.
ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది లిక్కర్ కు సంబంధించిన విషయం కాబట్టి పరిభాషలో, భావంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే విశాల ద్రవహృదయంతో అనుభవరాహిత్యంగా, అభినివేశరాహిత్యంగా అర్థం చేసుకోగలరు.
తెలంగాణాలో మద్యం దుకాణాలకు బాధ్యతగల ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా తీసిన లాటరీల్లో దుకాణాలు వచ్చినవారి కళ్ళల్లో ఆనందాన్ని ఇన్నేళ్ళల్లో ఎప్పుడూ లేనంతగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాకూడా అత్యంత ఉత్సాహంగా పోటీలుపడి రిపోర్ట్ చేసింది.
Ads
ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురికి దుకాణాలు దక్కడం, ఆదర్శ భార్యాభర్తలు ఇద్దరికీ భరోసాగా దుకాణాలు దొరకడం, తండ్రీకొడుకులు ఇద్దరికీ, అన్నాదమ్ములు ఇద్దరికీ… ఇలా మద్యం దుకాణాలు దక్కడంపై క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన స్థాయిలో వార్తలు ఇచ్చారు.
లాటరీలో మద్యం షాపులు దొరికినవారు కూడా పూర్వజన్మల పుణ్యం కొద్దీ దొరికినట్లు, జన్మ ధన్యమైనట్లు చక్కగా, బుద్ధిగా, గర్వంగా, ఉత్సాహంగా మీడియా మైకుల ముందు మాట్లాడుతున్నారు. సమాజంలో వస్తున్న, వచ్చేసిన మార్పుకు ఇది ప్రత్యక్ష సంకేతం.
ఇందులో బాగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. గృహిణులున్నారు. అమ్మమ్మలున్నారు. తాతలున్నారు. ఇందులో తాము తాగకుండా ఎదుటివారిచేత తాగించేవారు కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి మద్యాన్ని ప్రభుత్వం ఒక ఆదాయవనరుగా చూసినట్లే బాధ్యతగల కుటుంబాలు కూడా ఒక ఆదాయవనరుగా మద్యం వ్యాపారంలోకి దిగి ఉండవచ్చు.
“తాటి చెట్టు ఎందుకెక్కావురా? అంటే దూడకు గడ్డికోసం అన్నాడట!”
“పాత సీసాలో కొత్త సారా”
“అసలే కోతి…ఆపై కల్లు తాగింది…చాలదన్నట్లు నిప్పు తొక్కింది”
“తాగినోడి మాటలకు విలువేముంది?”
లాంటి మద్యసంబంధ సామెతలు, వాడుక మాటలు ఇక్కడ అనవసరం.
ప్రేమ్ నగర్లో ఆత్రేయ చెప్పినట్లు “బాధలన్నీ బాటిల్లో ముంచేసేయ్…అగ్గిపుల్ల గీచేసేయ్…నీలో సైతాన్ తరిమేసేయ్!”
ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు ఇళ్లల్లో చర్చ ఇలా ఉండవచ్చు:-
# ఏమి వదినా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
ఏమీ లేదమ్మా. నిన్నటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఎదురింట్లో ముగ్గురే ఉంటే ముగ్గురికి లాటరీలో లిక్కర్ షాపులు వచ్చాయి. మా ఇంట్లో అరుగురుంటే ఒక్కటికూడా రాలేదు. ఏ మొహం పెట్టుకుని వీధిలోకి పోగలను చెప్పు.
# నిజమే వదినా. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అన్నట్లు పిల్లొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్లు మా కొత్తకోడలు ఇంట్లో కాలుపెట్టింది. ఆమె పేరుతో లాటరీలో లిక్కర్ షాపు వచ్చింది. అది చెప్పి పోదామని వచ్చాను…
ఇవతల మనిషి స్పృహ దప్పి పడిపోయింది. ఆ సమయానికి టీ వీ లో ఒకే ఇంట్లో లాటరీలో ఐదుగురికి దొరికిన లిక్కర్ షాపుల మీద లైవ్ చుక్కల డిబేట్ మొదలయ్యింది!
ఈ విశ్వమంతా బిందు స్వరూపం. బిందువు విస్తరణే భూగోళం. విశ్వమంతా ఇప్పుడు బిందువుల దగ్గరే తచ్చాడుతోంది. ఆ చుక్కలే ఎన్నెన్నో మొక్కుల ఫలంగా ఈ లాటరీలో చిక్కిన చక్కని చుక్కలు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article