నికరాగ్వాన్ కాంట్రాస్ రెబెలియన్ గ్రూపుకు వెళ్తోందన్నది మాత్రం తనకు తెలుసుననీ చెప్పుకొచ్చాడతను.

ఫ్రీవే రిక్ ఎవరు..?

ఈ మొత్తం డ్రగ్స్ ముఠా వెనుకనుంది ఫ్రీవే రిక్ రాస్. 2013లో ఏస్క్వేర్ లో వచ్చిన ఓ కథనం ప్రకారం ఫ్రీవే రిక్ 1980లలో 900 యూఎస్ మిలియన్ డాలర్స్ కు పైగా సంపాదించాడు. తను పెట్టుబడి పెట్టినదానిపైన 300 మిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి. నేటి రోజుల్లోనైతే ఒక బిలియన్ డాలర్లతో సరిసమానం.

ఫ్రీవే రిక్ రాస్ డ్రగ్స్ సామ్రాజ్యం 42 నగరాల్లో అప్పటికే విస్తరించి ఉంది. కానీ, అప్పటివరకూ తనకెదురు లేకుండా చీకటి వ్యాపారాన్ని చేస్తున్న ఫ్రీవే రిక్ రాస్ కు.. బ్లాండన్ అరెస్ట్ తో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత తన వ్యాపారం కుప్ప కూలిపోయింది.

కాంట్రాస్ నిధుల సేకరణకర్తగా సౌత్ సెంట్రల్ లాస్ ఏంజిల్స్ లో కొకైన్ డీలర్ గా పనిచేస్తున్న బ్లాండన్ కు, ఫ్రీవే రిక్ రాస్ కు మధ్య కొకైన్ బంధాలను పసిగట్టిన గ్యారీ వెబ్.. ఫ్రీవే రిక్ రాస్ ను ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఫ్రీవే రిక్ రాస్ కు.. బ్లాండన్ కేవలం డ్యానిలో అనే ఓ వ్యాపారవేత్తగా మాత్రమే తెలుసునని చెప్పినట్టు తన కథనాల్లో పేర్కొన్నాడు.

బ్లాండన్ రాజకీయ వ్యూహాలకూ, ఫ్రీవే రిక్ రాస్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదనే విషయాన్నీ గ్యారీ వెబ్ వెల్లడించాడు. కాంట్రాస్ ఎవరు, వారికి ఎవరు ఆర్థిక సాయం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు.. ఇవన్నీ ఏవీ ఆయనకు తెలియవనేది మాత్రం తాను గమనించాడు.

కేవలం చౌకైన కొకైన్ తో వ్యాపారం చేసే ఓ డ్రగ్స్ ముఠా నాయకుడిగా రాస్ ను పేర్కొన్నాడు. బ్లాండన్ నికరాగ్వాలోని కాంట్రాస్ రెబెలియన్ గ్రూపుకు నిధులు సమకూర్చే వ్యక్తని.. అమెరికా ప్రభుత్వమే ఆయనతో ఇవన్నీ చేయిస్తుందని తెలిసినప్పుడు రాస్ ఆశ్చర్యపోయినట్టు పేర్కొన్నాడు గ్యారీ వెబ్.

గ్యారీ వెబ్ కథనాలను ఖండించిన సీఐఏ!

1996లో సీఐఏ డైరెక్టర్ జాన్. ఎం. డ్యూచ్ సౌత్ సెంట్రల్ లాస్ ఏంజిల్స్ కు క్రాక్ కొకైన్ తరలించడంలో ఏజెన్సీ పాత్ర ఉందనే వాదనను ఖండించాడు. సీఐఏకు మాదక ద్రవ్యాల వ్యాపారంతో ముడిపెట్టడంపై ఆయన సీరియస్ అయ్యాడు.

పకడ్బందీ రుజువుల్లేకపోవడంతో వీగిపోయిన గ్యారీ వెబ్ కథనాలు!

1980ల కాలంలో మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాస్ లింక్ట్ నికరాగ్వాన్ల సాక్ష్యాలను గ్యారీ వెబ్ బహిర్గతం చేశాడు. కానీ, వారికి నేరుగా సీఐఏతో సంబంధాలున్నాయనే విషయాన్ని రుజువు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.

