Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!

October 29, 2025 by M S R

.

గ్రేట్ నికోబార్… పేరు ఎప్పుడైనా విన్నారా..? కేంద్రం చేపట్టిన ఓ బృహత్ ప్రాజెక్టు ఇది… పర్యావరణానికి తీవ్ర హాని చేస్తుందనీ, ఆపేయాలని 70 మంది మేధావులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు లేఖ రాశారు… అవునవును, వాళ్లు నిజమే చెబుతున్నారని కాంగ్రెస్ మేధావి జైరాం రమేష్ వత్తాసు…

వాళ్ల అభ్యంతరాల్లో ముఖ్యమైనవి… 1) ఇది వనరుల దోపిడీ… 2) పర్యావరణ నష్టం… 3) సామాజిక విపరిణామాలు… 4) నిబోబారిస్, షోంపేన్ వంటి సున్నితమైన ఆదివాసీల మనుగడకు ప్రమాదం… 5) ప్రకృతికి శాశ్వత నష్టం…

Ads

  • ఆమధ్య వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటుపై బీఆర్ఎస్ క్యాంపు గగ్గోలు పెట్టింది కదా… వందల జాతుల అంతర్దానం, లక్షల ఎకరాల్లో చెట్ల నరికివేత, వందల ఆయుర్వేద మూలికల గల్లంతు, రేడియేషన్‌తో తీవ్ర విధ్వంసం ఎట్సెట్రా… మరి అంతకుముందు ఇలాంటి టెక్నాలజీతో నిర్మించిన నేవీ రాడార్‌తో ఏమీ కాలేదు కదా అనే ప్రశ్నకు ఒక్కడి దగ్గరా సమాధానం లేదు, పైగా ఆ నేవీ రాడార్‌కు అనుమతి ఇచ్చిందే కేసీయార్…
  • .

    ఇప్పుడు గ్రేట్ నికోబార్ ఆందోళనలు కూడా అదే రీతిన ఉన్నట్టు అనిపిస్తోంది… బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలి అనే భావజాలంలోనే బతికే కేరక్టర్లు మాత్రమే, దీన్ని బీజేపీ కోణంలో మాత్రమే చూస్తూ, దేశానికి అవసరం అనే ధ్యాసను వదిలేశారు… జాతిహితం అనే కోణమే పట్టని శుష్క వాదాలు…

    అసలు ఏమిటి ఈ గ్రేట్ నికోబార్… 81 వేల కోట్లతో అండమాన్, నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ద్వీపంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇది… ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును నీతి అయోగ్ రూపకల్పన చేసింది… అందులో ఉండేవి…

    అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ (ICTT)….: గలతియా బే వద్ద లోతైన సముద్ర పోర్టు నిర్మాణం…

    గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం…: పౌర మరియు సైనిక (Dual-use) అవసరాల కోసం విమానాశ్రయం….

    టౌన్‌షిప్….: నివాస, వాణిజ్య పట్టణం…

    పవర్ ప్లాంట్… 450 MVA సామర్థ్యం గల గ్యాస్-సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్…


    లక్ష్యాలు, అవసరం… ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి…

    సముద్ర భద్రత…: మలక్కా జలసంధికి (Malacca Strait) కేవలం 90 కిలోమీటర్ల దూరంలో గ్రేట్ నికోబార్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో భారతదేశం తన నావికా భద్రతను, నిఘా సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోగలదు… నేవీ- ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త కేంద్రం ఏర్పాటు కాబోతోంది… ఇది దేశ భద్రతకు వ్యూహాత్మక ప్రయత్నం…

    చైనా విస్తరణకు అడ్డుకట్ట…: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా సైనిక, వాణిజ్య ప్రభావానికి దీటైన జవాబు ఇవ్వడానికి, చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ (String of Pearls) వ్యూహానికి ప్రతిస్పందనగా ఇది ఉపయోగపడుతుంది… (ఇప్పుడు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గ్రూపులన్నీ చైనా ప్రభావితమే… చైనా అనుకూలమే…)

    సైనిక మౌలిక సదుపాయాలు…: సైనిక అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌లు, జెట్టీలు, నిఘా కేంద్రాలను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది…

    ఆర్థిక ప్రాముఖ్యత …. 

    గ్లోబల్ హబ్….: మలక్కా జలసంధి గుండా జరిగే ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25% కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ జరుగుతుంది… ఈ పోర్టు ద్వారా సింగపూర్ వంటి అంతర్జాతీయ పోర్టులతో పోటీ పడి, ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది…

    సామాజిక-ఆర్థిక అభివృద్ధి…: ఈ ద్వీపం సామాజిక-ఆర్థిక పురోగతికి, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది…

    ప్రాజెక్టు ఖర్చు, పురోగతి ….

