.
కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో తొక్కిసలాట… 9 మంది మృతి… పలువురికి గాయాలు… విషాద సంఘటన… కానీ పలుచోట్ల భక్తుల తొక్కిసలాటలు, మరణాల వార్తలు వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం…
ఫలానా పర్టిక్యులర్ డే, పర్టిక్యులర్ ముహూర్తంలో, ఫలానా దేవుడిని దర్శించాలనే అత్యాసక్తి దీనికి ప్రధాన కారణం… గుళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యాలు, నిర్వాకాలు ఈ ప్రధాన కారణం తరువాతే… సరే, ఆ చర్చ ఎప్పుడూ ఉండేదే గానీ… ఈ గుడి నేపథ్యం మాత్రం ఓసారి చదవాలి…
Ads
మన చిల్కూరు బాలాజీ టెంపుల్‌లాగే ఇది ప్రైవేటు గుడి… ప్రభుత్వం పెత్తనం, దేవాదాయ శాఖ ఆధిపత్యం, అధికారుల దాష్టీకాలు ఏమీ లేని గుడి… ఎవరు కట్టారు..? అదీ ఇంట్రస్టింగు…
ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరిముకుంద పండా (97 సం.లు) అకుంఠిత దీక్షకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయం… .అపారమైన ఆధ్యాత్మిక సంకల్పంతో నిర్మించిన ఈ ఆలయం.. పవిత్రమైన ఏకాదశి పర్వదినాన జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనతో విషాదంలో మునిగిపోయింది…
నిర్మాణం వెనుక ఉన్నత సంకల్పం
హరిముకుంద పండా ఆధ్యాత్మిక జీవితంలో పన్నెండేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ ఆలయ నిర్మాణానికి బీజం వేసింది… తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయనకు, ఆలయ సిబ్బంది కారణంగా స్వామిని కనులారా చూడకుండానే వెనక్కి నెట్టేయబడాల్సి వచ్చింది… దీనిపై తీవ్ర మనస్తాపం చెందాడు…
అదే బాధను తన తల్లి విష్ణుప్రియతో పంచుకోగా, ఆ ఆధ్యాత్మికశీలి తల్లి, “నీ స్వామి గుడిని ఇక్కడే నిర్మించుకో, నీ భక్తిని ప్రజలందరూ చూస్తారు… దేవుడినీ దర్శించుకుంటారు” అని సూచించింది… వాస్తు శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న తల్లి ఆదేశం మేరకు, హరిముకుంద పండా ఆలయ నిర్మాణానికి ఉపక్రమించాడు…..
(Photo Credit BBC)
- నిర్మాణ విశేషం: పలాస నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లకు పైగా సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు… వాళ్లకు దాదాపు వంద ఎకరాలుంటే, 12 ఎకరాల తన వాటా భూమిని ఆ తల్లి రాసిచ్చింది…
- ప్రత్యేకత: ఏ ఇంజినీర్ సహాయం తీసుకోకుండా, కేవలం తల్లి సూచనల మేరకు శిల్పకళకు ప్రాధాన్యం ఇచ్చారు…తిరుమల ఆలయాన్ని పోలిన విధంగా కట్టారు…, తిరుపతి 9 అడుగుల 9 అంగుళాల స్వామి వారి విగ్రహాన్ని, శ్రీదేవి, భూదేవి విగ్రహాలతోసహా తెప్పించి…, మరికొన్ని జైపూర్ నుంచి కూడా ఏకశిలా విగ్రహాలు తెప్పించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు…
- సేవా స్ఫూర్తి: 97 ఏళ్ల వయస్సులో కూడా పండా ఆలయ పనులను దగ్గరుండి చూసుకున్నాడు… నిస్వార్థ సేవకు మారుపేరుగా, ఎందరో వికలాంగులకు, అభాగ్యులకు సేవలు అందిస్తూ సేవామూర్తిగా పేరుపొందాడు…
- తల్లి మౌన దీక్ష: ఆయన తల్లి విష్ణుప్రియ నిత్యం అమ్మవారి ఉపాసన చేస్తూ, మౌనవ్రతం ఆచరిస్తూ, తమ ఇంటికి వచ్చిన వారికి దానధర్మాలు చేయడం ఈ కుటుంబ ఆధ్యాత్మిక నేపథ్యాన్ని తెలియజేస్తుంది…
(photo credit BBC)
విధి ఆడిన వికృత క్రీడ…
2023 ఆగస్టులో ఆలయం ప్రారంభించినప్పటి నుంచి, ఈ దివ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది… అయితే, ఈ ఏకాదశి పండుగకు భక్తుల అంచనాకు మించి సుమారు 20 వేల మందికి పైగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది…
భక్తుల రద్దీని, స్వామిని తనివితీరా దర్శించుకోవాలనే తపనను అదుపుచేయడంలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపించింది… ఇరుకు మార్గాలు, తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం వంటి కారణాల వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది…
దైవ సేవకు తన ఆస్తిని, శ్రమను ధారపోసి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఒక ఆధ్యాత్మికశీలి సంకల్పానికి ఇది ఊహించని విఘాతం… ఈ విషాదం అనూహ్యం, దురదృష్టకరం… ఈ తొక్కిసలాట సాకుగా ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం గనుక గుడిని టేకప్ చేసుకునే ఆలోచన చేస్తే అది సాక్షాత్తూ శ్రీవారికి అపచారం చేసినట్టే… కాకపోతే పునరావృతం గాకుండా కఠిన జాగ్రత్తలు, కట్టుబాట్లు సూచించి, అమలు చేయించండి…!!
Share this Article