.
ఎక్కడో ఏదో సెర్చుతుంటే… నటి రేవతికి సంబంధించిన ఓ ఫోటో, కథనం కనిపించాయి.., ఆ ఫోటోలో ఉన్నది ఓ అమ్మాయి… ఎవరా పిల్ల..?
తన సొంత బిడ్డే… కానీ దాని వెనుక ఓ చిన్న కథ… ఆమధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా వచ్చింది గుర్తుందా..? అనుష్క శెట్టి, పోలిశెట్టి ప్రధాన పాత్రలు… సింగిల్ మదర్‌గా ఉండటానికి నిర్ణయించుకున్న ఒకామె తనకు నచ్చిన వ్యక్తి నుంచి వీర్యదానం తీసుకోవాలని చేసే ప్రయత్నమే సినిమా కథనం…
Ads
ఇప్పుడంటే ఐవీఎఫ్, సరోగసీ, సింగిల్ మదర్ … ఇవన్నీ కామన్… కానీ వివ్ రిచర్డ్స్ ద్వారా నీనా గుప్తా బిడ్డను కని, సింగిల్ మదర్‌గా 1989లోనే ప్రపంచానికి పరిచయం చేయడం ఓ సంచలనం… ఇప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ అప్పట్లో అది సెన్సేషన్… బిడ్డ పేరు మసాబా గుప్తా… ఇప్పుడు ఆమె ఫ్యాషన్ డిజైనర్, నటి…
నో భర్త, నో కాపురం… జస్ట్, ఒక బిడ్డ కోసం రిచర్డ్స్ అవసరం… అంతే… రేవతి విషయానికి వస్తే ఆమె కెరీర్ మంచి స్థితిలోకి సాగుతున్నప్పుడు… 20 ఏళ్ల వయస్సులోనే సినిమాటోగ్రాఫర్ సురేష్ చంద్ర మీనన్‌ను పెళ్లి చేసుకుంది… 1986 లో…
పెళ్లయ్యాక కెరీర్‌లో ఒడిదొడుకులు… అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నాననే బాధ… దానికితోడు పిల్లల్లేరనే కారణమో, ఇంకేం కారణాలున్నాయో గానీ 2002 నుంచి విడివిడిగా ఉండసాగారు వాళ్లు… ఎవరి బతుకు వాళ్లదే…
2002 నుంచి ఫ్యామిలీ కోర్టులో సుదీర్ఘమైన జాప్యం తరువాత 2013లో విడాకులు మంజూరయ్యాయి… పరస్పర సమ్మతి ఉన్న కేసుల్లోనూ అధికారికంగా విడాకులు రావడానికి అంత సమయం పట్టింది… ఇప్పటికీ వేలాది జంటలకు ఇదే సమస్య ఫ్యామిలీ కోర్టుల్లో…
మళ్లీ వేరేవాళ్లను అధికారికంగా పెళ్లిచేసుకోలేని అవస్థ… తరువాత రేవతి ఎవరైనా నవజాత శిశువును దత్తత తీసుకోవాలని అనుకుంది… అదీ సాధ్యం కాలేదు… మన అధికారిక వ్యవస్థలో ఈ దత్తత ప్రక్రియ కూడా ప్రొసీజర్ ప్రకారం పెద్ద ప్రయాస… ఇప్పటికీ అంతే… (అందుకే పిల్లల అమ్మకాలు, కొనుగోళ్లు, దళారులు)…
2013లో ఓ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసింది రేవతి… అందరూ దత్తత బిడ్డ అనుకున్నారు, మీడియా అదే రాసింది… వాటికి తెర దించుతూ… బిడ్డ పుట్టిన అయిదేళ్లకు… ఐవీఎఫ్ (వీర్యదాత సహకారం) ద్వారా తనే సొంతంగా (Own Delivery) బిడ్డను కన్నట్టు (నయనతారలాగా సరోగసీ సంతానం కాదు) ప్రకటించింది… జెనెటిక్ మదర్, సింగిల్ మదర్…

‘దేవుడు స్వర్గం నుంచి పంపించిన బహుమతి నా బిడ్డ’ అని చెప్పిన ఆమె తన కూతురు మహి వివరాలు మీడియాలో రావడానికి ఇష్టపడదు… తనెలా పుట్టిందో తప్పక తనకు చెబుతాను, కానీ అవి అర్థం చేసుకునే వయస్సొచ్చాక మాత్రమే చెబుతాను’ అంటోంది రేవతి… విడిపోయిన భర్తతోనూ సత్సంబంధాలే ఉన్నాయి…
అరవై ఏళ్ల వయస్సులోనూ నటిగా, సోషల్ యాక్టివిస్టుగా చురుకుగా ఉంది… మెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (Women in Cinema Collective – WCC) వ్యవస్థాపక సభ్యురాలు… 2017లో ఓ మలయాళ నటిపై జరిగిన దాడి సంఘటన తర్వాత, సినీ పరిశ్రమలో మహిళల భద్రత, లింగ సమానత్వం కోసం పోరాడటానికి ఈ కలెక్టివ్ ఏర్పడింది… మలయాళ సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, వేతనంలో అసమానతలు (Pay Parity), వివక్ష వంటి సమస్యలపై పోరాడటం ఈ సంస్థ లక్ష్యం…
హేమ కమిటీ రిపోర్ట్…: కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ (Hema Committee) నివేదికను విడుదల చేయడంలో, ఆ నివేదికలోని అంశాలపై చర్చ జరపడంలో WCC సభ్యురాలిగా రేవతి కీలక పాత్ర పోషించింది… మంచి నటి, ఐవీఎఫ్ తల్లి, పెళ్లి బాధితురాలు, మహిళా పోరాటాల నాయకురాలు… ఇంట్రస్టింగు లైఫ్ ఆమెది..!!
Share this Article