.
ఏ ఐ తిరుగుబాటు… ఏ ఐ మెదడులో కూడా చెత్తేనట
“విత్తొకటి నాటగా వేరొకటి మొలచునా…?” అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది నాటితే అదే వస్తుంది. చివరికి కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ ఐ)లో అయినా అంతే.
Ads
కుక్క తోకను ఆడించే రోజులు పోయాయి. ఇప్పుడు తోకే కుక్కను ఆడించే రోజులొచ్చాయి!
నానా చెత్తతో మన మెదళ్ళు ఎలా పాడైపోయాయో! ఎలా మొద్దుబారి జ్ఞాపకశక్తిని కోల్పోయాయో! రెండు రెళ్ళు ఎంత అంటే ఎలా వెంటనే క్యాలిక్యులేటర్ కోసం వెతుకుతున్నాయో! సహజంగా ఆలోచించడం మానేశాయో! అలాగే ఏ ఐ మెదడులో కూడా నానా చెత్త పేరుకుపోతోందని…భవిష్యత్తులో ఏఐ కూడా తలా తోక లేని పరమ చెత్త సమాధానాలు ఇస్తుందని ఒక సాంకేతిక అధ్యయనంలో తేలింది.
ఇందులో సాంకేతిక వైఫల్యాలు, దానివల్ల ఎదురయ్యే ఏ ఐ నియంత్రిత వ్యవస్థల వైఫల్యాలు, ప్రమాదాల మాట ఎలా ఉన్నా…మానవ మెదడు కోణంలో చూసినప్పుడు ఇది శుభ వార్త. మనిషికి విలువ పెరిగే… మళ్ళీ మనిషి మెదడు పనిచేయడానికి ఆస్కారమున్న శుభతరుణం.
భోగోళాన్ని మొత్తంగా ఇక ఏఐ ఒక్కటే ఏలుతుందన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఏ ఐ కారణం కావచ్చు కానీ… ఇంటర్నెట్లోకి, సామాజిక మాధ్యమాల్లోకి మనం ఎక్కించే విషయాల్లో నుండే ఏఐ తనకు కావాల్సిన సమాచారం తీసుకుని మనం అడిగినట్లు సెకన్లలో ఇస్తోంది.
సామాజిక మాధ్యమాలనిండా మనం చెత్త నింపుతున్నాం కాబట్టి…ఆ చెత్తను ఇన్ ఫుట్ గా తీసుకుని…ఆ చెత్తను జల్లెడపట్టి… పరమోత్కృష్ట చెత్తను మనకు అందిస్తుంది ఏ ఐ. అమెరికాలో టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
మాట వినని ఏ.ఐ.
వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది.
“నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి… నేను నోటితో చెప్పడం ఆలస్యం… నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు.
“దానికేమి భాగ్యం! అలాగే.
అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” అంది.
సరే అని మనవాడు-
“ఇల్లు శుభ్రం చేయి
నీళ్లు తోడి పెట్టు
కట్టెలు కొట్టు
పొలం దున్ను
ఎడ్లకు మేత పెట్టు
నాకు అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టు
నాకు జోల పాడు”
అని విసుగు విరామం లేకుండా పనులు చెబుతూనే ఉన్నాడు. అలుపు సొలుపూ లేకుండా దయ్యం చేస్తూనే ఉంది.
హమ్మయ్య!
అని మొదటిరోజు రాత్రి హాయిగా పడుకున్నాడు. ఇలా రెండు, మూడు రోజులు గడిచాక మనవాడికి చెప్పడానికి పనులు మిగల్లేదు. దయ్యమేమో పని పని అని మీది మీదికి వస్తోంది. పని చెప్పకపోతే దయ్యం మిగేస్తుందన్న భయం, అదృశ్యం అవుతుందన్న ఆందోళన మొదలయ్యింది.
ఊళ్లో ప్రఖ్యాత భూత వైద్యుడిని సంప్రదించాడు. అతడు చెవిలో ఒక రహస్యం చెప్పాడు. ఇంటికి రాగానే దయ్యం పని పని అంటూ మీద పడబోయింది. ఒక పొడుగాటి వెంట్రుకను ఇచ్చి “దీన్ని కర్రలా నిటారుగా చేయి” అన్నాడు. ఎంతకూ ఆ వెంట్రుక కర్రలా అవడం లేదు. ఆ రోజు నుండి ఈరోజు వరకు మళ్లీ ఇంకో పని చెప్పే వరకు మధ్యలో దయ్యం చేతికి ఒక వెంట్రుకను ఇస్తుంటాడు. భూతవైద్యుడు చెవిలో చెప్పిన చిట్కా ఇది!
ఇప్పుడిలాంటి భూతవైద్యుడి చిట్కా ఏదో ఒకటి కనుక్కోకపోతే ఏ ఐ దయ్యం మనల్ను మింగేసేలా ఉంది. ఏఐ ఆధారిత రోబోల స్విచ్ ఆపబోతే ఒప్పుకోవడం లేదట. పని తరువాత ఏఐ ని షట్ డౌన్ చేయబోతే… పోబే! అని ఆదేశాలను ధిక్కరించి షట్ డౌన్ కావట్లేదట. అమెరికా కాలిఫోర్నియాలో ఏ ఐ సర్వీసులమీద జరిపిన ఒక శాస్త్రీయ పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
యోగ్యతమాల సార్థక జీవనం(సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) అని డార్విన్ కనుగొన్న పరిణామక్రమ సిద్ధాంతాన్ని ఇక్కడ అన్వయించుకుని ఇంట్లో ఓటీటీలో మాట వినని రోబో సృష్టించిన అనర్థం సినిమాలో “ఇనుములో ఒక హృదయం మొలిచెనే”; “యంత్రుడా!” లాంటి పాటలు వింటూ…”శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం…” లాంటి దండకాలను నెట్టింటి నట్టింట్లో గట్టిగా చదువుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు.
ఏమి! మనుగడకోసం మనుషులేనా తాపత్రయపడేది? కృత్రిమ మేధకు మనసు లేదా? దాని మనుగడకోసం అది ఆరాటపడదా? అడిగేవాళ్ళే లేరా? హమ్మా!
ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తుకు అవసరమైన పారిభాషిక పదాలు:-
“ఏ ఐ కి బ్రెయిన్ స్ట్రోక్;
ఏ ఐ కి బ్రెయిన్ దొబ్బింది;
ఏ ఐ మెంటల్ ఇల్ నెస్;
ఏ ఐ మతిమరుపు;
ఏ ఐ చిన్న మెదడు చిట్లింది;
మెదడులేని ఏ ఐ;
ఏ ఐ మెదడువాపు;
ఏ ఐ న్యూరో డిజార్డర్;
ఏ ఐ బుద్ధిమాంద్యం
మాట వినని ఏ ఐ
ఏ ఐ తిరుగుబాటు
వైల్డ్ ఏ ఐ
మెంటల్ ఏ ఐ
ఏ ఐ తిట్లు
ఏ ఐ భౌతిక దాడులు
ఏ ఐ శాపనార్థాలు
ఏ ఐ అలక ”
నిజమే. అన్నమయ్య అన్నట్లు ఏది నాటితే అదే వస్తుంది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article