.
Subramanyam Dogiparthi ….. ఫక్తు కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టయినర్ . జేబుదొంగ అని పేరు పెట్టారు కానీ అల్లరి దొంగ లేదా అల్లరి దొంగలు అని పెట్టి ఉండాల్సింది .
చిరంజీవి , భానుప్రియల గోల అంతాఇంతా కాదు . పోటాపోటీగా గోల చేసారు , డాన్సులు చేసారు . వీళ్ళిద్దరి మధ్య డైలాగులు సత్యానంద్ బాగా అల్లరిగా వ్రాసారు . చిల్లర దొంగలయిన ఇద్దరు ఫంక్షన్లలో తారసపడే సీన్లలో అల్లరి , డైలాగులు సరదాగా ఉంటాయి .
Ads
వేటగాడు , కొండవీటి సింహం వంటి బ్లాక్ బస్టర్లను తీసిన రోజా మూవీస్ బేనర్లోనే వచ్చింది ఈ జేబుదొంగ సినిమా . 1975లో శోభన్ బాబు , మంజులతో కూడా ఓ జేబుదొంగ ఉంది . ఈ జేబుదొంగకు దర్శకుడు కోదండరామిరెడ్డి . గొల్లపూడి మారుతీరావు నేసిన కధకు స్క్రీన్ ప్లేని చిరంజీవికి తగ్గట్లుగానే తయారు చేసుకున్నారు .
1+2 సినిమా . భానుప్రియ , రాధ . ఇద్దరితో డాన్సులు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి . పాటలనన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర బాగా పాడారు . డాన్సులను కంపోజ్ చేసిన తారను మెచ్చుకోవలసిందే .
ముఖ్యంగా ఆకు చాటు పిందె చూసా చాటుమాటు పిందె చూసా పాటలో చిరంజీవి , భానుప్రియలు ఒకరినొకరు టీజ్ చేసుకునే పాటలో ఇద్దరూ అదరగొట్టేసారు . చాలా హుషారుగా చిత్రీకరించారు . అలాగే పెదవి పెదవి కలయిక వానపాట . చాలా హాటుగా ఉంటుంది .
- వానపాటలకు ఆది గురువు ఆత్మబలం లోని చిటపట చినుకులు పాట . వానపాటలకు తుఫాను వేటగాడు లోని ఆకు చాటు పిందె తడిసె కోక మాటు పిల్ల తడిసె . ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి , పిందెలు తడుస్తూనే ఉన్నాయి .
తట్టుకోలేనబ్బీ , చూపొకటి విసిరానా వంటి పాటలన్నీ హుషారు హుషారుగానే ఉంటాయి . క్లైమాక్సులో గ్రూప్ డాన్స్ కూడా భారీగా ఉంటుంది . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగా వచ్చాయి . చిరంజీవి , కోదండరామిరెడ్డి , చక్రవర్తి సక్సెస్ కాంబినేషన్ .
దేశాన్ని అస్థిరపరచటానికి కొన్ని విద్రోహ గుంపులు భారీగా విధ్వంసాన్ని చేస్తూ ఉంటాయి . వారిని పట్టుకోవటానికి ప్రభుత్వం జేబుదొంగ చిరంజీవిని సీక్రెట్ ఏజెంటుగా రంగం లోకి దించుతుంది . అతన్ని రంగంలోకి దించటానికి పోలీసు ఆఫీసర్ అయిన రాధ సఫలీకృతురాలు అవుతుంది . ఇద్దరూ కలిసి విలన్లను తుదముట్టించటంతో శుభం కార్డు పడుతుంది . 1+ 2 సమస్య నుండి తానే సైడ్ అయిపోయి ఇద్దరు దొంగల్ని కలిపేస్తుంది రాధ .
ప్రధాన పాత్రల్లో ఈ ముగ్గురితో పాటు , సత్యనారాయణ , గొల్లపూడి , కన్నడ ప్రభాకర్ , రఘువరన్ , పసివాడి ప్రాణం ఏంథొనీ , కుయిలీ , ప్రసాద్ బాబు , రాళ్ళపల్లి , అన్నపూర్ణ , వరలక్ష్మి , గిరిబాబు , కోట శ్రీనివాసరావు , సుధాకర్ , ప్రభృతులు నటించారు .
చిరంజీవి , భానుప్రియ అల్లరి , డాన్సుల కోసం చూసేయవచ్చు . చిరంజీవి ఎవరి పర్సులను అలవోకగా కాజేస్తున్నా ఎవరూ గమనించరు . హీరో కదా ! ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలను వేయకుండా సరదాగా చూసేయటమే .
1987 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . చిరంజీవి , భానుప్రియ , రాధల అభిమానులు ఇంతకుముందు చూసినా మరోసారి చూడవచ్చు . కాలక్షేపం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article