.
ఏలియన్స్… గ్రహాంతరజీవులు… అనేక ఏళ్లుగా అదుగో ఫ్లయింగ్ సాసర్స్, ఇదుగో అక్కడ దిగారట… అమెరికాలో గ్రహాంతరజీవుల్ని నిర్బంధించిన ప్రత్యేక స్థావరం ఉందట, కానీ ప్రపంచానికి బయటపెట్టడం లేదట… వంటి వార్తలు బోలెడు చదివాం…
గ్రహాంతర జీవులకు సంబంధించి కల్పనాత్మక సాహిత్యం, రకరకాల కళారూపాల్లో ఊహాగానాలు అనంతంగా సాగుతూనే ఉన్నాయి… అసలు మన ప్రస్తుత పరిజ్ఞానం మేరకు… ఈరోజుకూ ఇతర గ్రహాలపై మనం జీవాన్ని కనిపెట్టలేకపోయాం… ఉండొచ్చునేమో అనే ఆశతో స్పేస్‌లోకి మానవ సంబంధ సంకేతాల్ని పంపిస్తూ, జవాబు కోసం నిరీక్షిస్తున్నాం…
Ads
కానీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా…? మరో ప్రచారం ప్రారంభమైంది… ఏమనంటే..? ఈ వార్త చదవండి…
భూమిపై జరుగుతున్న ప్రమాదకరమైన అణు కార్యకలాపాలపై గ్రహాంతర వాసులు నిఘా పెట్టి ఉండవచ్చునని తాజా అధ్యయనం అంచనా వేస్తున్నది… స్వీడన్ లోని నోర్డిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ కు చెందిన డాక్టర్ బీట్రిజ్ విల్లరో యెల్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది… దాని నివేదిక ఏమంటే…
అణుశకం ప్రారంభ సమయంలో జరిగిన అణు పరీక్షలను మానవేతర నిఘా పరిశీలించి ఉండవచ్చు… 1949 నుంచి 1957 మధ్య కాలంలో అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ అణు పరీక్షలను నిర్వహించాయి… ఆ సమయంలో ఆకాశంలో వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి… ఈ సంఘటనలకు కారణం ట్రాన్సియెంట్స్ (తాత్కాలిక అతిథులు)…
ఖగోళ చిత్రాల్లో ఈ ట్రాన్సి యెంట్స్ అకస్మాత్తుగా, నక్షత్రాల వంటి వెలుగుతో కనిపించాయి… ఇవి కనిపించినంత వేగంగానే మాయమైపోయాయి… 1957లో మానవుల మొదటి ఉపగ్రహం స్ఫుత్నిక్ను ప్రారంభించడానికి చాలా కాలం ముందే ఇవి కనిపించాయి…
అణు పరీక్ష జరగడానికి కాసేపటి ముందు, తర్వాత ఈ గుర్తు పట్టలేని ప్రకాశవంతమైన వస్తువులు కనిపించే అవకాశం 45% ఎక్కువగా ఉంది… కేవలం అణు పరీక్షలు జరిగే రోజుల్లోనే ఫొటోలకు చిక్కిన ఈ వస్తువుల సంఖ్య 8.5% పెరిగింది… వేలాది చారిత్రక ఫొటోలను విశ్లేషించి… కాలిఫోర్నియాలోని పలోమార్ అబ్జర్వేటరీ స్కై సర్వేలో ఉన్న వేలాది చారిత్రక ఫొటోలను ఈ అధ్యయనంలో విశ్లే షించారు…
ఈ అణు పరీక్షలు జరిగినప్పుడు ఈ ట్రాన్సియెంట్స్ సమతలంగా, అద్దం మాదిరిగా. గిరగిరా తిరుగుతూ, ఫ్లయింగ్ సాసర్ ఆకారంలో ఉన్నాయి… ఇతర శాస్త్రవే త్తలు కూడా ఈ అధ్యయనం డాటాను పరీక్షించి, దీనిని తోసిపుచ్చడానికి తగిన కారణాలు లేవని నిర్ధారించారు…
సింపుల్‌గా వేరే కోణంలో చూద్దాం… మరి ఇన్ని దశాబ్దాలుగా గ్రహాంతర జీవుల ఉనికి ఎందుకు బయటపడలేదు..? వచ్చీపోయే అతిథులు కేవలం అణుపరీక్షలపై నిఘా వేసి సాధించేదేముంది..? అన్నింటికీ మించి నిజంగానే గ్రహాంతరాల్లో జీవం ఉందా..? మనకన్నా అడ్వాన్స్‌డా..?
చెప్పలేం, మనిషి ఈ రూపంలోకి పరిణామం చెందడానికి భూవాతావరణం, అనుకూల లక్షణాలు, ఇతర చాలా కారణాలు ఉంటాయి… సో, గ్రహాంతర జీవం ఉన్నా సరే, మన రూపం అసాధ్యం… వచ్చీపోయే అతిథులు అనే మాటే నిజమైతే… ఇన్నాళ్లూ మౌన ప్రేక్షక పాత్రలో మాత్రం ఉండవు..!! మరి ఈ స్టడీ ఏమిటీ అంటారా..? విదేశాల్లో ఇలాంటి బోలెడు స్టడీలు వార్తల్లోకి వస్తుంటాయి… నిజానిజాలు ఆ గ్రహాంతర జీవులకే ఎరుక..!!
Share this Article