.
సెమీ ఫైనల్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన జెమీమా…. నా ఇన్నింగ్స్ జేసస్ దయ అని చెప్పింది.. అది దేవుడి పట్ల కృతజ్ఙత, తను నమ్మిన దేవుడి మీద విశ్వాసం… ఆ నమ్మకం తనకు ఓ ధైర్యాన్ని, నిశ్చింతను ఇచ్చింది… నడిపించింది… అందులో తప్పేముంది..?
ఆమె మీద ట్రోలింగ్ తప్పు… ఆ ఇన్నింగ్స్ తాలూకు గొప్పతనాన్ని జేసస్‌కు మాత్రమే ఇవ్వలేదు, కోచ్‌కు, తల్లికి, తండ్రికి.,.. తన హోమ్ గ్రౌండ్‌కు, తన స్వస్థల ప్రేక్షకులకు కూడా ఇచ్చింది… ఎమోషన్ అది… అదేదో కుట్ర అనే ముద్ర శుద్ధ వేస్ట్… ఆడుతున్నప్పుడు కూడా పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది…
Ads
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్తే తనతోపాటు భగవద్గీతను, చిన్న వినాయక ప్రతిమను తీసుకుపోతుంది… అవి ఆమె ఆధ్యాత్మిక బాసట… అంతులేని భరోసా… ఆ ఫీలింగ్ వ్యక్తిగత ఎమోషన్స్‌కు సంబంధించింది… ఆ పరిమితుల్లోనే చూడాలి దాన్ని…
అంతెందుకు..? నిన్నటి ఫైనల్స్‌లో అనేకసార్లు టీవీలు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను చూపించాయి… మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగే ప్రతిసారీ ఆమె ఏదో ప్రార్థిస్తూ కనిపించింది… ఆమె తను నమ్మిన ఏ గురువునో, ఏ దేవుడినో ధ్యానిస్తోంది… వేలాది మంది ప్రేక్షకుల ఎదుట, కోట్లాది మంది ప్రజలు ఆశలు కేంద్రీకృతమైన సందర్భాన… బలమైన జట్టుతో పోరాడుతున్నప్పుడు ఆ ప్రార్థనలు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి, ఇస్తాయనేది ఆమె నమ్మకం…
వయస్సు 36 ఏళ్లు… ఏళ్లుగా వుమెన్ క్రికెట్ ఆడుతూనే ఉంది… ఆమెకు తెలుసు, ఇంకా చాన్నాళ్లు ఆడలేనని… ఇది చివరి వరల్డ్ కప్ బహుశా ఆమెకు… 2017లో మనకు దూరమైన ప్రపంచకప్ ఫైనల్‌లో కూడా ఆమె ఉంది… ఇది తన కెరీర్‌కు, తన జీవితానికీ ఓ కీలక సందర్భం… అందుకే పదే పదే ప్రార్థన ఈ అర్జున విజేత, పంజాబీ నోటి నుంచి…
ఆల్ రౌండర్… 160 వన్డేల్లో 4389 పరుగులు… 182 టీ20 మ్యాచుల్లో 3654 పరుగులు… పరుగుల యంత్రం ఆమె… మిథాలీ రాజ్ కెప్టెన్‌గా తప్పుకోగానే మరోమాట లేకుండా ఈమెను కెప్టెన్ చేసేశారు… అర్హురాలు… నిన్న ఆమె అణకువ, తన పద్ధతైన ప్రవర్తన, ఒద్దిక మంచి విశేషం… ఒకవైపు తోటి ప్లేయర్లలో సంబరంగా కేకలు పెడుతూ, ఆలింగనాలు చేసుకుంటూనే…
కోచ్‌కు పాదాభివందనం చేసింది… చివరకు ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు ఐసీసీ చైర్మన్ జైషాకు కూడా మొక్కబోతే తను వారించాడు… పెద్దల పట్ల వినయ ప్రదర్శన… దేవుడి పట్ల విశ్వాస ప్రకటన… ఆట పట్ల నిబద్ధత… ఏవీ తప్పు కావు, అవి ఆమె పట్ల మరింత ఆదరణను, గౌరవాన్ని పెంచేవే..!!
చివరి క్యాచ్ పట్టుకుంది తనే… సింబాలిక్‌గా ఆ క్యాచ్ ప్రపంపకప్పును క్యాచ్ పట్టుకున్నట్టే… ఆ బాల్ అలాగే చాలాసేపు పట్టుకుంది, దాచుకున్నట్టుంది తనే… ఆలింగనాలు, కేరింతలు, గెంతుల నడుమ కూడా ఆ బాల్ మాత్రం చేతుల్లో నుంచి జారనివ్వలేదు…
Share this Article