.
ఎన్నేళ్లయింది రవితేజ హిట్ సినిమా పడక..! నిజానికి తను బాగా అదృష్టవంతుడు టాలీవుడ్‌లో… వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి… అదే రవితేజ… అదే బాడీ లాంగ్వేజ్… అదే మొనాటనీ… అదే రొటీన్ యాక్షన్… అదే కమర్షియల్ పోకడ…
కిందామీదా పడుతున్నా సరే, నిర్మాతలు దొరుకుతూనే ఉన్నారు… ఏవో సినిమాలు చేస్తూనే ఉన్నాడు… ఫక్తు ఓ రొటీన్ తెలుగు సినిమా హీరో… అంతే… ఒకప్పుడు రవితేజ అంటే భిన్నమైన పాత్రలు, వైవిధ్యపు నటన… మంచి నటుడు దొరికాడు ఇండస్ట్రీకి అనుకున్నారు… కానీ సగటు టిపికల్ తెలుగు హీరోగా మిగిలాడు, నటుడు మాయమయ్యాడు…
Ads
కొత్తగా తనకు వెకిలిపాటలు తోడయ్యాయి… మాస్ జాతర సినిమాలో నీయమ్మని, నీయక్కని, నీచెల్లిని అనే రోత పాటను రవితేజ సమర్థించుకున్న తీరు చూస్తే తనపై జాలేసింది… బూతులు ఉంటే తప్పేమిటి అంటాడు… దానికితోడు స్కేలు లేదు, పెన్ను లేదు, కాగితం లేదు, తాళం లేదు, తలుపు లేదు అంటూ ఓ సూపర్ డూపర్ హిట్ అని తనకు తానే జబ్బలు చరుచుకునే పాట ఒకటి…
మాస్ జాతర సినిమాయే సగటు రవితేజ మార్క్ ఉత్త రొటీన్ సినిమా… లెక్కలు ఉంటాయి కదా… హీరో ఇంట్రడక్షన్, అడుగడుగునా ఫుల్లు ఎలివేషన్స్, హీరోయిన్‌తో రోత సాంగ్స్, మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే పంచ్ డైలాగ్స్, తన దందాకు అడ్డొచ్చిన వాళ్ళను కనికరం లేకుండా చంపేసే విలన్, అతడిని అంతం చేసే హీరో – ఇలా! తెలుగు సోకాల్డ్ ఫార్ములా కమర్షియల్ సినిమా అంటే అంతే కదా…
సరిగ్గా అవే లెక్కలతో తీశారు ఈ సినిమాను… వీసమెత్తు కొత్తదనం లేదు కథలో… తను రైల్వే పోలీసు… మంత్రి కొడుకును కొడితే తీసుకుపోయి ఏదో ఏజెన్సీ ఏరియాలో పడేస్తారు… అక్కడ ఓ పెద్ద విలన్ గంజాయి దందాను అడ్డుకుంటాడు… నడుమ యాక్షన్ సీన్లు కథా కమామిషు…
బీజీఎం కూడా ఉత్త మోత… సినిమాలో చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర విలనీ… బాగా చేశాడు… అలాగే శ్రీలీల పాత్ర… రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్ర ప్లస్ డాన్సులు లేకుండా శ్రీలీల పాత్ర ఉండదు కదా… బాగానే చేసింది…
తెలంగాణ యాస నుంచి సడన్‌గా హీరో టర్న్ తీసుకుని మామూలుగా డైలాగులు చెబుతాడు… హీరోయిన్ శ్రీకాకుళం యాసలో డైలాగులు చెబితే, తండ్రి సాధారణంగా మాట్లాడతాడు… విలన్ మాటల్లో మధ్యలో రాయలసీమ యాస తొంగి చూస్తుంది… హేమిటో… అయ్యా, దర్శక మహానుభావా, నీకో దండం… ఆ యాసలు కూడా కృతకమే…
అసలే రోత సాంగ్స్, వాటినీ ఇరికించారు… సందర్భరహితంగా… ఈమధ్య దర్శకులు హీరోల ఫ్యాన్స్‌కు నచ్చితే చాలు అన్నట్టుగా ఫుల్లు ఎలివేషన్లతో నడిపించేస్తున్నారు… కథా తొక్కా తోలూ ప్రజెంటేషన్ ఎట్సెట్రా ఏమీ పట్టడం లేదు… ఇందులో కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు…
సినిమాలో బాగున్నది ఏమిటయ్యా అంటే యాక్షన్ కొరియోగ్రఫీ… కొన్ని ఫైట్ సీన్లు బాగా వచ్చాయి… అంతే… కమాన్, ఎవరయ్యా నెక్స్ట్ నిర్మాత… ఛలో ముహూర్తం పెట్టేసుకుందాం… ఓ ఫార్ములా కథతో రెడీ అయిపో…
చివరగా… ఓ దిక్కుమాలిన పాట ఉంది కదా… రిథం లేదు, పదం లేదు, మన్ను లేదు, మశానం లేదు… అన్నట్టుగా…. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫినాలేకు రవితేజ వస్తున్నప్పుడు డాన్సర్లతో ఈ పాట వేశారు… ఈ సినిమాలోలాగే ఫుల్లు ఎలివేషన్… నవ్వొచ్చింది..!! ఆ పాటలో వినిపించినట్టు… సెన్సు లేదు, కామన్ సెన్సు లేదు..!! ఇక్కడా నీ యయ్య, నీ యవ్వ పాటకు రవితేజతో స్టెప్పులు వేయించారు… ఏం టేస్టురా మీది..!!
Share this Article