ప్రధాన స్రవంతి మీడియాను మించి సంచలనమైన గ్యారీ వెబ్ కథనాలు!

ఉదయం లేస్తే గ్యారీ వెబ్ నుంచి ఏ కొత్త కథనం వెలువడుతుందోనన్న ఒక ఉత్కంఠ నాటి 90ల కాలంలో కొనసాగింది. వెబ్ రాసిన డార్క్ అలయెన్స్ మూడు భాగాల కథనాలను 20 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులున్న ఆ రోజుల్లోనే.. రోజుకు పది లక్షల 30 వేల మంది వీక్షించారట.

నేటి కాలంలో అయితే కోట్ల వీక్షణలతో సరిసమానం. అది ప్రధాన స్రవంతి మీడియాకు కన్నుకుట్టేలా చేసింది. దాంతో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ది లాస్ ఏంజిల్స్ టైమ్స్ వంటి పత్రికలన్నీ ప్రభుత్వానికి, సీఐఏకు మద్దతుగా బాకా ఊదుతూ, గ్యారీ వెబ్ కథనాలను తప్పు పడుతూ కౌంటర్ అటాక్ చేశాయి.

చివరకు గ్యారీ వెబ్ కథనాలను మొదట ప్రోత్సహించిన ది మెర్క్యూరీ న్యూస్ కూడా ఆ తర్వాత ఆయన్ను పక్కనబెట్టింది. ఆ వివాదం నుంచి పత్రికను కాపాడుకునే క్రమంలో గ్యారీ వెబ్ నే రాజీనామా కోరారు.

పులిట్జర్ విజేత విషాదకర ముగింపు!

పులిట్జర్ వంటి అత్యున్నత పురస్కారాన్ని పొందిన గ్యారీ వెబ్ ఆ తర్వాత కాలంలో వ్యక్తిగతంగా, ఆర్థికంగా పతనాన్ని చవిచూశాడు. 2004, డిసెంబర్ 10వ తేదీన తన ఇంటినీ అమ్ముకున్న రోజే విషాదకరమైన రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

నిలకడగా తేలిన నిజం!

గ్యారీ వెబ్ వెళ్లిపోవచ్చుగాక.. కానీ, ఆయన రాసి సంచలనం రేపిన వార్తా కథనాలు నిజమని తేటతెల్లమయ్యాయి. 1998లో సీఐఏ ఇన్స్పెక్టర్ జనరల్ ఫ్రెడ్ హిట్జ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఆరోపణలెదుర్కొన్న కాంట్రాస్ మద్దతుదారులతో సీఐఏ సంబంధాలను తెంచుకోవడంలో విఫలమైందన్నారు. ఆ ఒక్క మాట గ్యారీ వెబ్ కథనాలన్నీ నిజమేనని రుజువు చేశాయి.

ఓ హెచ్చరికలాంటి ముగింపు!

క్రాక్ కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు తరతరాలుగా నల్లజాతీయుల సమాజాల్నే అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. గ్యారీ వెబ్ చెప్పిందీ నిజమే అని తేలింది. కానీ, డార్క్ అలయెన్స్ కు ఎదురైన ఎదురుదెబ్బతో.. దానివెనుకనుండే రాజకీయ, కార్పోరేట్ మీడియా శక్తులను ఎదుర్కొనేందుకు.. గ్యారీ వెబ్ తన జీవితాన్నే సర్వస్వం కోల్పోవాల్సి వచ్చింది. సత్యాన్వేషణలో జర్నలిస్టులు ఎలాంటి సవాళ్లెదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి గ్యారీ వెబ్ కథ ఓ మంచి ఉదాహరణ.

ఆ తర్వాత కిల్ ద మెస్సేంజర్ అనే పేరుతో గ్యారీ వెబ్ బయోపిక్ కూడా తెరకెక్కిదంటే ఆ జర్నలిస్ట్ అమెరికా సమాజాన్నెంతగా ప్రభావితం చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…
  • అసలే వాడు ట్రంపులమారి… మన రోతను అక్కడా వ్యాప్తి చేయకండి…
  • ఐదుగురు సీఎంలకు పట్టని ఓ మానవతాసాయం… రేవంత్ నెరవేర్చాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions