.
Rochish Mon …. రుబాయీ (పుంసత్వంతో)
———-
కనీసం ‘రుబాయీ’ అని అనడం కూడా ‘చాతకాని’ (రుబాయి అనడం చదువులేమి) తెలుగు నపుంసకత్వం వల్లా, రుబాయీ అంటూనూ, రుబాయి అంటూనూ ఏదో, దేన్నో రాస్తున్న తెలుగు నపుంసకత్వం వల్లా తెలుగులో రుబాయీ అన్న ప్రక్రియ పూర్తిగా వికారమైపోయింది; విదూషకత్వం అయిపోయింది.
Ads
“నేను ఏదో రాసి దాన్ని రుబాయీ అంటాను” అని సిగ్గులేకుండా బహిరంగంగా చెప్పుకున్న పెన్నా శివరామకృష్ణ (ఇతడి ఆ ఉవాచ స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది) వంటి పీహెచ్.డీ. మేధావులు ఉన్న తెలుగులో 29/10/25న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని ‘చదువు అబ్బని పీహెచ్.డీ. మేధావులు’ ఏనుగు నరసింహారెడ్డి రాసిన ‘తెలంగాణ రుబాయి’ లకు పురస్కారం ఇస్తున్నారట.
తెలుగు కవిత్వం ఏ దుస్థితిలో ఉందో, తెలుగు కవులకు, సాహితీ వేత్తలకు ఏ మేరకు చదువు లేదో, ఉండదో ఈ పురస్కారం గట్టిగా తెలియజేస్తోంది.
అసలు ‘తెలంగాణ రుబాయిలు’ అనడమే వికారం. ప్రపంచంలో ఇరాన్ రుబాయీలు, ఇరాక్ రుబాయీలు, సింద్ రుబాయీలు, బలూచీస్తాన్ రుబాయీలు, పంజాబ్ రుబాయీలు అని రాలేదు. ఒక్క మన తెలుగులోనే తెలంగాణ రుబాయిలు వచ్చాయి. ఆ వికారానికి పురస్కారం అట. చదువులేమి మాత్రమే కాదు, సిగ్గులేమి కూడా ఈ పురస్కారం.
తెలుగు కవిత్వానికి పతనావస్థ ఇది.
ఒక విదేశీ ప్రక్రియకు ప్రాంతీయత బురద పూసిన ఏకైక జాతి తెలుగు జాతి! తెలుగులో తెలంగాణ గజళ్లు కూడా వచ్చాయి. తెలుగు కవి మెదడు ఏ మేరకు చితికిపోయిందో తెలియజేసే పరిణామం ఇది.
రుబాయీ అన్నది మన వృత్తంలాగా పూర్తిగా ఛందోబద్ధమైనది. నాలుగు వాక్యాల్లో ఏదో రాసేస్తే అది రుబాయీ అవదు. తెలుగులో రుబాయీలు అని వస్తున్నవి రుబాయీలు కానేకావు.
తెలంగాణ రుబాయిలు అన్న విదూషకపు రచనల్లో కనీసం కాఫియా కూడా లేనివి ఉన్నాయి. అసలు తెలుగే సరిగా లేని వాక్యాలు కూడా ఉన్నాయి.
నిజమైన రుబాయీలు, పుంసత్వపు రుబాయీలు, చదువు, సిగ్గు ఉన్న రుబాయీలు ఇలా ఉంటాయి… గమనించండి
రుబాయీలు (రుబాయియాత్)
1
లోకాన్ని మతం సర్పం కాటేస్తున్నది;
దేశాన్ని కులం ఖడ్గం చీల్చేస్తున్నది;
మూగింది జనంపై మూర్ఖత్వం చీకటి
ప్రాణాల్ని మదోన్మాదం తీసేస్తున్నది.
***
బహ్ర్: మఫ్ఊలు మఫాయీలున్ మఫ్ఊలున్ ఫఅ. (షజ్ర-ఎ-అఖ్రబ్)
2
నీ వక్రతతో భాషను చంపద్దు కవీ,
నీ కుళ్లును మా కళ్లకు కొట్టద్దు కవీ,
నీ నీచపుతత్త్వం ఇలకే హాని కరం
నీ చెడ్డతనం ఎవ్వరికీ వద్దు కవీ.
***
బహ్ర్: మఫ్ఊలు, మఫాయీలు మఫాయీలు, ఫెఅల్. (షజ్రయే అఖ్రబ్)
3
నాలోలో నీ భావం నర్తిస్తున్నది;
ఆ భాగ్యం మౌనంలా వ్యాపిస్తున్నది;
నీ ధ్యానం సర్వస్వం ఈ నా జన్మకు-
నా స్వాంతం నీ కోసం శ్వాసిస్తున్నది.
***
బహ్ర్:
మఫ్ఊలున్, మఫ్ఊలున్, మఫ్ఊలున్, ఫఅ. (షజ్రయే అఖ్రమా)
4
సంఘంలో జీవనం భయంగా ఉన్నది;
స్వాంతంలో దుర్గుణం బలంగా ఉన్నది;
రోచిష్మాన్, తప్పవా అపాయం, దుర్గతి?
వ్యక్తుల్లో దుర్మదం మతంగా ఉన్నది.
బహ్ర్: మఫ్ఊలున్, ఫాయిలున్, మఫాయీలున్, ఫఅ. (షజ్ర – ఎ – అఖ్రబ్)
ఇవి శాస్త్రీయమైన అరబీ బహ్ర్ లలో ఉర్దూ, ఫార్సీ స్థాయి సిసలైన రుబాయీలు; పుంసత్వపు రుబాయీలు (రుబాయియాత్). రుబాయీలు, రుబాయిలు అంటూ తెలుగులో చెయ్యబడుతున్న నపుంసక, విదూషకపు రచనలు కావు అని సవినయంగా తెలియజేస్తున్నాను.
తెలుగులో పుంసత్వం, చదువు, సిగ్గు ఉన్న కవులు, సాహితీ వేత్తలు, పీహెచ్.డీ.ల వాళ్లూ ఉన్నారా? ఉండరా?
రోచిష్మాన్
9444012279
Share this Article