    పురోగతి…: ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభ దశలో ఉంది (Under Construction)… మొదటి దశ 2028 నాటికి పూర్తవుతుందని అంచనా…

    అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు (ICTT) కోసం INR 41,000 కోట్ల బిడ్లు ఖరారయ్యాయి… మొత్తం ప్రాజెక్టు 2050 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది…

    వ్యతిరేకత, ప్రధాన అభ్యంతరాలు ….

    పోర్టు నిర్మాణం కోసం గలతియా బే తీరం వద్ద లెదర్ బ్యాక్ తాబేళ్లు గుడ్లు పెట్టే సున్నితమైన ప్రాంతాల్లో తవ్వకాలు, డ్రెడ్జింగ్ జరగడం వల్ల రోరల్ రీఫ్‌లు, సముద్ర పర్యావరణ దెబ్బతింటుంది… దాదాపు 10, 15 లక్షల చెట్లు నరుకుతారు… దీంతో అద్భుతమైన జీవ వైవిధ్యం దెబ్బతింటుంది… 20 హెక్టార్ల మడ అడవులు నాశనం అవుతాయి… నిజానికి అండమాన్ నికోబార్ దీవుల్లో అసలు ఇప్పటికీ మనిషి వెళ్లనివే సగానికి పైగా… పైగా ఇప్పుడు చెప్పే అభ్యంతరాల్నీ భూతద్దంలో, దురుద్దేశపూరితమని కేంద్రం చెబుతోంది…

    ఇది షోంపెన్,, నికోబారీస్ వంటి  బలహీనమైన గిరిజన సమూహాల (Particularly Vulnerable Tribal Groups – PVTGs) యొక్క జీవన విధానానికి, మనుగడకు ప్రమాదం కలిగిస్తుంది… బయటి వ్యక్తుల వలస వల్ల వీరికి అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, దీనికి వారిలో రోగనిరోధక శక్తి ఉండదు… అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనుల అనుమతి తీసుకోకుండానే అటవీ భూమిని మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి… నిజానికి బయట ప్రపంచానికి దూరంగా ఉంచేయడం వల్లే ఆ జాతుల మనుగడ ప్రమాదంలో పడింది… మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చి, ఈ ప్రాజెక్టులో సరైన ఉపాధి కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన…

    గ్రేట్ నికోబార్ ద్వీపం అత్యంత భూకంప ముప్పు ఉన్న ప్రాంతంలో ఉంది… ఇక్కడ ఇంత భారీ మౌలిక సదుపాయాలు నిర్మించడం వలన భవిష్యత్తులో సునామీలు, భూకంపాల వంటి విపత్తుల సమయంలో పెట్టుబడులు, ప్రజలు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది… శాస్త్రీయ అధ్యయనం ప్రకారం ఆ ముప్పేమీ లేనట్టు కేంద్రం చెబుతోంది…

    ఎటొచ్చీ అసలు ఈ దేశానికి ప్రమాదం చైనా చెప్పినట్టు నడిచే రాజకీయ, మేధో శక్తులతోనే… గ్రేట్ నికోబార్‌పై వ్యతిరేకత కూడా అదే..!! ఇది ఏ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీయో కాదు చేపట్టేది… కేంద్ర ప్రభుత్వం..!!

     

    Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • జాన్వి స్వరూప్..! నో, శ్రీదేవి వారసురాలు కాదు… మంజుల వారసురాలు…!!
    • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
    • ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?
    • లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…
    • మామా ఏక్ పెగ్‌లా… లాటరీలలో చిక్కిన చక్కని కిక్కు చుక్కలు!
    • బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్..! మీలో చేరిన పోక్సో కేరక్టర్ కథేమిటి కేటీయార్..?!
    • రుబాయీకి ఓ పద్ధతి, ఓ సొగసు ఉంటయ్… అవహేళన చేయకండి దాన్ని..!!
    • పగ రాజకీయాలు..! రేవంత్ రెడ్డిని చూసి కవిత నేర్చుకోవాలి కొన్ని..!!
    • యూట్యూబ్ స్టార్ హీరోయిన్ నాగదుర్గ… ఇప్పుడిక తమిళ ఇండస్ట్రీలోకి…
    • ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు సాడే సాత్ శని..!!

    Archives

    Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions